13, ఫిబ్రవరి 2017, సోమవారం

"పుస్తకం దేవోభవ"


మంచి పుస్తకం...
మొదటిసారి చదువుతున్నప్పుడు ఓ ఆత్మీయ నేస్తంలా అన్పిస్తుంది, రెండవసారి చదువుతున్నప్పుడు కొత్త కొత్త జీవితసత్యాల్ని ఆవిష్కరించేదిలా, మరోసారి చదివేటప్పుడు అపారజీవితానుభవమున్న వయోధికుడిలా, మరలా చదివేటప్పుడు ఓ జ్ఞానిలా గోచరిస్తుంది.....
                                               
                                                   
మంచి పుస్తకం...
కాసిన్ని కాగితాలు, బోలెడు అక్షరాలు, పలు పదాల కూర్పు మాత్రమే కాదు, జీవితాన్ని వెలిగించే దీపం కూడా.
                                                       

మంచి పుస్తకం...
ఏ స్థితిలోనూ దూరం కాని నేస్తం. అన్నివేళలా అందుబాటులో ఉండే సలహాదారు. గమ్యం సుగమం చేసే మార్గదర్శి. సుద్దులు చెప్పే అమ్మ. బుద్ధులు నేర్పే నాన్న. జీవనోపాధినిచ్చే అన్నదాత. ఎన్నో వివరించే మానసిక విశ్లేషకుడు. ఔనత్యాన్ని పెంచే వ్యక్తిత్వవికాస నిపుణుడు. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపే గురువు.
                                                   
ఒక మంచి పుస్తకం చదవడం పూర్తయితే మనకో మంచి స్నేహితుడు దొరికినట్లే.

                                                 

ఇలా పఠనాసక్తి ఉన్న పెద్దవారు, పుస్తకప్రియులు మంచి పుస్తకముకై చెప్పే నిర్వచనాలు అనేకం.
                                    
                                                                        *         *       *

పెద్దబాలశిక్ష, బాల సాహిత్యం, కాల్పనిక కాల్పనికేతర సాహిత్యం, పరిశోధన గ్రంధాలు, పద్య శతకాలు, పాకశాస్త్రాలు, వ్యక్తిత్వ వికాస గ్రంధాలు, అర్ధశాస్త్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు.... ఓహో.... ఎన్నెన్నో పుస్తకాలు... అందరి అభిరుచులకు తగ్గట్లుగా. 

సాధారణంగా ఆధ్యాత్మిక సాధకులు వేదాంత గ్రంధ పఠనం చేసినంతకాలం మనస్సు ఉత్సాహంగా తాదాత్య్మముతో దైవ సాన్నిధ్యంలో గడుపుతున్నంత అనుభూతిని పొందుతారు. అయితే అదే అనుభూతితో ఆగిపోకూడదు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. అందుకు తగ్గట్టుగా అధ్యయనం, అధ్యయనం చేసింది అవగాహన చేసుకోవడం, అవగాహన చేసుకున్నది ఆచరణలో పెట్టడం ప్రతీ సాధకునికి అవసరం. ఈ అధ్యయన విషయమై మన శాస్త్రాలు, మహర్షులు, ఆధ్యాత్మిక అనుభవిజ్ఞులు... ఏం తెలుపుతున్నారో ఓసారి గమనిద్దాం - 

ఇదం జ్ఞానమిదం జ్ఞేయం యస్సర్వం జ్ఞాతు మిచ్ఛతి |
అపి వర్షసహస్రాయుః శాస్త్రాన్తం నాధిగచ్ఛతి ||  (ఉత్తరగీత)
ఇది జ్ఞానం, ఇది జ్ఞేయం అని శాస్త్రములను చదివి గ్రహించుటకు సాధ్యం కాదు. ఏలననగా వేలకొలది సంవత్సరములు జీవించియుండి శ్రద్ధతో చదివినను శాస్త్రాంతము కనిపించదు.

అదీత్య చతురో వేదా ధర్మ శాస్త్రాణ్యనేకశ: |
బ్రహ్మతత్త్వం న జానాతి దర్వీ పాకరసం యథా ||
నాలుగువేదములు చదివినను, సమస్త ధర్మశాస్త్రములను చూసినను, బ్రహ్మతత్త్వంను తెలుసుకొనక పోయినచో అనేక పక్వాన్నాదులలో తిరిగెడు గరిటె, వాని రుచులు ఎట్లు తెలుసుకొనచాలదో, అట్లే వీరును ఆ గరిటెకు సమానమే.

అనంతశాస్త్రం బహు వేదితవ్యం స్వల్పశ్చ కాలో బహ వశ్చ విఘ్నా: |
యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమిశ్రం ||
శాస్తములకు అంతము లేదు, అంతయూ చదువుటకు కాలము లేదు, జీవితం చాల స్వల్పం,  దీనిలో అనేక ప్రతిబంధములు కలవు. క్షీరనీరములు కలిసియుండినను హంస నీరమును విడిచి క్షీరమును మాత్రమే గ్రహించినట్లు , సారమైన విషయమును మహాత్ములనుండి గ్రహించి, అనుష్టించి కడతేరుట శ్రేష్టం.

వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా సర్వోన్నత శక్తి లేక ఆత్మ ఒకటి వున్నదని చెప్పేందుకు, దానికి దారి చూపేందుకు మాత్రమే ఉపకరిస్తాయి.
"ఎన్ని భాషలని,ఎన్ని శాస్త్రాలని నేర్చుకుంటారు? వేయిజన్మలెత్తినా అన్ని భాషలూ, అన్ని శాస్త్రాలూ రావు. దేనిని తెలుసుకుంటే సకలమూ తెలుస్తుందో, ఆ ఆత్మ నీ హృదయంలో ఉంది."నేనెవరు" అని ప్రశ్నించుకుంటే మనం ఆత్మ స్వరూపులమౌతాము. అసలు సత్యం నీలోనే వున్నదని అన్ని గ్రంధాలు చెప్తున్నాయి. నీలోనే యున్న ఆ సత్యాన్ని వదిలేసి దాన్ని గ్రంధాలలో వెదుకుట ఏమిటి? నిజమైన గ్రంధం ఆత్మ. ఆ గ్రంధాన్ని చదువు, తెలుసుకో. ఆత్మవిచారణయే సర్వకాలముల యందు చేయదగిన పని. గ్రంధాల అధ్యయనం అన్నది మనల్ని మనం సరి చేసుకొనే దిశలో ఉన్నత మార్గానికి దోహదపడుతుంది..కానీ ఆత్మానుభవం సాధ్యం కాదు.నిన్ను నీవు తెలుసుకో ముందు. పుస్తకం చెప్పేది అదే ..నిన్ను సరిచేసుకొని నన్ను చూడు, నన్ను తాగు అంటుంది. పురాణాలు, వేదశాస్త్రాలు అన్నీ పఠించాను కానీ, ఆత్మజ్ఞానం అంటే ఏమిటొ తెలియదు... అని ఒక పండితుడు అడగగా, జ్ఞానం శాస్త్రాల్లో లేదు. గ్రంధాలు బయట ఉండేవి. జ్ఞానం లోపల ఉండేది. అది తెలిసి ధ్యానించేవారికి ఆత్మజ్ఞానం కలుగుతుంది అని పై రీతిలో వివరించారు, శ్రీ రమణులు. 

'జ్ఞానదేవతు కైవల్యమ్' ... ఆత్మజ్ఞానముననే మోక్షము సిద్ధించుచున్నదని శృతి చెప్పుచుండగా, శాస్త్ర జ్ఞానంచే ప్రయోజనం ఏముంది? ... అని అన్పించవచ్చు కానీ,

ద్వే విద్యే వేదితవ్యే తు శబ్దబ్రహ్మ పరం చ యత్ /
శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్ఛతి // (అమృత బిందూపనిషత్తు)
మానవుడు రెండు విద్యలు నేర్చుకొనవలయును. 1. శబ్దబ్రహ్మము 2. పరబ్రహ్మము. శబ్దబ్రహ్మమనగా శాస్త్రము. పరబ్రహ్మమనగా ఆత్మజ్ఞానం. అయితే శబ్దబ్రహ్మమందు నిష్ఠ కలిగినవాడు మాత్రమే పరబ్రహ్మమును పొందగల్గును అని ఉపనిషత్తు బోధించుచున్నది. 

మరి ఈ శాస్త్ర అధ్యయనం ఎంతవరకు?

శాస్త్రాణ్వధీత్య మేధావీ అభ్యస్య చ పునః పునః |
పరమం బ్రహ్మ విజ్ఞాయ ఉల్కావత్తాన్యథోత్సృజేత్ || (ఉత్తరగీత)
ప్రజ్ఞావంతుడగువాడు వేదాంతశాస్త్రంను చక్కగా చదివి ఆ శాస్త్రార్ధమును మాటిమాటికి అభ్యసించి పరబ్రహ్మమును సాక్షాత్కరించుకొని, అన్నం ఉడికిన పిమ్మట కొరివికట్టెలను విడుచునట్లు, శాస్త్రములను విడవవచ్చునని కృష్ణభగవానుని వాక్కు.
అన్నము పక్వమగువరకు మంట ఎట్లుండవలెనో అట్లే జ్ఞానవిజ్ఞాన సంపూర్ణత్వం కలుగువరకు శాస్త్రాధ్యయనం తప్పనిసరిగా ఉండవలెను.

గ్రంధమభ్యస్య మేధావీ జ్ఞానవిజ్ఞానతత్పరః
పలాలమివ ధాన్యార్ధీ త్యజేత్ గ్రంధమశేషతః
మేధాసంపత్తి గలవాడు విద్యను బాగుగా అభ్యసించి జ్ఞానమున్ను, విజ్ఞానమున్ను కలిగినపిమ్మట శాస్త్రమును విడువవలయును. కర్షకుడు పైరును పోషించి, పండించి ధాన్యమును తీసుకొని పిమ్మట గడ్డిని త్యజించునేగాని, గడ్డి యుపయోగము లేదని తలంచి మొదటనే త్యజించినచో ధాన్యం దొరకదు గదా.
ధాన్యము నభిలషించు కర్షకులు, తమకు కావలసిన్నది ఫలమే యైనను, సకాలమున వ్యవసాయముచేసి విత్తనముల జల్లి, కలుపును తీసేసి, మంచి ఎరువుల సహాయంతో పైరును చక్కగా పోషించుచున్నారు. తమ ప్రయత్నం ఫలించిన తదుపరి ధాన్యమును తీసికొని గడ్డినెట్లు వదులుచున్నారో, అట్లే మోక్షాసక్తుడగు మేదావంతుడును వేదాంతగ్రంధముల నధ్యయనము జేస్తూ, సకాలంలో సరైన సాధనను చేసి,  అహంను తీసేసి, సద్గురువు సహాయంతో ఆత్మజ్ఞానము సంపూర్ణముగా పొందిన పిదప గ్రంధపఠనంను విడువవలెను. 

నావార్ధీ హి భవేత్తావత్ యావత్పారం న గచ్ఛతి |
ఉత్తీర్ణే తు సరిత్పారే నావయా కిం ప్రయోజనమ్ ||
ఎంతవరకు నది ఆవలదరిని చేరదో, అంతవరకు నదిని దాటుటకై పడవ యుండవలసిందే. ఏరు దాటిన మీద ఆ నావ ఉపయోగం లేదు.

అయితే ఇక్కడ మనమో విషయమును గమనించాలి - 

ఆధ్యాత్మిక సాధన అంతరంగానికి సంబంధించినది. అది మనస్సులోనే జరగాలి. సత్యాన్ని బాహ్యంగా అన్వేషించుట కూడదు. ఆత్మే పరమాత్మ అనే సత్యాన్నే అన్ని గ్రంధాలు ప్రభోధిస్తున్నాయి. ఇది అనుభవంలోకి రావాలంటే తీవ్రసాధన అవసరం. అయితే, ఇది అనుభవంలోకి రాకపోవడానికి కారణం మనస్సే. మనస్సే మన స్వరూపాన్ని మరుగు పరుస్తుంది. అనుభవానికి రానీకుండా చేస్తుంది. మాయంటే ఏదో కాదు, మనసే మాయ. ఈ మాయ విడిపోతే స్వరూపం అనుభవానికి వస్తుంది. పరిపక్వమైన మనస్సు కలవారే, సత్యంను తీవ్రసాధన చేత అనాచ్చ్చాదితముగా అనుభవించ గలుగుదురు. కానీ సంసారబాధ్యతలతో, ఇతరత్రా విషయవాంఛలతో,  ప్రతిబంధకాలతో సాధన చేయటానికి వ్యవధి లేనప్పుడు, ధ్యానం చేయడానికి ఏకాగ్రత కుదరనప్పుడు మనస్సుకు పరిపక్వత రాదు. అశాంతితో భారమౌతుంటుంది. ప్రాపంచిక మాయలో పడిపోతుంది. అలా మాయలో పడకుండా చేసే సాధనలో పుస్తకపఠనం ఓ సోపానమే అవుతుంది. అలాగని అదేపనిగా శాస్త్ర అధ్యయనంలోనే మునిగిపోకూడదు. శాస్త్రం ఏం చెప్తుందో గ్రహించి, అనుష్టించి ఆత్మసాక్షత్కారం పొందాలి. 

శ్రీ రమణమహర్షి, శ్రీ శంకరభగవద్పాదులవారు, రామకృష్ణపరమహంస తదితరవారంతా బ్రహ్మత్వం సిద్ధించాక కూడా శాస్త్ర పఠనం చేస్తూ, తమ దర్శనార్ధం వచ్చే సాధకుల చెంత శాస్త్ర చర్చలు, గ్రంథపఠనాలు సాగించేవారు.  ఎందుకని మరి?

కాస్త లోతుగా ఆలోచిస్తే ...

శాస్త్రమను ఓడలేనిచో సంసారసాగరం దాటలేం. నది దాటిపోయిన వారికి పడవ అవసరం లేదు.
అలాగని, ఆత్మజ్ఞానం పొందినవ్యక్తి పడవను త్యజించి వెళ్ళడు. పడవను పదిలపరుస్తాడు. ఎందుకనగా ఆవల నుండు జనులను మరల దాటించుటకది అవసరం. ముక్తులైనవారులలో ఇతరులు తరించవలెనన్న సద్భుద్ది ఉంటుంది. అందుచే బద్ధులను విముక్తి చేయదలంచు ముక్తులైన జీవన్ముక్తులు తమ జీవితాంతం వరకు శాస్త్రాధ్యాయనుష్టానములను  ఆచరించుకొనియే యుందురు. 

'అసుప్తేరామృతే: కాలం నయేద్వేదాంతచింతాయా' ... లేచింది మొదలు నిద్ర పోయేంతవరకు, జన్మించిన పిమ్మట మరణం కలుగువరకును కాలమును వేదాంత చింతనంచేత గడుపవలయును.

తన అజ్ఞానంను మాత్రమే పోగొట్టుకొన తలచినవానికి గురువాక్యమొక్కటి చాలును. కాని ఇతరుల అజ్ఞానమును పోగొట్టకోరిక గలవానికి శాస్త్ర సాధన కూడా కావలయునని అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస. 

మనస్సును ప్రాపంచికవిషయ రహిత మొనర్చుకో వలయునన్న, మాయలో పడకుండా చూసుకోవాలన్న జ్ఞానత్వం తప్పనిసరి. ఆ జ్ఞానత్వంనకు శాస్త్రపఠనం ఆవశ్యకం. శాస్త్రజ్ఞానం అలవడిన ఆత్మజ్ఞానం ఉదయించును. అగ్నికి వాయువు ఎంత అవసరమో, అట్లే ఆత్మజ్ఞానానికి శాస్త్రజ్ఞానమూ అంతే అవసరం.
మొక్కను సంరక్షించినచో స్వయంగా మ్రానై పల్లవించి పుష్పించి ఫలమై, ఆ ఫలం పరిపక్వమై అప్రయత్నంగా  క్రిందకు ఎట్లు రాలునో, అట్లే శాస్త్రాలను అధ్యయనం చేస్తూ అనుష్టించినచో మనస్సు పరిపక్వమై  దేనితో విషయసంపర్కం లేకుండా ఆత్మసాక్షాత్కారఫలం పొందడం జరుగుతుంది.
అందుకే, 
'వేదాభ్యాసో హి విప్రస్య తపః పరమిహుచ్యతే'... వేదాధ్యయనము ఉత్తమ మానవునికి గొప్పదగు తపస్సన్నది మనుమహర్షి మాట కాగా, 'స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే' ... అధ్యయనమే తపస్సు లన్నిటిలోను ముఖ్యమైన వాక్తపస్సని గీతాచార్యుని వచనం.
శ్రీ శంకరులవారు, శ్రీ రమణులు, శ్రీ రామకృష్ణులవారు శాస్త్రజ్ఞానం కలవారగుటచే అనేకవిధముల ప్రభోదించి ప్రజల యొక్క అజ్ఞానావరణమును తొలగించి జ్ఞానభాస్కరుణ్ణి ప్రకాశింపజేసిరి. 


ఏది ఏమైనా, ఓ మంచి పుస్తకపఠనం పూర్తయిన పిమ్మట నా మదిలో మెదిలే మాట  ఒకటే ... "పుస్తకం దేవోభవ"

వాట్సాప్ లో నాకు వచ్చిన, నచ్చిన చిరు వీడియో ... 
video


28, జనవరి 2017, శనివారం

సూర్యారాధన

చంద్రుడు 'మఖ' నక్షత్రముతో కూడుకున్నమాసం మాఘమాసం. విష్ణువుకు ప్రీతిపదమైన మాసం. ఉత్తరాయన పుణ్యకాలంలో వచ్చే పుణ్యప్రదమైన మాసం. పలు ప్రత్యేకతలతో ప్రశస్తమైనది ఈ మాఘమాసమని పెద్దలు చెప్తుంటారు. 
మఘం అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువుకు ఈ మాసం శ్రేష్టమైనది. మా + అఘం = మాఘం పాపం లేనిది అని మరో అర్ధం. 
మాఘశుద్ధ చతుర్థిని వరగణేశ చతుర్థిగా, మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా, మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగా, మాఘశుద్ధ ఏకాదశిని భీష్మఏకాదశిగా, మాఘశుద్ధ ద్వాదశిని భీష్మద్వాదశిగా, మాఘశుద్ధ పూర్ణిమను మహామాఘిగా, మాఘ బహుళ చతుర్థిని సంకష్ట హరచతుర్థిగా, మాఘ బహుళ చతుర్ధశిని మహాశివరాత్రి పర్వదినంగా మాఘ కృష్ణ అమావాస్యను పితృతిధిగా పేర్కొంటారు.
ఈ మాసంలో అరుణోదయస్నానం అత్యంత పవిత్రమైనదని ప్రతీతి. సూర్యుడు మకరంలో ఉండే మాఘమాసంలో,  సూర్యుడు ఉన్నరాశిని బట్టి, ప్రత్యూష సమయంలో సూర్యకిరణాలు పడే కోణాలు బట్టి, ఆ సమయంలో సూర్యకిరణాలలో వుండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రత బట్టి ప్రత్యూషకాలంలో  (సూర్యోదయమునకు ముందు) చేసే స్నానాలు ఆరోగ్యకరం. 
మాఘమాసంలో నదీ స్నానం సర్వశ్రేష్ఠమైనది. ఇది అందరికీ సాధ్యంకాదు కాబట్టి, ఎక్కడ స్నానం చేసినను ముందుగా -
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు||
అని పుణ్యనదులను స్మరించుకొని, ఈ క్రింద శ్లోకాలను చదువుకుంటూ స్నానం చేయాలి.
దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషనాయ చ |
ప్రాతఃస్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం ||
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ |
స్నానేనానేనమే దేవ యధోక్త ఫలదోభవ ||
మాసమంతా స్నానం ఈరీతిలో చేయలేనివారు కొన్ని ముఖ్య తిధులలోనైనా చేస్తే మంచి ఫలితమును పొందుతారని పెద్దలు చెప్తుంటారు.
మాసపర్యంతం స్నానా సంభవే త్ర్యహమేకాహం వా స్నాయాత్
మహామాఘం పురస్కృత్య సస్నౌ తత్ర దినత్రయమ్
మాఘమాసమంతా స్నానం చేయలేని యెడల మూడు దినాలైన పైరీతిలో స్నానం నియమంగా చేయాలని, తద్వారా వేల యాగాల ఫలం లభిస్తుందని పద్మపురాణం పేర్కొంటోంది.
                                            
video
                                                ఈ వీడియో వాట్సాప్ ద్వారా సేకరించింది. 
                                                రూపకర్తకు నమస్సులు. 

మాఘశుద్ధ సప్తమి - రధసప్తమి. 
సూర్యుని ఆవిర్భావం. 
సూర్యజయంతి.
సూర్యుణ్ణి ఆరాధించే పర్వదినం.
సప్తాశ్వరధం మీద సంచరించే సూర్యభగవానుడు తన సంచారగతిని మార్చుకునే రోజిది.
ఈనాటి బ్రహ్మీముహూర్తంలో ఆకాశంలోని ప్రముఖ నక్షత్రాలన్నీ రధాకారంలో అమరివుండి సూర్యరథాన్ని తలపింపజేస్తాయని ప్రతీతి.
చలి క్రమంగా తగ్గుతూ సూర్య కిరణాల సంజీవనితో జీవులు నూతనోత్సాహంతో, ఆరోగ్యంతో పుంజుకోవడం ఈరోజు నుండే ప్ర్రారంభమవుతుంది.
ఈరోజు నుండి పూర్తిగా ఉత్తరదిశగా సూర్యుని గమనం సాగుతుంది. ఉత్తరమార్గ గమనంను ఊర్ధ్వ ముఖ గమనంగా చెప్తారు ఆధ్యాత్మికవేత్తలు. మూలాధారమునుండి సహస్రారం వైపు గమనం మోక్షగమనం. ఈ గమనం జీవుల్ని ఊర్ధ్వముఖులై తరించమన్నదానికి సూచనగా సాధకులు గ్రహించాలి.
ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. సూర్యగ్రహణ తుల్యాతుశుక్లామాఘస్య సప్తమి. ఈ కారణంచే గురువునుండి మంత్రదీక్షలు తీసుకున్నా, కొత్త పుణ్య కార్యక్రమాలు చేపట్టినా, ఉపదేశింపబడ్డ మంత్రాలను అధికసంఖ్యలో అనుష్టించినా, ఆదిత్యహృదయంను పారాయణం చేసినా విశేషఫలముంటుందన్నది శాస్త్ర వచనం.

మాఘశుద్ధ సప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానిస్తూ, జిల్లేడు, రేగు ఆకులను తలపై భుజాలపై పెట్టుకొని స్నానమాచరించాలి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలు పఠించాలి -
నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః |
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే ||
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు |
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ ||
ఏతజ్జన్మ కృతం పాపం యజ్ఞన్మాంత రార్జితమ్ |
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః ||
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే |
సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరీ సప్తమీ ||
జన్మ మొదలుగా చేసినదియూ, జన్మాన్తరాలలో చేయునదియూ అగు శోక రోగ రూపంలోనూ వుండు పాపమంతయూ మకరంలోని సప్తమీ హరించుగాక. ఈ జన్మయందు, జన్మాన్తరమందు మనో వాక్కు ఇంద్రియాలచే తెలిసీ తెలియక చేసిన ఏడు విధాలుగా రోగం రూపంలో వుండే సప్తవిధ పాపమంతయూ ఈ స్నానంచేత నశించాలన్నది ఈ మంత్రార్ధమని ధర్మసింధు తెలుపుతుంది. 
స్నానానంతరం -
సప్తసప్తివహ ప్రీత సప్తలోకప్రదీపన |
సప్తమీసహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ||
అంటూ సూర్యునకు ఆర్ఘ్యమివ్వాలి. తదుపరి సూర్యునికి పూజించాలి.
ఎర్రచందనం, ఎర్రని పుష్పాలతో సూర్యభగవానుని అర్చించడం విశిష్టమైనది.
ఈరోజు సూర్యభగవానుణ్ణి ఆరాధించి ఆవుపేడ పిడకల మంటతో వండిన క్షీరాన్నాన్ని చిక్కుడాకులతో నివేదించాలి. చిక్కుడుకాయలతో చేసే రధాన స్వామిని ఆవహింపజేసి పూజించాలి.
మన ఆచారాలలో ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలున్నాయి. సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వచేసుకునే వృక్షాలలో జిల్లేడు, రేగు ప్రధానమైనవి. ఈ ఆకుల్ని స్పృశిస్తూ స్నానం చేయడంవలన వీటిలోని శక్తి, నీటిలోని విద్యుచ్చ్చక్తి శరీరంపై ప్రభావాన్ని చూపి, ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. ఈ ఆకుల్లో నిల్వచేయబడిన ప్రాణశక్తి, శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి, నాడుల్ని ఉత్తేజపరుస్తూ మానసిక దృఢత్వం, జ్ఞాపకశక్తిని పెంచి,   శిరస్సంబంధమైన రోగాలను నశింపజేస్తుంది. అందరికీ ఆరోగ్యప్రదాత. అందుకే  'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్' అని శాస్త్రాలు శ్లాఘిస్తున్నాయి. 
ప్రతిరోజూ ఇలా స్నానం చేయడం ఎంతో శుభకరం. కానీ, నేటి మనం అంతలా నియమంగా చేయలేము కాబట్టి,  సంవత్సరానికి ఒక్కరోజైనా ఇలా ఆచరించి మహాప్రయోజనం పొందవచ్చని మహర్షులు ఈ సూర్య జయంతి రోజైనా ఇలా చేయమని నిర్ధేశించారు. 
[ఇన్ని శ్లోకాలు చదవలేని మాబోటివారి గతేమిటి బాబయ్య అని అడిగిన ఓ రైతుకు, ఓ సూర్యనారాయణ తెలిసీ, తెలియక చేసిన నా పాపములను నశింపజేసి, సద్బుద్ధిని ప్రసాదించు అని అనుకుంటూ, మనసార సూర్యుణ్ణి నమస్కరిస్తూ, సప్త సప్త మహాసప్త, సప్తమీ రధసప్తమి అని ఏడుసార్లు జపిస్తూ స్నానం ముగించాలని, అదీ కష్టమనుకుంటే ఓ సూర్యనారాయణమూర్తీ నీకివే నా హృదయపూర్వక నమస్సులు అని భక్తిపూర్వకంగా పెడితే చాలు, ఆయన నమస్కారప్రియుడు. 'నమస్కార ప్రియో భాను:' భక్తిగా నమస్కరిస్తే చాలు అనుగ్రహిస్తాడు ఆదిత్యుడు, అని  మా తాతయ్యగారు చెప్పినమాటలు లీలగా జ్ఞాపకం]
సూర్యుడు ఓ ఖగోళ గోళం, 
సూర్యుడు ఓ గ్రహం,
సూర్యుడు ఓ మండే గోళం ... 
అటువంటి సూర్యుడు హిందువులకు భగవంతుడు ... నాస్తికుల పరిహాసమిది.
అవును ... 
సూర్యుడు ప్రత్యక్షదైవం. 
సూర్యుడు ఖగోళ గోళం కాదు,
సూర్యుడు  గ్రహం కాదు,
సూర్యుడు మండే గోళం కాదు,
హిందువులకు మాత్రమే కాదు, సకల ప్రాణకోటికి సూర్యుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు.
సూర్యుని కిరణాల వేడికి సముద్రపునీరు ఆవిరై, మబ్బుగా మారి, వానై, ఏరై, నదులై, నేలను సస్యశ్యామలం చేస్తూ, ప్రాణుల దప్పికను తీరుస్తూ, పంటలను పండిస్తూ, అందరికీ అన్నదాతై, ఆరోగ్య ప్రదాతై, జీవదాతై ప్రకాశిస్తున్నాడు సూర్యుడు. భూమి గుండ్రంగా తిరుగుతుండడం వలన రాత్రీపగలు ఏర్పడుతున్నాయి తప్ప, సూర్యుడు ఎప్పుడూ కాంతిమయుడే. చంద్రునిలో తేజస్సు, అగ్నిలో తేజస్సు, జలంలో విద్యుత్తుకాంతి, మన కంటిలో వెలుగూ, మనం స్వీకరించే ఆహారంను జీర్ణం చేసే జఠరాగ్నిలో ఉష్ణశక్తి... అన్నీ సూర్యతేజస్సువే. అంటే సూర్యుడు లేనిదే జగమే లేదు, ప్రాణికోటి లేదు.
సూర్యగతిని అనుసరించే ఋతువులు, అయనాలు ఏర్పడ్డాయి. సూర్యుని ఆధారంగానే కాలగణనను చేస్తారు, పంచాంగం రూపొందిస్తారు.
పగలు చైతన్యవంతంగా, రాత్రుళ్ళు నిద్రిస్తూ ఉంటామంటే అందుకు కారణం సూర్యకాంతి. తన దివ్యకిరణాలతో తేజస్సునూ, చైతన్యశక్తినీ అందిస్తున్నాడు కాబట్టి 
సూర్యకాంతి ఉన్నప్పుడు చైతన్యంగా ఉంటాం. ప్రాణికి ప్రధాన జీవనహేతువు చైతన్యమే అయినప్పుడు, ఆ చైతన్యమును మనకి అందించే సూర్యుడు దేముడు కాడా? 
తన కిరణాలనే చూపులతోనే సమస్త సృష్టిని ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా చేసే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు. 
సూర్యారాధనమనేది జాతి కుల మతాలకు అతీతంగా అందరూ అలవర్చుకోవడం ఆవశ్యకర్తవ్యం. 
నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే
ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, లయలకు సూర్యుడే కేంద్రమని వేదం కూడా స్తుతించింది. సూర్యుడు త్రిమూర్త్యాత్మకపరమాత్ముడు. 'సూర్య ఆత్మా జగత స్తస్థుషశ్చ' జగత్తుకు సూర్యుడే ఆత్మయని యజుర్వేదమంటుంది. 'ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు' శరీరమే రథమని అంటుంది కఠోపనిషత్తు. ఇలా అనేక ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అంతరార్ధాలతో పభవిస్తున్నాడు ప్రభాకరుడు. 

సూర్యుని పుత్రుడు యమధర్మరాజు. అందువలన సూర్యారాధన వలన అపమృత్యు భయముండదు. మరో కుమారుడు శనైశ్చరుడు. అందుచే శనిగ్రహపీడ ఉండదు. అసాధారణ కార్యసాధనకు, శత్రువిజయానికి, అన్న సంపాదనకు, ఆత్మరక్షణకు సూర్యుణ్ణి ఆరాధించాలని గ్రహించి, సూర్యోపాసనతో అనేక సత్ఫలితాలు పొందినవారున్నారు. అగస్త్యుడు బోధించిన ఆదిత్య హృదయ ప్రభావంతో శ్రీరాముడు రావణున్ని సంహరించగలిగాడు. అరణ్యవాసంలో ధర్మరాజు సూర్యానుగ్రహంతో అక్షయపాత్రను  పొంది, ఆహారకొరత లేకుండా, అతిధిసత్కారాలతో ధన్యుడైనాడు. విరాటనగరంలో ద్రౌపది సూర్యుణ్ణి ఆరాధించి కీచుకుని మందిరంలో ఆ దుర్మార్గుని బారినుండి రక్షింపబడినది. సూర్యుణ్ణి ఉపాసించి సత్రాజిత్తు శమంతకమణిని సంపాదించాడు. మయూరుడు సూర్యానుగ్రహంతో కుష్టురోగం నుండి విముక్తుడయ్యాడు. 


3/2/2017 న రథసప్తమి. 
ఆదిత్యున్ని ఆరాధించడం వలన ఆరోగ్యం, ఆయుష్షు, తేజస్సు, ఐశ్వర్యం సమృద్ధిగా ప్రాప్తిస్తాయి. 


9, డిసెంబర్ 2016, శుక్రవారం

"దత్తోహం"

బ్రహ్మ మానసపుత్రులైన సప్తర్షులలో ఒకరు అత్రి మహర్షి. ఈయన విశేష తపఃసంపన్నుడు. అత్రి అంటే "ఆధ్యాత్మికాది తాపత్రయ రహితత్వేన అత్రిశబ్దవాచ్యో జీవన్ముక్తో కశ్చిన్మహర్షి:" ఆధ్యాత్మిక, అధిదైవిక, ఆధిభౌతికములనే మూడు తాపత్రయములు లేనివాడు. సత్త్వ, రజో, తమోగుణాలు, గ్రంధిత్రయాలు లేనివాడు అత్రి.


కర్దమ ప్రజాపతి ద్వితీయ పుత్రిక అనసూయాదేవి. "యస్యాం నవిద్యతే అసూయ సా అనసూయ" ఏ స్త్రీయందు అసూయ వుండదో ఆమె అనసూయ. అనసూయ అంటే అసూయను వీడిన తత్త్వం. పరిశుద్ధంగా వుండే తత్త్వం.

అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయ. ఈమె మహాసాధ్వి. ఈమె పాతివ్రత్య ప్రభావం గురించి ముల్లోకాల్లోనూ నారదులవారివలన విస్తరించగా, లక్ష్మి, పార్వతి, సరస్వతులు ఒకింత అసూయతో (ఈ మువ్వురమ్మలకు అసూయ ఏమిటి? వారు శక్తి స్వరూపులు కదా ... అని నాకు ఈ కధ చెప్తున్న మా తాతయ్యగారిని నేనడగగా, తల్లీ! కైకేయి ఆ వరాలు  కోరకపోతే రాముని అవతార కారణం సఫలం కాదు, అలాగే మానవాళిని జ్ఞానమార్గంలో తరింపజేయలన్న తలపుతో శ్రీ దత్తుని అవతారం లోకోద్ధారణకు అవశ్యం కాబట్టి ఆ అమ్మవార్లు మానవాళి శ్రేయస్సుకై అలా స్పందించారని చెప్పారు)


ఆ మువ్వురమ్మలు అనసూయను పరీక్షింపదలచి, తమ భర్తలను పంపగా, ఆ త్రిమూర్తులు ఓ మధ్యాహ్న వేళ, మునివేషాలతో అత్రిమహర్షి ఇంట్లోలేని సమయాన అతిథులుగా వచ్చి,  భోజనాల సమయంలో ఆమెను వివస్త్రయై వడ్డించమనగా, వారిని పసిబిడ్డలుగా మార్చేసి, పుత్రవాత్సల్యంతో తన స్తన్యపానము చేయిస్తుంది. పిమ్మట ఇంటికి వచ్చిన అత్రిమహర్షి దివ్యదృష్టితో సత్యాన్ని గ్రహించడం, అటుపై కొంతకాలానికి మువ్వురమ్మలు  తమ భర్తల స్థితిని గతిని తెలుసుకొని, 
అత్రిమహర్షి ఇంటికి అరుదెంచి పతిభిక్ష పెట్టమని అర్ధించగా, వారి కోరిక మేరకు అత్రిమహర్షి త్రిమూర్తులను ప్రసాదించడం,  ఆపై కొంతకాలమునకు మాండవ్యుడనే మహర్షి, మరునాటి సూర్యోదయంలోగా మరణిస్తావని సుమతి అనే పతివ్రత భర్తను శపించడం, ఆ పతివ్రత సూర్యోదయంను ఆపేయడంతో, ఆ అకాల ప్రళయంను నిలువరించమని దేవతలు అనసూయను వేడుకోగా, ఆమె సుమతికి నచ్చజెప్పి, సూర్యోదయంను చేయించి, విగతప్రాణుడైన సుమతి భర్తను బ్రతికించడం, 

ఈ అద్భుతకార్యంకు సంతసించిన త్రిమూర్తులు వరం కోరుకోమనగా, తనకు ఇతరత్రా కోరికలు లేవని, భర్తకు పూర్వమిచ్చిన వరమును పూర్తిచేయవలసిందిగా కోరిన కొద్దికాలానికి మువ్వురు అంశలతో చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ఆ పుణ్యదంపతుల తపఃఫలంగా పుత్రులై ప్రభవించినట్లు  పురణాల కధనం.


                                                              దత్తాత్రేయుడు

శ్రీ దత్తాత్రేయుడు మూర్తిత్రయాత్మక స్వరూపుడు. (మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే) బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకత్వాన్ని సూచించే స్వరూపం.
స్థూల సూక్ష్మ కారణము లనెడు దేహత్రయమును దత్తముజేసినవాడు (దత్తమనగా ఇవ్వబడిన లేక త్యజింపబడిన) దత్తాత్రేయుడు. దేహత్రయాతీత సాక్షిచైతన్య స్వరూపుడు.
జాగ్రత్ స్వప్న సుషుప్తులనెడి అవస్థాత్రయం లేనివాడు దత్తాత్రయుడు.
సత్వ, రజో, తమో గుణాలు మూడింటికీ అతీతుడైనవాడు దత్తాత్రేయుడు.
అకార ఉకార మకారములనెడు మూడుమాత్రలకు మూడక్షరములకు మూలస్వరూపుడై, త్రిమూర్తులకు పరమై, సత్యజ్ఞానానందమూర్తియైన శ్రీ దత్తాత్రేయుడు షోడశ కళా పరిపూర్ణుడైన పరబ్రహ్మతత్త్వంకు ప్రతీక.

దశావతారాలలో దత్తాత్రేయుని అవతారం లేనప్పటికీ త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తుడిది అత్యంత విశిష్ట జ్ఞానావతారం. భాగవతంలో పేర్కొన్న ఏకవింశతి (21) అవతారములలో ఒకటి దత్తావతారం.  సాధారణంగా భగవంతుడు దుష్ట శిక్షణ - శిష్ట రక్షణకై అవతరిస్తుంటాడు. అటులనే ఈ దత్తావతారంలో జ్ఞానత్వం ద్వారా మనలో ఉన్న దుష్ట సంస్కారాలను, అజ్ఞానమనే అసురత్వాన్ని సంహరించడం జరిగింది.   భగవానుని అనేక అవతారములు, వారు అవతరించడానికి కారణమైన కార్యము పూర్తయ్యాక తిరిగి అంతర్ధానం అయ్యాయి. కానీ, శ్రీదత్తునిది నిత్యావతారం.

శ్రీ దత్తుడు గురువు, దైవమూ కూడా. అందుకే ఆయనను 'గురుదేవదత్త'గా కొలుస్తారు. స్మరించిన మాత్రమునే సంతుష్టుడై సంరక్షిస్తాడని 'స్మర్తృగామి' అని కీర్తిస్తారు. తత్త్వ జ్ఞానాభిలాషులకు "యోగి"లా, ఇతరులకు "బోగి"లా దర్శనమిచ్చే శ్రీ దత్తుడు, ఐహికాముష్మిక ఉభయ ఫలప్రదాత. జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించే భక్తసులభుడు.

యోగమే శ్రీ దత్తుని మార్గం.
నిస్సంగత్వమే శ్రీ దత్తుని ఉపదేశం.
జ్ఞానమే శ్రీదత్తుని ఉపాసన.లోకంలోని సర్వులకు జ్ఞానమార్గంలో తరింప చేయగోరి, అనసూయమాత తన పాతివ్రత్య భక్తితో, 
అత్రి మహర్షి తన తపోశక్తితో, 
ఆదిగురువుగా, తనని తాను లోకాలకు దత్తం చేసుకున్న శ్రీ దత్త భగవాన్ అవతరించినట్లు చేసిన ఈ పుణ్యదంపతులకు ముందుగా నమస్కరిస్తూ ...


                                                        
                                             
శ్రీ దత్తాత్రేయ స్తుతి 
                                      అనసూయాత్రి సంభవం అఖండ జ్ఞాన వైభవం
                                      అనందతేజో స్వరూపం దత్తాత్రేయమహం భజే ||

                                      త్రిగుణ రహితం దేవం త్రిమూర్తి స్వరూపం విభుం 
                                      సద్గురుం కరుణామయం దత్తాత్రేయమహం భజే || 

 
    
              ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ:  ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ:  ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ: 

దత్త ఆరాధకులు, ఆధ్యాత్మిక సాధకులు "దత్తోహం" అని ధ్యానిస్తూ ఉంటే, దత్త స్వరూపులుగా, అవధూతలుగా మారతారని ప్రతీతి.


మార్గశిర శుక్ల పూర్ణిమ "శ్రీ దత్త జయంతి". సందర్భంగా ఈ దత్త స్మరణ ... 
                                             
                                                                "దత్తోహం" 

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఎందుకు???

'సర్వం ఖల్విదం బ్రహ్మ' సర్వమూ బ్రహ్మమే అయినప్పుడు, అందరూ ఆత్మస్వరూపులే అయితే ... ప్రత్యేకించి ఆలయాలకు వెళ్లడం ఎందుకు? ఆహారనియమాలెందుకు? పూజలెందుకు? ధ్యానమెందుకు? నియమనిష్టలెందుకు? శాస్త్ర పఠనమెందుకు? సత్సంగాలెందుకు?
పై ప్రశ్నలన్నీ ఓ తెలిసిన అమ్మాయి అడిగింది. ఆ క్షణంలో, తనలో ఎన్నో ఏళ్ళ క్రితం నన్ను నేను చూసుకున్నట్లయింది. ఈనాడు ఈ అమ్మాయి ధైర్యంగా అడిగినట్లుగా, ఆనాడు నేను ఎవర్నీ అడగలేకపోయాను. అయితేనేం, భగవంతుని అనుగ్రహం వలన కాలక్రమేణా పుస్తక పఠనం వలన నా సందేహాలు తీర్చుకున్నాను. 

మనది పరోక్ష జ్ఞానం. అంటే మన ఋషులు, మహర్షులు, పూర్విజులు చెప్పింది పఠన శ్రవణముల ద్వారా తెలుసుకొన్నది. దానినే ప్రత్యక్షజ్ఞానం ద్వారా తెలుసుకొని ముక్తిత్వం పొందడానికే పై సాధనలు తల్లీ. 
దీపం గురించి తెలిసినంతమాత్రమున చీకటి పోతుందా? అన్నం గురించి మాట్లాడితే ఆకలి, నీరు గురించి మాట్లాడితే దాహం తీరుతాయా? అలానే వినడంవలన, తెలుసుకోవడం వలన ప్రయోజనం లేదు. భావనమయప్రజ్ఞ (అనుభవపూర్వకంగా తెలుసుకోవడం) అన్నింటికన్నా ముఖ్యం. 


మనస్సును జయించడం, మనస్సుకు అతీతులమవడం, చెడుగుణాలు తొలగించుకోవడం, మనలోపల ప్రక్షాళన జరగడం, సంపూర్ణంగా జీవించడం, అర్ధవంతంగా ఆరోగ్యవంతంగా ఆనందదాయకంగా జీవించడం, పరమ గమ్యంకు చేరడం, మానవజన్మకు సార్ధకత చేకూరడం ... ఇత్యాదులన్నీ పై సాధనల వల్లే సాధ్యం. 

మహర్షి, సద్గురు శ్రీ మలయాళస్వాములవారు ఇటువంటి ప్రశ్నలు అడిగిన ఓ వ్యక్తికి చక్కటి సమాధానమిచ్చారు. ఆ సమాధానం నా మనస్సులో ముద్రించుకుపోయింది. నన్ను ప్రభావితం చేసిన ఆ సమాధానం యధాతధంగా - 
"వ్యవసాయకుడు తన క్షేత్రము నందున్న రక్కీస, చిల్లకంప మొదలగు కంటకముల పాదులను తొలగించి, సంపూర్ణంగా కలుపును దుక్కి దున్నుటచే హరింపజేసి పైరుబీజములను ఎట్లు జల్లునో, అట్లే సాధకుడు తన హృదయాంతరాళమున నున్న దుఃఖమయ రాక్షసగుణములనన్నింటిని సంపూర్తిగా తొలగించి యందు దైవగుణబీజములను జల్లి, పెంచి పోషించినచో దైవత్వమను పంటయే పండితీరును. ఎండాకాలంలో కలుపు ఏమియూ కనబడకపోయినను, బీజరూపమున దాగియుండి వర్షం కురియగానే యెట్లు మొలకెత్తునో, అట్లే అనేక జన్మవాసనలు మనయందు దాగియుండి, సమయం వచ్చినప్పుడు అంకురించి మొలకెత్తుచుండును. వాటిని పై సాధనల ద్వారా సాధకుడు పట్టుదలతో కృషిచేసి పెరికివేసినచో, తప్పక విజయుడై, విశుద్ధ హృదయుడై దైవత్వంను పొందగలడు. గీతలో దైవాసుర సంపద్విభాగయోగమందు శ్రీకృష్ణభగవానుడు జెప్పినట్లు సాధకులెల్లరు తమయందు దైవభాగమెంతగలదో, అసురభాగమెంతగలదో పరిశోధించి, అనుక్షణమును అసురగుణ నిర్మూలమునకును, దైవగుణ ప్రతిష్ఠకొరకును ప్రయత్నశీలురై యుండవలయును". 

పై వివరణే ఆ అమ్మాయికి చెప్పగా - ఆంటీ, బాగుంది మీరు చెప్పింది. అయితే మరి ధ్యానాది సాధనలు చూసినవారంతా ఎందుకు మహర్షులు కాలేకపోతున్నారు? ముక్తులు కాలేకపోతున్నారు? ఆ అమ్మాయి ఈ ప్రశ్న వినగానే ఒకింత ఆశ్చర్యం. ఎందుకంటే ఒకానొకప్పుడు నేను మా తాతయ్యగారిని ఇదే ప్రశ్న అడిగాను. దానికి మా తాతయ్యగారు ఇలా చెప్పారు -    
మీనః స్నానపరః ఫణీ పవనభుజ్మే మేషోస్తి పర్ణాశనః 
నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః 
భష్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూఢో బకః 
ఏతేషాం ఫలమస్తి కిం న హి న హి జ్ఞానం పరం కారణమ్  

గంగయందే పుట్టిపెరిగిన జలచరం లన్నియు, నిత్యమూ గంగా స్నానమే చేసియు, అందే నివసించియు వున్ననూ, సర్పము వాయుభక్షణమును చేసినను, మేక ఆకులను తినినను, చాతకపక్షులుకు జలమే ఆహారమైనను, ఎలుకలు సదా గుహలలో వున్ననూ, కుక్క బూడిద పూసుకున్ననూ, కొంగ మౌనమును శీలించినను వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును ఉండదు. అలానే కాసేపు ధ్యానం, ఆహారానియమాలు, ప్రార్ధనలు, శాస్త్రపఠనాలు, ప్రవచనాలు వినడం... ఇత్యాది సాధనలు బాహ్యంగా ఆచరించినంత మాత్రమున ఫలితముండదు. అంతరంగనిష్ఠ ఉండాలి. సాధకునికి శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. ఎటువంటి అవరోధాలు కల్గినను పట్టుదలతో అనన్య దైవభక్తితో సాగిపోవాలి, ఆత్మసాక్షత్కారం, ముక్తి లాంటి అత్యున్నత స్థితులను చేరుకోవాలంటే హృదయ పరిశుద్ధత అత్యవసరం. అందుకు ఎంతో సాధన అవసరం... ఈ రీతిలో తాతయ్యగారు చెప్పింది ఆ అమ్మాయికి చెప్తూ ఎప్పటిలా మంచివిషయాలను 'స్మరణ'లో పదిలపరుచుకుంటున్నాను.    

                             మన మతి ఎలా ఉంటుందో, మన గతి అలాగే ఉంటుంది. 
                                       సమ్మతితో వుండు - సద్గతి పొందు    

7, ఆగస్టు 2016, ఆదివారం

ప్రియమైన నువ్వూ,

నేడు నేనందుకున్న చిన్ననాటి స్నేహితురాలి, ఈ లేఖ నా మదిని తాకగా, యధాతధంగా, స్మరణలో పదిలపరుచుకుంటున్నానిలా -
                                               ప్రియమైన నువ్వూ,
కుశలమే కదా?
ప్రతీసారి నీ స్పురణ, స్మరణ మదిలో మెదలగా, వెల్లువెత్తే స్నేహానురాగంతో హృదిలో కదలాడే చక్కటి చిక్కటి భావాలను అక్షరీకరించి ఆనందంతో స్నేహాదినోత్సపు శుభాకాంక్షలంటూ ఆ లేఖను నీ దరి చేర్చేదానిని. కానీ, నేడు... బాధతో బరువైన మది భారంగా మూలుగుతుంటే, ఎప్పటిలా లేఖ వ్రాయలేకపోతున్నా.
ఏమే భారతీ,
నీకు గుర్తుందా... మన చిన్ననాటి రోజులు? అప్పటివారు పగలంతా వారి వారి వృత్తులు చేసుకొని, సాయంత్రం అయ్యేసరికి, మర్రిచెట్టు చప్టా దగ్గరో, తాతయ్యగారి ఇంటి చీడి దగ్గరో చేరి, కష్టసుఖాలు చెప్పుకునేవారు, సమస్యలకు సందేహాలకు సమాధానాలు తెలుసుకునేవారు, ఒకరుకు ఒకరు పరస్పరం సహకరించుకునేవారు, దైవపర విషయాలు చర్చించుకునేవారు, ఏ చింత లేకుండా హాయిగా వుండేవారు. అప్పుడున్న ఐఖ్యత, అవగాహన, అరమరికలు లేని మనుగడలు ఇప్పుడు లేవేమి?
పాఠశాలలు, కళాశాలలు పెరిగేకొద్దీ జ్ఞానం పెరగాలి, రక్షకభటులు పెరిగేకొద్దీ నేరాలు తగ్గాలి, వైద్యులు పెరిగేకొద్దీ రోగాలు తగ్గాలి, సుఖ సాధనాలు పెరిగేకొద్దీ సంతోషం పెరగాలి... కానీ, అలా అవడంలేదెందుకని?
అప్పుడూ కష్టాలు, రోగాలు, తగాదాలుండేవి కానీ, ఇప్పుడంతలా కాదు కదా.
సిరిసంపదలు పెరిగినా సుఖం లేదు. తినడానికి కావాల్సినవన్నీ వున్నా, తినే ప్రాప్తం లేదు. నాగరికత పెరిగినా, సంస్కారం కుంటుపడింది. చదువులు పెరిగినా, సద్గుణాలు లోపిస్తున్నాయి. భౌతిక సంపద వున్నా, నైతిక సంపద లేకుంది. సమస్తమూ వున్నా శాంతి లేదు. అన్నీ వున్నా ఆనందం లేదు... నీతి లేదు, నిజాయితీ లేదు, ఎవర్నీ నమ్మెందుకు లేదు... ఎందుకంటావ్?
భారతీ,
బంధుత్వాలకు అతీతమైన బంధం 'స్నేహం'. నమ్మకంకు మరోపేరు స్నేహం. ఆత్మీయ మిత్రులు ఆత్మ సములు. బంధుత్వాలన్నీ భగవంతుని సంకల్పమైతే, స్నేహ బంధం హృదయజనితం. నువ్వూ, నేను ఒక్కటేనన్న ఏకాత్మభావన... ఇలా మైత్రి మాధుర్యపు నిర్వచనాలు ఎన్నెన్నో స్నేహ మనోపొదిలో. 
కానీ, అందరు మిత్రులుకు ఇది వర్తించదు రా. అన్ని స్నేహాలు ఒకేలా వుండవు. కొన్ని స్నేహాలు మాత్రమే అంత అద్భుతంగా వుంటాయి. లాలసతో, లాలిత్యంతో, లలితంగా, ఆత్మీయతతో, ఆర్ద్రతతో, ఆర్తితో అనుబంధాలను అల్లితే అది ఆనందభరితంగా ఆహ్లాదమయంగా ఉంటుంది. అందుకు భిన్నంగా ఒకరికి ఒకరం ఇచ్చిపుచ్చుకునే స్నేహం అపార్ధాలతో భారంగా దుఃఖమయంగా మారితే ఆ ఆవేదన ఎలాగుంటుందో రుచి చూశా కొన్ని నా అనుభవాలతో. 
వారికి అనుకూలంగా వున్నంతవరకు ... స్నేహాన్ని పంచుకోవడం, పెంచుకోవడం ... లేకుంటే తులనాడడం, త్రుంచుకోవడం... ఇదా స్నేహ బంధానికి ఉన్న విలువ? కూరిమి గల దినములలో ... గుర్తుందా చిన్నప్పుడు మనం వల్లెవేసిన పద్యం? అది నిజం రా. స్పష్టత లేని వారి భావాలను సమర్ధించకపోతే, సరిచేయాలనుకుంటే ... అంతవరకూ నీవే నా ప్రాణమనేవారు మన ఒప్పులనే తప్పులంటూ, తమ లోపాలను సరిదిద్దుకోక, మనలో లోపాలను బూతద్దంలో వెతికిమరి పరుషమైన మాటలతో వేదనకు గురిచేస్తారే. మొన్నటికి మొన్నదే ఈ నా అనుభవం. నీ సాంగత్యంలో అలవడిన ఆధ్యాత్మిక పుస్తక సాంగత్యం వలన వారి పోకడను భరించి మౌనమయినను, మనోబాధను భరించలేకున్నాను. నా ఈ బాధను నీకు చెప్పాలని కాల్ చేద్దామనుకున్నా. 
కానీ, ఎవరైనా మాట్లాడుతుంటే వారి గుణం మాట్లాడుతున్నదని ఊరుకో, వారి వారి స్వభావరీత్యా, సంస్కారరీత్యా వారి వారి మాటలుంటాయి. ఆ మాటలను పట్టించుకోకు. విషయాలను ధ్యానించకు, భగవంతుణ్ణి ధ్యానించు. భగవంతునితో చెలిమి చేయు అన్న అంతరంగ ప్రబోధంతో నీకు ఫోన్ చేయక ఆగిపోయి, ఆనాటి సత్సంగంకు వెళ్లాను. అన్యమనష్కంగా ఉన్న నాతో ఏమైందండీ, అలా వున్నారని అడిగిన సులోచన(సత్సంగ నిర్వాహుకురాలు)గారితో దాచలేక పంచుకున్నాను నా బాధను. అంతా విన్న తను, పట్టించుకోకండి యిలాంటివి. పరమాత్మ తనవైపుకు తిప్పుకోవటానికి సాధకులకు అనేక క్లేశాలను, పరాభవాలను కల్పించి తనను స్మరించుకునేలా చేస్తాడు. ఇలా జరిగిందేమిటని కలత పడకండి, అన్నీ మనల్నీ పవిత్రుణ్ణి చేయడానికే అని విశ్వసించండి. ఆధ్యాత్మిక జీవనంలో రీజన్ కన్నా విశ్వసమే ముఖ్యం. వారిని క్షమించి ఎప్పటిలా ఉండండీ అని అన్నారు. 
 'క్షమ' అనగానే నీవే గుర్తుకొచ్చావు, ఒకసారి - సమర్ధులై యుండి కూడా క్షమించువారు పుణ్యాత్ములన్న విదురనీతి గురించి వివరిస్తూ ... 
ఎవరైనా దుఃఖం కలిగించినప్పుడు కోపగించక, ప్రతీకార బుద్ధితో అపకారం చేయక, నిందించక, వారి మాటలను మననం చేసుకుంటూ నొవ్వక, నొప్పించక, శాంతంగా యుండుటయే క్షమాగుణం... అని లోగడ నీవన్న మాటలు గుర్తుకొచ్చాయి. అప్పుడే కదా, నేనన్నాను -
కానీ, మనకంటూ ఓ స్వాభిమానముంటుంది, క్షమించేవారిని సహించేవారిని చూసి లోకులు అసమర్ధులనుకుంటారు, మరో రెండు మాటలని పరిహాసం చేస్తారు, మాటిమాటికి అవమానిస్తారని నేనంటే -
క్షమత్వం దైవగుణం, క్షమించటం అంటే పరాభవం, పరాజయం పొందడం కాదు, క్షమించి మౌనమవ్వడం పలాయనం కాదు, బలహీన పడడం కాదు, అదో సద్గుణం, ఉత్తమ సంస్కారం ... క్షమాశీలత అసమర్ధత కాదు, అది ఉత్తమ వ్యక్తిత్వం. మెచ్చాల్సింది లోకులు కాదు, లోకేశ్వరుడు... అంటూ ఓ నదిలో గురుశిష్యులు స్నానమాచరిస్తున్నప్పుడు కొట్టుకుపోతున్న ఓ తేలుని రక్షించాలని గురువుగారు పదేపదే ప్రయత్నించడం, పదేపదే ఆ తేలు కుట్టడం... ఇదంతా చూస్తున్న శిష్యుడు, ఆ తేలుని వదిలేయక, రక్షించి కుట్టించుకోవడమెందుకని అడగగా, కుట్టడం దాని నైజం, దానికి మంచి చేయాలనుకోవడం, రక్షించడం నా నైజం. దాని సహజగుణమును అది ఒదులుకోనప్పుడు నేనెందుకు నా గుణాన్ని వదులుకోవాలి? దాని స్వభావము దానిది, నాది నాదే ... అన్న కధ చెప్పి, 
ప్రాపంచిక స్మరణంలో మునిగి పరమేశ్వరుని స్మరణను మనం ఆపేసినా, భగవంతుని అనుగ్రహం ఆగిపోతుందా? ఊహు... 
ప్రాపంచికత నుండి పారమార్ధిక పధం పట్టేంతవరకు, అనురక్తి లోంచి విరక్తిలోకి వచ్చేంతవరకు ఎన్నెన్నో రుచి చూపిస్తాడు. మన జీవితంలో జరిగే ప్రతీ సంఘటనలోనూ ఒక సందేశముంటుంది. వారు వారి గుణమును పట్టించుకోకు, పట్టించుకోవాల్సింది పట్టుకొని, మిగిలినవి పట్టి పట్టనట్లు సాగిపో అన్న తాతయ్యగారి మాటలు గుర్తుచేసిన ఆనాటి మన ఇద్దరి సంభాషణ జ్ఞప్తికొచ్చి మనస్సు ఒకింత కుదుటపడిన ఏదో మూలన చిరువేదన. 
అలాగని స్నేహితులందరూ ఇలానే ఉంటారని లేదు. మంచి మిత్రులూ వున్నారు... వారందరికీ నా వందనములు. 
ఆ రాత్రి నిద్రపట్టక, ఏమిటీ జీవితం, ఏమిటీ అనుబంధాలు, ఎందుకిన్ని అవరోధాలు ... అని నాలో నేను సంఘర్షించుకుంటున్న సమయంలో ప్రక్కనే ఉన్న ఫోన్ నుండి వాట్స్ అప్ మెసేజ్ వచ్చినట్లు సూచించే చిరు సడి.

"సౌశీల్యత పరుష పదాల్లో లేదు, బాధను దాచుకునే గుండెల్లో ఉంది,  స్నేహం అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనస్సులో ఉంది..." 
"మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం. ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయంతో సమానం". 
"రాయి దెబ్బతిన్న తర్వాతే విగ్రహామౌతుంది. మట్టిని కాల్చిన తర్వాతే కుండ అవుతుంది. బంగారాన్ని కాల్చి కరిగించాకే ఆభరణమౌతుంది. ఎన్నో అవరోధాలు అధిగమిస్తేనేగానీ, విజయపధం పట్టలేం".  శుభరాత్రి అంటూ నీవు పంపిన సందేశాలు ... నా మానసిక స్థితికి తగ్గ సందేశాలు ...  సమాధానం దొరికి నాలో సంఘర్షణ సమసిపోయింది. మనసిప్పి చెప్పకపోయినా, మనసెరిగిన మిత్రురాలువనిపించుకున్నావే.

అంతలోనే మరల నీ నుండి ఈ మెసేజెస్ -
                                                                                       

సరైన దారి చూపే మార్గదర్శకురాలిలా నా మార్గ నిర్దేశం చేసే గురువులా... చీకటి నుండి వెలుతురు వైపు నడిపిస్తూ ...
ఇప్పుడు చెప్పనా ...
స్నేహానికి సరైన నిర్వచనం .. 

అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ ... 

వుండనా మరి, 
ప్రేమతో, 
నీ శైలూ. 

25, జులై 2016, సోమవారం

సనత్సుజాతీయం (చివరి భాగం)పొరపాటే మృత్యువనియు, మృత్యువుకు ఆకృతి లేదనియు, కోపమూ, మొహమూ, పొరపాట్లు కారణంగా మృత్యువు వుండుననియు, తన మృత్యువుకు తానే కారణుడనియు, ఇంద్రియములకు బద్ధులైనవారు జన్మ పరంపరలలో చిక్కుకుంటున్నారనియు, అంతర్యామి యొక్క అస్తిత్వమునే సర్వత్రా దర్శించువారు అమృతత్త్వం అనుభవించెదరనియు చెప్తూ...  సుకర్మ దుష్కర్మలను వివరిస్తూ, ఫలాపేక్షతో పుణ్యకర్మలు చేసినా దుఃఖభాజనులగుదురనియు, పాపపుణ్యాలకు అతీతంగా వుండి ఆత్మనిష్ఠలో ఉన్నవారు బద్ధులు కారనియు...  సనత్సుజాతులవారు వివరించినదంతా విన్న ద్రుతరాష్ట్రుడు ఇలా ప్రశ్నిస్తాడు -
మహామునీ! ధర్మాన్ని ఆచరించకపోవడం వలన ధర్మం దెబ్బతింటుందా? అధర్మం ఆచరిస్తే ఆ ఫలితం మనం అనుభవింప వలసి వస్తుందా? ధర్మం గొప్పదా? అధర్మం గొప్పదా? అని ప్రశ్నించగా,

ధర్మాధర్మాలు రెండూ మనలోనే ఉన్నాయి. ఆచరించటం ఏది ఆచరిస్తావో దానిబట్టి ఫలితముంటుంది. కర్మాచరణం వలన మానవుడు ఉద్ధరింపబడతాడు. సత్కర్మ ఆచరిస్తే సత్కర్మఫలమైనటువంటి స్వర్గం అనబడేటువంటి ఒక స్థితి వస్తుంది,  అంటే అమృతత్త్వం వస్తుంది. దుష్కర్మ ఆచరిస్తే దుష్కర్మ ఫలంగా నరకం అని చెప్పబడేటువంటి ఒకానొక పాపఫలం సంక్రమిస్తుంది, అంటే అహంతో జీవించడం. ఈ ధర్మ ధర్మాల కర్మాచరణం వలనే జ్ఞానం పొందటం, అజ్ఞానం పొందటం వుంటుంది. సత్కర్మాచరణ చేసినట్లయితే, క్రమేణా మనకి, మనస్సుకి వివేకమొస్తుంది, తద్వారా సత్ జ్ఞానం కల్గుతుంది, తద్వారా ఆత్మ సాక్షత్కార కాంక్ష కల్గుతుంది, అది కలిగినందువలన ఆత్మ యందు మనస్సు నిశ్చలత పొందడానికి కావల్సిన సాధనా తృష్ణ మనలో వస్తుంది, అది రావడం వలన కర్తృత్వభావన వీడి ప్రతిఫలాపేక్ష లేకుండగ భగవదర్పణ చేయడం వలన అమృతత్వం సిద్ధిస్తుంది. అమృతత్త్వమంటే ఆత్మ నిష్ఠతో అందర్నీ ఆత్మస్వరూపులుగా భావిస్తూ విశ్వజనీయమైన ప్రేమతో దివ్యజీవనం గడపడం.

ఏ మంచిపనయినాసరే ఆ పనులు మంచివని తెలుసుకున్నంత మాత్రమున ఉపయోగం లేదయ్యా,  ఆచరిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. అని సనత్సుజాతులవారు చెప్పగా,

దృతరాష్ట్రుడు మరల 'ఈ ప్రపంచంలో ధర్మమే ఎక్కువ బలము గలదై పాపాన్ని ఓడిస్తుందా? లేక పాపమే ధర్మాన్ని ఓడిస్తుందా?' అని ప్రశ్నించగా -

రాజా! నీ దృష్టిలో ధర్మా ధర్మములు రెండూ సమాన బలముగలవి కావచ్చును. కానీ నీకే తెలుస్తుంది ... ధర్మ మార్గమున అధర్మాన్ని జయించినవారు ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తారు. అలా కాక, అధర్మ మార్గమున ధర్మాన్ని జయించినప్పుడు అశాంతికి గురై లోలోన పరితాపంతో జీవిస్తాడు. కాబట్టి రెండింటికి ఫలం ఎలా ఉందో, దాన్నిబట్టి ఏది బలీయమో నీవే యోచించి తెలుసుకో. ఓ దృతరాష్ట్రా! పుణ్యపాపాలకు అతీతంగా, కర్మఫలాన్ని అపేక్షింపక, కర్మయోగిగా జీవిస్తూ బ్రహ్మానంద స్వరూపులైనవారు అమృతత్త్వాన్ని పొందుతారు, అంటే ధర్మాచరణం చేత, పుణ్యాన్ని లెక్కచేయకుండా, పాపాన్ని క్షాళనం చేసుకొని పరిశుద్ధులైనట్టివారు, నిత్యమూ, శాశ్వతమూ, సత్యమూ అయినటువంటి పరమాత్మ స్వరూపమయినట్టి ధ్యానంలో అమృతత్త్వంను పొందుతారు.
అని సనత్సుజాతులవారు చెప్తూ, ఇంకా ఇలా వివరిస్తున్నారు -
ఆత్మను దర్శనం చేయకుండా, వ్యక్తులను దర్శనంచేసి, పరోపకారం చేసినా ఒకటే, పరాపకారం చేసినా ఒకటే. పరోపకారం ఎప్పుడు చేసినా 'నిర్లింగమచలం శుద్ధం' ... ఎవరికైతే చేస్తున్నారో వాళ్లలో ఉన్న పరిశుద్ధమైన పరబ్రహ్మమును చూడాలే తప్ప, వారు ఏ కులం, గోత్రం, దుర్మార్గుడా, ఎలాంటివాడు అని చూడకూడదయ్యా దృతరాష్ట్రా!

యోన్యథానన్త మాత్మానం
అన్యథా ప్రతిపద్యతే
కింతేన నకృతం పాపం
చోరేణాత్మాపహారిణా

అనంతమయినట్టి పరమాత్మ ఒకే విధంగా అందరిలోనూ ఉన్నను, మరియొక విధంగా ప్రతిపాదనం చేసుకొని, వీరు మావాళ్లు, వీరు పరాయివాళ్ళు అన్న భావన చేసుకున్నవారు ఏ సత్కర్మాచరణం చేసిన అది పాపమే అవుతుందయ్యా ...

జ్ఞాని మానుషమైన సంపద అంటే మనిషిచేత సృజింపబడ్డ సంపదలను నమ్మక, దైవీ సంపదల మీద నమ్మకముంచి లోకహిత కాముకుడై, నిశ్చలుడై ఉంటాడయ్యా. ఎవరు పొగిడినా తెగడినా, అది అలా మాట్లాడినవారి స్వభావలక్షణంగా ఉన్నట్టిమాటగా భావించి 'లోక స్వభావవృత్తిర్హి' లోకస్వభావ ప్రవృత్తి ఇంతేనని తెలుసుకొని ఊరుకుంటాడేగాని పట్టించుకోడయ్యా. తనకి అన్వయించుకొని బాధపడడు, బదులియ్యడు.

మోక్షమనే మార్గంలో వెళుతున్నవానికి బహు దారులున్నాయి నాయనా... 'సత్యార్జవే హ్రీర్దమ శౌచవిద్యాహః' అంటే సత్యవాక్కు, ఋజు ప్రవర్తనం, లజ్జించటం, దమం, శౌచం, విద్యా... అనే దారులున్నాయి.
సత్యవాజ్మియమం మొదటి దారి అంటే మొదటి గుణం. సత్ప్రవర్తనం రెండో గుణం, చేయకూడని పనులు చేయడానికి లజ్జిపడటం మూడో గుణం, ఇంద్రియములను మనస్సును నిగ్రహించుకునే నాల్గవ గుణం, బహి (శారీరక) శౌచం, అంతశ్శౌచం ఐదవ గుణం, హితమైన పనులుచేస్తూ, అందరిలో అంతర్యామిని చూసే విద్య ఆరవ గుణం. 'షణ్మానమోహ ప్రతిబన్ధకాని' ఈ అరున్నూ మానాభిమానములు మోహంను తొలగించేసి,మోక్షానికి వెళ్లేదారిని ఇస్తాయి రాజా, వీటిని ఆచరణలో పెట్టి ఎంతో ఆర్తితో మోక్షంకై యత్నించాలి నాయనా.

అటుపై  మౌనమంటే ఏమిటో చెప్పమని దృతరాష్ట్రుడు అడగగా -

యతో నవేదా మనసా సహైనమ్
అనుప్రవిశన్తి తతోథ మౌనమ్
యత్రోత్ధితో వేదశబ్దస్తధా యం
స తన్మయత్వేన విభాతిరాజన్

మౌనం మనస్సుకు సంబంధించినది.  మౌనమంటే  తెలుసుకోవటం, చూడటం, అది తాను అవటం. వేదశబ్ధం ఎక్కడెక్కడయితే అమలుపరచటానికి వీలవుతుందో అక్కడక్కడల్లా వున్నది మౌనమే. ఆ స్థితే తన్మయత్వ స్థితి. తానే అది అయ్యే స్థితి.

                       *  లోకాస్సమస్తా సుఖినోభవంతు  *