31, డిసెంబర్ 2011, శనివారం

స్వీయపరిశీలన



రాత్రి 'భగవాన్ బోధ' అన్న పుస్తకమును కొద్దిగా చదివాను. ఆ పుస్తక ముఖచిత్రంపై  శ్రీరమణులుతో పాటు ఓ కొటేషన్ - 

"సంకల్పాలు తలెత్తినప్పుడే ద్వైతం కనబడుతుంది. అహం మూలాన్వేషణే ఈ ద్వైతభ్రాంతిని పోగొట్టుతుంది.ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం ఆత్మను పొందటం కాదు, అహంకారాన్ని పోగొట్టుకోవడం" 

శ్రీరమణులు సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు ఇందులో...

గ్రంధాలు ఏ గందరగోళం వుండనక్కరలేనిచోట గందరగోళాన్ని సృస్టిస్తాయి. ఉదాహరణకు అవి పంచభూతములు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచప్రాణాలు, పంచఉపప్రాణాలు, పంచకోశములు, పంచీకరణం, చిదాభాసుడు, కూటస్తుడు, సూక్ష్మశరీరం, కారణశరీరం, చిజ్జడగ్రంది, విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ఇలా కొండవీటి చాంతాడు లాగా వివరించుకుంటూ పోతూ, ఇవన్నీ సాధకుడు బట్టీ పెట్టవలననియు, తెలుసుకోవలననియు, ఇదే జ్ఞానమనియు అర్ధమొచ్చేలా వుంటాయి. ప్రారబ్ధం, సంచితం,ఆగామి అంటూ ఏవేవో వివరిస్తాయి. నిజానికి ఆత్మానుభవంనకు ఇవన్నీ అవసరమా?
అద్వైతం, ద్వైతం, విశిష్టద్వైతం, నిరాకారం, సాకారం, జాగృతి, చైతన్యం...... ఓహో... ఒకోదానిగురించి ఎన్నో వివరణలు, విశ్లేషణలు చదివి వుంటారు. కానీ అంతర్ముఖులు కాలేక పోతున్నారెందుకని?
శాస్త్రాలా అంతిమ లక్ష్యం "మనోనిగ్రహమే" అని ఒకసారి తెలుసుకున్నతర్వాత  అంతూపొంతూ లేకుండా వాటిని అధ్యాయనం చేస్తూ, చర్చిస్తూ కూర్చోవడం నిరర్ధకం కాదా?
వేదాలు, శాస్త్రాలు, గ్రంధాలు, ఇవన్నీ కూడా సర్వోన్నతశక్తి వుందని తెలిపేందుకు, అది ఆత్మగా భాసిల్లుతుందని చెప్పేందుకు, దానికి దారి చూపేందుకు మాత్రమే ఉపకరిస్తాయి. వాటియొక్కసారం మనం ఆత్మస్వరూపులమే అని చెప్పడమే. వాటి ప్రయోజనం, ముఖ్యోద్దేశం ఇదే. అది అర్ధమై కూడా ఇంకా పుస్తకాల్లో మునిగిపోవడం ఎందుకు? ఆత్మవిచారణ చేయక వాటిని గురించే మాట్లాడుకోవడం ఎందుకు?
ఆధ్యాత్మికసాధన అంతరంగమునకు సంబందించినది. అది అంతరములోనే జరగాలి. నీకై నీవే నీలోనే దానిని అనుభవించాలి. అంతేకానీ, అధ్యాయనం ద్వారా ఆత్మని తెలుసుకోలేవు.బయట చర్చించి పట్టుకోగాలవా?  బాహ్యముగా అన్వేషించగలవా? ఇది తెలిసి కూడా వీటి మధ్యే ఎందుకుండిపోతున్నావ్?
ఎన్నోరకాలుగా (శ్రవణం,గ్రంధ పఠనం మొ..) ఎంతో జ్ఞానం పొందివుంటారు. అయినా భాదపడ్తున్నారు, ఎందుకని? మనస్సుని ఆత్మలో నిలపడమే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్నిఆచరణలో పెట్టలేకపోవడం వలనే దుఃఖ పడ్తున్నారని గ్రహించరెందుకని?
ధర్మాచరణ, సత్సాంగత్యం, సత్ కర్మలు,సద్భావనల వలన సత్వగుణమును పొంది వుంటారు. అయినా దుఃఖిస్తున్నారెందుకని? ఇంకా మనస్సుని తగిలించుకొని వుండడంవలనే. లోచూపు అలవర్చుకొని అసలైనదానిని పట్టుకోక ఎందుకు ప్రయాసపడతారు?
............. ఇంకా చాలా వున్నాయి, చివరగా కొన్ని పేజీలయందు జ్ఞానం గురించి ఉంది. కానీ చదవలేకపోయాను....... 
అప్పటికే నాలో ఏదో మధనం...... అంతర్మధనం........ స్వీయపరిశీలన......... 
ఆధ్యాత్మిక చర్చల్లో చిక్కుకోకు. శాస్త్రాల్లో శోధించకు. నీ లక్ష్యం ఒక్కటే - అది ఆత్మానుభవం(ఆత్మసాక్షాత్కారం). దానిపైనే నీ దృష్టినంతా పెట్టు. ఆత్మవిచారణే దీనికి సరైన మార్గం అన్న రమణమహర్షి మాటలు చదివిన దగ్గరనుండి ఒకింత స్వీయపరిశీలన........
భగవంతుడు, భక్తి, సృష్టి, సాధన, ధ్యానం, ధర్మాచరణములు, మనస్సు, మాయ....... వీటి గురించి తోటిసాధకులతో చర్చిస్తూ, పుస్తకాల్లో చదువుతూ,ఆధునిక మాధ్యమాలు(టి.వి, నెట్)ద్వారా తెల్సుకుంటూ, చాలావరకు ఆచరణలో పెడుతున్నాను. కానీ కాలం కరిగిపోతుందే తప్ప ఆత్మనుభవం కలగడం లేదెందుకని........ అన్న ఆలోచన......
అప్పుడు స్పురించింది..... నేను ఇప్పుడిప్పుడే(గత ఇదు,ఆరేళ్ళుగా) ఆధ్యాత్మికపయనం ప్రారంభించిన సామాన్య సాధకురాలిని. ఓ పరిపక్వ స్థాయిలో వున్న సాధకులకు అర్ధమయ్యే రమణబోధలను నేను అర్ధంచేసుకోలేనని. అవి అర్ధమవ్వాలంటే నా సాధన చాలదని. అంతటి జ్ఞానసారము గ్రహించే శక్తి నేనింక పొందలేదని. ఆ అనుభవం పొందాలంటే అందుకు ఎంతో ప్రయత్నించాలని. ఆత్మవిచారణ, అంతర్వీక్షణ ఎలా చేయాలో నాకు తెలియదు. తెలిసేటట్లు చేయమని ఆ భగవంతున్ని ప్రార్ధన చేస్తున్న మూగగా. 
భగవంతుడు, ప్రార్ధన చేయడమంటే........ భగవంతుడు, నేను వేర్వేరు.... ద్వైతభావనంటే ఇదే.... 
భగవంతుడు, నీవు వేర్వేరు కాదని రమణుల బోధ........ దేహంలో "నేను"న్నంతవరకు, ఆ "నేను" అనుభూతికి వచ్చేంతవరకు ఈ ద్వైతభావన తప్పదనుకుంటాను. 
కానీ, సాధన ధృడపడేంతవరకు, మనస్సును జయించేంతవరకు సద్గ్రంధ పఠనం చేయాలి. వేద పురాణేతిహాసాల్నీ అధ్యాయనం చేయాలి. మహాత్ముల ప్రవచనాల్ని ఆకళింపు చేసుకోవాలి. నిరంతర స్మరణ, శాస్త్రచర్చ, సత్సంగం వుండాలి. అప్పుడే ఆధ్యాత్మిక అవగాహన ఏర్పడుతుందని నా భావన.






నా ఈ గమనం సరైనదేనా??????

29, డిసెంబర్ 2011, గురువారం

భక్తి



మోక్షకారణ సామగ్ర్యాం భక్తి తేవ గరీయసీ
స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే" 
                                                        - శ్రీ శంకరభగవత్పాదులవారు
మోక్షమునకుండు అనేకసాధనములలో భక్తి ముఖ్యమైంది. 

భక్తి అనగా నేమి?

"అనురక్తి: పరే తత్వే భక్తిరిత్యభిధీయతే" పరమాత్మునియందు అమితమైన ప్రీతే భక్తి.

భౌతిక ప్రాపంచిక విషయాలపైన ఉన్న మమతానురాగాలను ప్రేమ అని, పరమాత్మపైన ఉన్నప్రేమను భక్తీ అని అంటారు. భగవంతునిపై వుండే అనన్య ప్రేమే భక్తి. భగవదనుగ్రహం కోసం పరితపించుటయే భక్తి. పరమేశ్వురునియందు పరమ ప్రేమే భక్తి. లోపలున్న ఈశ్వరుడే శరీరము చేత పనిచేయిస్తున్నాడు, నేను నిమిత్తమాత్రుడును అన్నభావనతో సర్వకర్మలు నిర్వర్తించుటయే విశిష్ట భక్తి.
ఇందు సగుణ, నిర్గుణ భక్తులని రెండున్నాయి. ముందు సగుణ భక్తి అలవడగా, నిరంతర సాధనతో అదే నిర్గుణభక్తికి దారితీస్తుంది.
"సగుణ జ్ఞానహీనస్య న హి నిర్గుణవేదనమ్
నందిదర్శనహీనస్య యధా న శివదర్శనమ్"
నందిదర్శనం లేనిదే శివదర్శనం ఎట్లా సిద్ధింపదో, అలాగునే సగుణభక్తి లేనివారికి నిర్గుణభక్తి సాద్యం కాదు.
"త్రివిధా భక్తిరుద్దిష్టా మనోవాక్కాయ సంభవా
లౌకికీవైదికీ చాపి భవేదాధ్యాత్మికీ తధా"
మనోవాక్కయ కర్మలచే చేసెడు భక్తి మూడు విధములు. అవి లౌకికీ, వైదకీ, ఆద్యాత్మికీ అని మూడు విధములు.
అలానే సామాన్య భక్తి, మానసిక భక్తి, విశిష్ట భక్తీ అని వున్నాయి. స్నాన, ధ్యాన, సంద్యావందన, జప, హోమ, యజ్ఞా దానధర్మములు సామన్య భక్తికి చెందినవి. ఈ భక్తివలన చిత్తశుద్ధి, పుణ్యప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతాయి. కాకపొతే ఇవి నిర్దేశిత సమయాల్లో నియమనిష్టలతో కూడినవి. ఇక సర్వవేళల్లో మానసికంగా జపం, పూజ, భజన, నివేదనం, శరణాగతిలతో పరమాత్మున్ని ఆరాదించడం మానసిక భక్తి. అటుపై ఆత్మార్పణం. తనకు భగవంతునికి భేదంలేని అద్వైతస్థితిలో (తానే ఆత్మ స్వరూపంగా తెలుసుకున్నస్థితి) నిరంతరం రమించుటయే విశిష్ట భక్తి. అంటే అద్వైతానుభూతియే విశిష్ట భక్తి.

నవవిధ భక్తిమార్గాలు -
శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నవి నవవిధ భక్తిమార్గాలు. 
ఐతే నారదమహర్షి పదకొండు విధాలుగా భక్తిమార్గాలును తెలిపారు. అవేమిటంటే......
"గుణమాహాత్మ్యాసక్తి, రూపాసక్తి, పూజాసక్తి, స్మరణాసక్తి, దాస్యాసక్తి, సఖ్యాసక్తి, వాత్సల్యాసక్తి, కాంతా సక్త్యాత్మనివేదనాసక్తి, తన్మయతాసక్తి, పరమ విరహాసక్తి రూపా ఏకధా ప్యేకాదశధా భవతి"
౧. గుణమహాత్మ్యాసక్తి: 
భగవంతుని దివ్యగుణ కధలను వినుటయందు ప్రీతి(ఆసక్తి). ఈ రీతిలో తరించినవారు... (శౌనుకుడు, శాండిల్యుడు, పరీక్షీత్ మహారాజు...)
౨. రూపాసక్తి: 
భగవంతును దివ్యరూపమును దర్శించుటయందు ప్రీతి. ఈ రీతిలో తరించినవారు... (మిధిలానగరవాసులు, వ్రజ వనితలు, దండకారుణ్యగతులైన మహర్షులు...)
౩. పూజాసక్తి: 
భగవంతున్ని పూజించుటయందు ప్రీతి. (పృధు చక్రవర్తి, అంబరీషుడు......)
౪. స్మరణాసక్తి: 
భగవంతున్ని స్మరించుటయందు ప్రీతి. (ప్రహ్లాదుడు, ధ్రువుడు........)
౫. దాస్యాసక్తి: 
భగవంతునికి కైంకర్యం చేయుటయందు ప్రీతి. (హనుమంతుడు, అక్రూరుడు, విదురుడు.......)
౬. సఖ్యాసక్తి: 
భగవంతునియందు స్నేహభావముతో మెలుగుటయందు ప్రీతి. (అర్జునుడు, ఉద్ధవుడు, సంజయుడు, సుధాముడు........)
౭. వాత్సల్యాసక్తి: 
భగవంతునియందు వాత్సల్యంతో వుండుటయందు ప్రీతి. (అధితికశ్యపులు, శతరూపామనువులు, కౌశల్యధశరదులు, యశోధనందులు, దేవకీవసుదేవులు...)
౮. కాంతా సక్త్యాత్మనివేదనాసక్తి: 
భగవంతున్ని నాయకునిగా తనని నాయికగా భావించుకొని ఆరాధించటయందు ప్రీతి. (రుక్మిణీ తదితర శ్రీకృష్ణుని పట్టమహీషులెనమండుగురు.)
౯. ఆత్మనివేదనాసక్తి: 
భగవంతునికి సర్వము సమర్పించుట యందు ప్రీతి. (బలి, శిబి  చక్రవర్తులు)
౧౦. తన్మయతాసక్తి: 
భగవంతునియందు తన్మయత్వంతో లీనమగు ధ్యానమందు వుండుటకు ప్రీతి. (శుకయోగి, సనకాది జ్ఞాన యోగులు.....)
౧౧. పరమ విరహాసక్తి:  
ఎప్పుడా భగవంతునితో కూడియుందునా అనెడి అత్యంత ప్రేమతో తదేక చింతతో యుండుటయందు ప్రీతి. (ఉద్ధవుడు, వ్రజ ప్రజలు...)
నారద భక్తి సూత్రములలో కొన్ని -
"సాత్వస్మిన్ పరమ ప్రేమరూపా"
భక్తి భగవంతుని యందు పరమప్రేమరూపమై ఉంది. అంటే భగవంతుని యందు అపారప్రేమకు భక్తి అని పేరు.
"అమృతస్వరూపా చ"
ఆ భక్తి అమృతస్వరూపముగా ఉంది. అనగా భక్తి యొకటే జనన మరణములను దుఃఖముల నుండి తొలగించి అమృతమైన మోక్షమును ఇచ్చును.
"యల్లబ్ధ్వాపుమాన్ సిద్దో భవతి అమృతో భవతి తృప్తో భవతి"
దేనినిపొంది జీవుడు సిద్దుడున్నూ, అమృత స్వరూపుడున్నూ, సంపూర్ణ తృప్తుడున్నూ అగునో, అదే భక్తి యనబడును.
"యద్జ్ఞా త్వా మత్తో భవతి స్తబ్దో భవతి ఆత్మారామో భవతి"
ఏ భక్తి చేత భగవత్స్వరూపమును తెలుసుకొని ఉన్మత్తుని వలె అగుచూ, నిశ్చేష్టుడగుచూ, తనలో తాను రమించువాడగునో అదియే పరమ భక్తి.
"అన్యా శ్రయాణాం త్యాగో నన్యతా"
ఆత్మధ్యానమునకు విరోధమైన సమస్త విషయములను విడిచి తదేకధ్యానమందు ఉండుటయే అనన్యభక్తి అనబడును.
"పూజాదిష్వనురాగ ఇతి పారాశర్యః"
పూజలయందు ప్రీతి భక్తియని పారాశర మహర్షి పుత్రుడగు వేదవ్యాసుడు  చెప్పెను.
"కధాదిష్వితి గర్గః"
భాగవత్కల్యాణ గుణగణ కధలయందు ఆసక్తి కల్గియుండుటయే భక్తియని గర్గమహర్షి అనెను. 
"ఆవ్యావృత భజనాత్" 
ముంగిపులేని దైవభజన వలన అనన్య భక్తి కల్గును.
"లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్"
లోకములో భగవంతుని గుణములు వినుటచేతను, కీర్తనము చేయటముచేతను, భగవద్భక్తి కల్గును.
"అనిర్వచనీయం ప్రేమ స్వరూపం"
భగవంతుని యందు ప్రేమస్వరూపమైన భక్తి ఏది కలదో అది అనిర్వచనీయం.
"తన్మయాః"
భగవద్భక్తులు భగవత్స్వరూపులగుచున్నారు.
"నాస్తి తేషు జాతి, విద్యా, రూప, కుల, ధన, క్రియాది భేదః"
భగవద్భక్తికి జాతి, విద్య, రూపం,కులం, ధనం, కార్యములు మొదలైన భేదములు లేవు.
"త్రిసత్యస్య భక్తి రేవ గరీయసీ భక్తి రేవ గరీయసీ"
మోక్షమునకు త్రికాలాబాధ్యుడగు భగవంతుని యందు గల భక్తి యొక్కటియే శ్రేష్టమైనది. అట్టి భక్తి యొక్కటియే అధికమైంది.
ఇత్యేవం వదన్తి జనజల్ప నిర్భయా ఏకమతాః కుమార వ్యాస శుకశాండిల్య గర్గ విష్ణుకౌండిన్య శేషోద్ధవారుణి బలి హనుమద్విభీషణాదయో భక్త్యాచార్యాః"
సామరజనులయొక్క నిందాదూషణలకు భయపడని వారలై, భక్తి యొక్కటియే ముక్తిని కలుగజేయునని ఏకాభిప్రాయం గలవారెవరనగా సనత్కుమారుడు, వ్యాసుడు, శుకుడు, శాండిల్యుడు, గర్గుడు, విష్ణువనుఋషి, కౌండిన్యుడు, ఆదిశేషుడు, ఉద్ధవుడు, ఆరుణి, బలిచక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు మొదలగు భక్త్యాచార్యులు భక్తియే ముక్తిని ఇచ్చునని తెలుపుతున్నారు.

  
శివానందలహరిలో - శ్రీ శంకరభగవత్పాదులవారు ఇలా చెప్పారు -
"అంకోలం నిజబీజసంతతి రయస్కాంతోపలం సూచికా
సాధ్వీనైజవిభుం లతా క్షితిరుహం సింధుస్సరిద్వల్లభమ్
ప్రాప్నోతీహ యధా తధా పశుపతే: పాదారవిందద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే"
ఊడుగచెట్టును దాని బీజములు, సూది సూదంటురాయిని, పతివ్రతాస్త్రీ తనభర్తను, తీగ వృక్షమును, నది సముద్రమును, ఎట్లు ఎడతెగక పొందియుండునో అట్లు మనోవృత్తియు భగవంతునియొక్క చరణకమల యుగళమును ఎల్లప్పుడును పొందియుండుటయే అచంచలమైన భక్తి.
"పరమాత్ముని విశ్వేశే భక్తిశ్చేత్ ప్రేమలక్షణా
సర్వమేవ సదా సిద్ధం కర్తవ్యం నావశిష్యతే"
సర్వేశ్వరుడగు పరమాత్ముని యందు ప్రేమలక్షణమైన భక్తి కల్గినేని అతనికి సిద్ధించవలసిన సర్వమును సిద్ధించును. చేయవలసిన కర్తవ్యం కొంచమైన మిగిలి వుండదు.
"సత్యాదిత్రియుగే బోధవై రాగ్యే ముక్తిసాధకే 
కలౌ తు కేవలా భక్తిర్బ్రహ్మ సాయుజ్యకారిణీ"
కృత త్రేతా ద్వాపరయుగములలో బ్రహ్మజ్ఞానం, యోగం, వైరాగ్యముతో కూడిన తపస్సులు మోక్షసాధనములు. అట్టి మోక్షము కలియుగమున భగవద్భక్తిచే పొందవచ్చును.
"శుకద్యాస్సనకాద్యాశ్చ పురా ముక్తా హి భక్తితః 
 భక్త్యైవ మామనుప్రాప్తా నారదాద్యాశ్చిరాయుషః"
శుక, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత, నారదాది మునులందరు పూర్వం భక్తి వలనే ఈ లోకములో జీవన్ముక్తులైరి. భక్తి చేతనే వారు భగవత్ప్రాప్తిని పొంది చిరాయుష్మంతులైరి.
"న తపోభిర్న వేదైశ్చ న జ్ఞానేన న కర్మణా 
హర్హిరి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికాః"
తపములచేతగానీ, వేదాధ్యయనముల చేతగాని, శాస్త్రజ్ఞానం చేతగాని, కర్మకాండక్రియచేతగాని భగవత్ సాక్షాత్కారం పొందుటకు సాధ్యం కాదు. అనన్య భక్తి యొక్కటియే భగవత్ప్రాప్తికి కారణమగును. దీనికి గోపిక స్త్రీలే ప్రమాణము.


"భక్తిరేవ పరమార్ధదాయినీ భక్తిరేవ భవరోగనాశినీ
భక్తిరేవ పరవేదనప్రదా భక్తిరేవ పరముక్తి కారిణీ"
భక్తిమాత్రమే పరమార్ధజ్ఞానమును కలుగజేయును. భక్తి యొక్కటియే సంసారరోగమును నశింపజేయును. భక్తి యొక్కటియే పరతత్త్వమును కలుగజేయును. భక్తి యే ముక్తినిచ్చును. 

భాగవతములో ఓ శ్లోకము -
"చాలదు భూదేవత్వము, చాలదుదేవత్వమధిక శాంతత్వంబుం
జాలదు హరిమెప్పింప విశాలోద్యములార! భక్తి చాలిన భంగిన్"
ప్రహ్లాదుడు అసురకుమారులగు తన తోటి విద్యార్ధులకు ఇలా చెప్పెను.... శ్రీవిష్ణువును మెప్పించుటకు బ్రాహ్మణ కులమందు పుట్టిన చాలదు. దేవతలై పుట్టిన ప్రయోజనము లేదు. బహు శాంతత్వమున్ను చాలదు. భక్తి తప్ప మరేదియును చాలదు.

"జ్ఞానం తు దుష్కరం లోకే భజనం సుకరం మతమ్
విజ్ఞానం న భవత్యేవ ద్విజా భక్తివిరోధినః
శంభు భక్తి కరస్త్యేవ భవేద్ జ్ఞానోదయో ద్రుతమ్" 
జ్ఞానం ఈ కలియుగమునందు ప్రయాసతో కూడుకున్నది. భజన పరమగు భక్తియే సులభమని మహర్షుల వాక్కు. భక్తిహీనులకు ఆత్మజ్ఞానం కలుగదు. ఈశ్వరభక్తి కలవానికే ఆత్మజ్ఞానోదయము సిద్ధించును.         


యోగః కర్మ చ సాంఖ్యం చ తపోధ్యానం వ్రతం శ్రుతమ్ / వ్యర్ధం హి భక్తిహీనస్య వృష్టిహీనా కృషిర్యధా //  
యోగాభ్యాసము, యజ్ఞాదికర్మ, సాంఖ్యావిచారం, తపస్సు, ధ్యానం, వ్రతం, వేదాంతశ్రవణం, ఇవన్నియు శ్రేష్టములే అయినప్పటికీ విత్తనములు మంచివయినను వర్షం లేనిచో ఎట్లు వ్యర్ధమగునో, అట్లు భక్తిలేనిచో పై యోగాదులన్నియు నిష్ఫలజాలం.

గీతలో శ్లోకములు -
"నాహం వేదైర్నతపసా న దానేన న చేజ్యయా
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యధా
"భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున 
జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప" 
అర్జునా!  వేదశాస్త్రములు చదువుటచేగాని, తపస్సుచేగాని, దానములుచేగాని, అశ్వమేధాది యజ్ఞములచేగాని భక్తిలేనియెడల నన్ను దర్శించుకోలేరు. నన్ను దర్శించుకొనుటకు అనన్యమైన భక్తియే మార్గం.


దీనివలన అర్ధమైంది ఏమిటంటే .....
భగవానునిపట్ల అమితప్రేమే భక్తి. భగవానుని దివ్యలీలలయందు, మహిమలయందు, గుణగానంలయందు, నామసంకీర్తనలయందు దైవవిషయాలు శ్రవణమందు మనస్సును లగ్నం చేయుటయే భక్తి. భక్తి ప్రాప్తించుటకు విద్య యొక్క ఆవశ్యకత లేదు. ఉన్నత వర్ణాశ్రమములు అవసరం లేదు. ధనం అవసరం లేదు. వేదాధ్యయనం, తపస్సులు అక్కరలేదు. అపారమైన విశ్వాసముతో నిరంతరం భగవంతున్ని స్మరిస్తే చాలు.


ఇక -
భక్తే ప్రేమ. ప్రేమే భక్తి. ప్రేమే ఆరాధన. ప్రేమే దైవం. ప్రేమే పరమాత్ముని స్వరూపం. ప్రేమే ఈశ్వరీయగుణం. ప్రతిఒక్కరి అంతఃచేతనల్లో వున్న అంతరాత్మే ప్రేమస్వరూపుడైన దైవం. ఈ దివ్య మూలప్రేమతత్వాన్ని తెలుసుకోవడంవలననే పరిపూర్ణ ప్రేమమూర్తులై ఓ క్రీస్తు, ఓ బుద్ధుడు, ఓ మహావీరుడు, ఓ మహమ్మద్ దైవరూపాన్ని పొందారు. ప్రేమ, దయ, శాంతి అన్నీ మనఅంతరంగంలోనే వున్నాయి. పండిత పామరులు అన్నభేదంలేకుండ, ధనిక, పేద అన్న తేడాలేకుండా, అందరిలోనూ ఈ ప్రేమ ఉంటుంది. ఐతే ఈ ప్రేమను 'నా' అనేవారికే పరిమితం చేయకుండా అందరిలోవున్న ఆత్మే ప్రేమస్వరూపుడైన భగవంతుడని గ్రహించి, దయార్ధమైన ఆలోచనలూ, మాటలు, చేతలతో అందరితో ప్రేమగా ఉంటే..... భువి స్వర్గసీమ కాదా? పరమాత్మను పొందలేమా?
భగవంతుని ప్రేమను పొందాలంటే మనలో ప్రేమతత్వమును పరిపూర్ణంగా పెపొందించుకోవాలి. సర్వదా, సర్వత్రా - ప్రేమతో, సంయమనంతో, సహనంతో వుండాలి. అంతటా ఈశ్వరున్నే చూడగలిగే స్థితిలో వుండగలగాలి. 


బుద్ధుడు చెప్పింది ఇదే - "మనం పరిపూర్ణమానవులుగా ఎదగాలంటే మన మనస్సుకు ఏ స్థితిలోనైనను ప్రేమ, దయ, ప్రశాంతత, సృజనాత్మకతతో వుండగలగడం నేర్పించాలి".





25, డిసెంబర్ 2011, ఆదివారం

వివాహం విశిష్టత

భారతీయ సంస్కృతికి మన ఆచారవ్యవహారాలు దర్పణం పడతాయి. అందులో అత్యంత అద్భుతమైనది, ఆదర్శనీయమైనది, అనుసరణీయమైనది మన వివాహపద్దతి.  
మానవుడు సంఘజీవి. వంటరిగా జీవించలేడు. తన భావాలను అనుభూతులను ఇతరులతో కలసిమెలసి ఉంటూ పంచుకున్నప్పుడే తన జీవనాన్ని తృప్తిగా ఆనందంగా సాగించగలడు. ఈ రీతిలో తాను ఆనందంగా తృప్తిగా  శాంతిసౌఖ్యాలతో జీవిస్తూ, తన ఈ ఆనందానుభూతిని తన చుట్టూ ఉన్నవారితో పంచుకుంటూ జీవించగలిగినప్పుడే ఆ వ్యక్తి జీవితానికి ఓ అర్ధముంటుంది. సాధారణంగా ఓ వ్యక్తి జీవనం బాల్యంలో సహచరులతో, యవ్వనంలో  జీవితభాగస్వామి మరియు సంతానములతో, వార్ధక్యంలో భార్య పిల్లలు, మిత్రులు సాధకులతో గడుస్తుంది. అయితే గురుపరంగా శాస్త్రాలను తెలుసుకొని అందరితో ప్రేమతో సేవాభావంతో ఉంటూ ధర్మజీవనం గడిపే మానవుడే మాధవుడుకు దగ్గరవుతాడు.

భారతీయ సంస్కృతి ప్రకారం మానవజీవితంలో నాలుగు ఆశ్రమములు ఉన్నాయి. ౧. బ్రహ్మచర్యం, ౨. గార్హస్థ్యం(గృహస్థం), ౩. వానప్రస్థం, ౪. సన్యాసం. సంపూర్ణజీవనానికి ఈ నాలుగు ఆశ్రమములు నిర్దేశించబడ్డాయి. ఈ ఆశ్రమములందు మొదట శాస్త్రవిజ్ఞానం, తర్వాత ధర్మబద్ధమైన సుఖానుభవం, అటుపై ధార్మికత్వం, తాత్త్వికత్వం క్రమముగా అలవడి అసలైన ఆనందమును అనుభవంలోనికి వస్తుంది.



                                     గృహస్థాశ్రమం 

బ్రహ్మచర్యాశ్రమంలో చక్కని విద్యావివేకజ్ఞానములను సంపాదించి అటుపై గురువుకు గురుదక్షిణ సమర్పించి స్నాతకుడు అవుతాడు. 'అవిచ్చన్నంగా నీవరకు వచ్చిన ఈ మానవసంతతిని విచ్ఛేదం చేయక గృహస్తుడవై నీవూ కొనసాగించు, వంశప్రతిష్ట పోకుండా వంశాన్ని నిలబెడుతూ కుటుంబపోషణార్ధం ధర్మముగా సంపాదిస్తూ అందులో కొంత అతిధులకు, ఆర్తులకు, సాధువులకు, సత్కార్యములకు ధార్మికంగా వినియోగించు' అన్న గురోపదేశంతో గృహస్థజీవితం ఆరంభమౌతుంది. సామాజిక దృక్పధంతో గమనిస్తే అన్ని ఆశ్రమములందు విశిష్టమైనది గృహస్థాశ్రమమే. నదీనదాలు సముద్రాన్ని ఆశ్రయించినట్లు ఇతర ఆశ్రమములు గృహస్థునే ఆశ్రయిస్తాయి. బ్రహ్మచారులు, వనప్రస్థులు, సన్యాసులు గృహస్థులపైనే ఆధారపడివున్నారు. గృహస్థజీవితం వివాహంతో ప్రారంభమౌతుంది. పెళ్లన్నది నూరేళ్ళ పంట అని, ఏడేడు జన్మల బంధమని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఈ వివాహబంధం గురించి మనశాస్త్రాలు ఏం చెప్తునాయో వధూవరులు అవగాహన చేసుకొని ఆచరిస్తే వారి దాంపత్యజీవనం అత్యంత అన్యోన్యంగా ఆనందంగా ఆదర్శనీయంగా అద్భుతముగా అలరారుతుంది.
ద్విధాకృత్వాత్మనో దేహ మర్దేన పురుషోభవత్ / అర్ధేన తస్యాం సా నారీ విరాజమసృజత్ ప్రభు: // (మనుస్మృతి)
పరమేశ్వరుడు తన దేహాన్ని రెండు భాగాలుచేసి ఒక సగంలో పురుషాకృతినీ, రెండవ సగాన్ని స్త్రీ రూపంగా సృజించాడు. అదే దాంపత్య ఆవిర్భావానికి ఆదిసంకేతం. అదే అర్ధనారీశ్వర తత్త్వం. అదే వివాహబంధానికి అర్ధం. 
'వహ్' అనే ధాతువుకు ప్రాపణమని అర్ధం. (ప్రాపణమంటే పొందించడం) 'వి' ఉపసర్గ. కన్యాదానం విశిష్టమైన సమర్పణం కావున వివాహమనే నామం ఏర్పడింది. ఆడపిల్ల తండ్రి, తన తనయను వరునికి అర్పించడం లేదా దానం చేయడమే వివాహం.

మానవజీవితంలో వివాహసంస్కారం ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నది. ఇది ఓ మహత్తరమైన వైదిక సంస్కారం. వివాహసంస్కారములో వివిధ కార్యక్రమాలుంటాయి. ప్రతీపని (పద్ధతి) వెనుక ఓ పరమార్ధం ఉంది. 
 వివాహప్రక్రియ వరునికి స్నాతకవ్రతంతో (నీవరకు వచ్చిన మానవసంతతిని ఆపక గృహస్థఆశ్రమంను స్వీకరించి యోగ్యమైనసంతానమును పొంది, ధర్మంగా సంపాదిస్తూ సక్రమముగా గృహనిర్వాహణ చేస్తూ, అందరిని సేవిస్తూ, జ్ఞానసముపార్జనయందు ఏమరపడక, సత్కార్యములుచేస్తూ, ధార్మికజీవనంగడపమన్న గురుమాటప్రకారం స్నాతకవ్రతమాచరిస్తాడు), వధువుకు గౌరీపూజతో (సర్వమంగళమయిన గౌరీదేవి పాతివ్రత్యానికి, పవిత్రతకు చిత్తదార్డ్యానికి సర్వశుభాలకు ఆశీస్సులు అందిస్తుంది కాబట్టి వధువు గౌరీపూజ ఆచరిస్తుంది) మొదలౌతుంది. 
        
                   వివాహప్రక్రియలో కొన్ని ప్రధానపద్ధతులు 

మంగళ స్నానములు:-  కొందరు ముత్తైదువులు  సిరిసంపదలతో సంతానసౌభాగ్యాలతో సంతోషంగా వుండమని ఆశ్వీరదిస్తూ, వధూవరులమంగళం కోరుకుంటూ వారిని పవిత్రీకరిస్తూ మంగళ స్నానములు ఆచరిస్తారు. 
మంగళాష్టకాలు:- నూతనవదువరులకు మంగళం కలగాలని లక్ష్మీనారాయణులను, పార్వతీపరమేశ్వరులను, సీతారాములను, రుక్మిణీకృష్ణులు మొదలగువారిని ప్రార్ధిస్తూ, దంపతులు కాబోతున్న వీరికి ఆయురారోగ్య భోగభాగ్యాలను సత్సంతాన్ని ప్రసాదించి అనుగ్రహించమని ఎనిమిది మంగళ శ్లోకములను చదువుతారు.
బాసికం:- మానవుని శరీరంనందు ఇడ పింగళ సుషుమ్న అనే ప్రధాన నాడులుంటాయి. ఇవన్నీ కలిసేస్థానం భ్రూమద్యం. భౌతికమైన ఉపద్రవాలనుండి రక్షణకోసం, ఇతరత్రా దృష్టిదోషం పడకుండా వధూవరులకు ఈ స్థానంలో భాసికదారణ చేస్తారు. 
కాళ్ళు కడగడం:- కళ్యాణవేదికపై  వధువు, వధువుతల్లితండ్రులు తూర్పుముఖముగా, వరుడు పశ్చిమముఖముగా కూర్చోగా వీరి నడుమ అడ్డుగా తెల్లటి తెరను (ఆ తెరపై స్వస్తిక్ గుర్తువుంటే మరీమంచిది) వధువుతరుపువారు ముగ్గురు ఓప్రక్కన, వరుడుతరుపువారు ఇద్దరు మరోప్రక్కన పట్టుకుంటారు.కన్యాదాత, అతనిభార్య వరుడును శ్రీనారాయణస్వరూపముగా భావించి, అల్లుని కాలుకడిగి పూజించి కన్యాదానం చేస్తారు. కన్యాదాత పెండ్లికుమారుని కాళ్ళు కడిగినప్పుడు అంతా భగవన్మయంగా భావిస్తూ శ్రీనారాయణుని పాదాలను కడుగుతున్న భావనతో  ముందుగా కుడిపాదంను, తర్వాత ఎడమపాదంను ఆపై రెండు పాదములను కడగాలి.
కన్యాదానం:- అన్నిదానంలోనూ గొప్పదానం కన్యాదానం. కన్యాదానం చేయబోయేముందు కన్యాదాత ఇలా అంటారు -
'కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతామ్ / దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయా //
భావం:- బ్రహ్మలోకప్రాప్తికోసం నేను సువర్ణసంపదగల స్వర్ణాభరణభూషితమైన ఈ కన్యను నారాయణస్వరూపుడవైన నీకు దానం చేయబోతున్నాను.
విశ్వంభర స్సర్వభూతా స్సాక్షిణ్యః సర్వదేవతాః / కన్యా మిమాం ప్రదాస్యామి పితృణాం తారణాయ వై //
భావం:- భగవంతుడు, పంచభూతాలు, సకలదేవతలు సాక్షులుగా నా పితృదేవతలు తరించడానికి ఈ కన్యను దానం చేయబోతున్నాను.
కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే / ప్రయత్కోహం ప్రయచ్చామి ధర్మకామార్ధసిద్ధయే //
భావం : సర్వాలంకారశోభిత, సాధ్వి, సుశీలయిన ఈ అమ్మాయిని ధర్మార్ధకామాలనే పురుషార్ధాలు సిద్ధించడానికి నియమపూర్వకంగా ఈ బుద్ధిమంతునికి దానం చేస్తున్నాను.
నాతిచరామి:- వదువుతండ్రి కన్యాదానం చేస్తూ, వరునిని ఇలా మాటివ్వమని అడుగుతాడు - "నాయనా! అల్లారుముద్దుగా పెంచిన నా కుమార్తెను నీ చేతిలో పెడుతున్నాను. నీవు ఈమెను (స్నేహేన పాలయ) స్నేహంతో చూసుకోవాలి. జీవితంలో మీరిద్దరూ కలిసిమెలిసి ఎన్నో మంచిపనులు చేయాలి. సిరిసంపదలను అనుభవించాలి. సత్సంతాన్ని కనాలి. ధర్మార్ధకామాలనే పురుషార్ధాలను సంపాదించడంలో నీకు అర్ధాంగి అయిన నా కూతురును అతిక్రమించి వెళ్ళకు. అలా అతిక్రమించి వెళ్లనని నాకు మాట ఇవ్వు అని అడగగా (ఈమెను అతిక్రమించనని మాట ఇస్తున్నాను) "నాతిచరామి" అని మూడుసార్లు అల్లుడు అంటాడు. 
సమీక్షణం:-  వధూవరుల చేతిలో జీలకర్రబెల్లమును మెత్తగా నలిపి ఉండచేసి సిద్ధంగా వుంచుతారు. మంగళవాద్యాలు మ్రోగుతుండగా వేదమంత్రాలు పురోహితులు పఠిస్తుండగా దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహుర్తాన వరుడు ఇష్టదైవమును ధ్యానిస్తూ వధువు నడినెత్తిన బ్రహ్మరంద్రంపైన, వధువుకూడా అదే సమయమున తన ఇష్టదైవంను ధ్యానిస్తూ వరుని నడినెత్తిన బ్రహ్మరంద్రంపై పెట్టగ నెమ్మదిగా  తెరతొలగిస్తున్న ఆ సుమూహర్త సమయమున వధూవరులు ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడమే సమీక్షణం. జీలకర్రబెల్లమును ఒకరితలపై ఒకరుపెట్టుకోవడంద్వారా ఒకరుమస్తాకాన్ని ఒకరు స్పృశిస్తారు. తద్వారా హస్తమస్తక సంయోగామన్న యోగక్రియ సిద్ధిస్తుంది.  జీలకర్రబెల్లం ఈ రెండింటి సంయోగంవలన ఒక ధనసంజ్ఞక విద్యుత్తుశక్తి జనిస్తుంది. హస్తమస్తకసంయోగం వలన ఒకరిలోని విద్యుత్తు ఒకరిలోనికి ప్రసరించి ఇరువురి మనస్సులను ఏకంచేస్తుంది. అందుకే ఆ శుభసమయమున ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడంవలన వధూవరులకిద్దరకు ఒకరిపై ఒకరికి స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరిగి ఏకత్వభావన జీవితాంతం దృఢపడివుంటుందన్నది వేదప్రమాణం. శుభక్షణాల్లో కలిసిన అనురాగామయమైన ఆ దృష్టి వారిమధ్య మానసిక అనుబంధాన్ని క్షణక్షణమునకు పెంచి చక్కటి అన్యోన్య దాంపత్యానికి నాంది కాబట్టి ఆ సమయంలో ఒకరినొకరు చూసుకోవడంలో ఏమరిపాటు పనికిరాదు. ఈ ముఖ్యవిషయంను, దీనియొక్క అద్భుతఫలితంను పెద్దలు వధూవరులకు ముందుగానే తెలిపి వారిని సంసిద్ధులు చేయవలెను. 
  • ముఖ్యగమనిక:- ఫొటోస్ తీసుకోవడం, వీడియో చిత్రీకరణలు, బంధుమిత్రుల కబుర్లు నడుమ ఆ సుమూహుర్త సమీక్షణం చేజార్చుకోవద్దు. కావాలంటే ఆ భంగిమలతో తర్వాత ఫొటోస్ తీసుకోవచ్చు. సమీక్షణం విశిష్టతను వధూవరులకు ముందుగానే తెలిపి   జీవితాంత మధురానుబంధంనకు ప్రాధాన్యత ఇవ్వండి. 
మంగళసూత్రం:- సకల మంగళాలకు ఆలవాలమైన సూత్రం మంగళసూత్రం. పరిణయ బందానికి చిహ్నం ఈ సూత్రం. ఉభయకుటుంబాల వంశాచారానికి తగినట్లు తయారుచేసిన బంగారు మాంగళ్యాలను పసుపుత్రాటితో గ్రుచ్చి మంగళదేవత గౌరీదేవి, లక్ష్మీదేవిలను ఆవాహనం చేస్తూ పూజించిన తర్వాత పురోహితుడు, పెద్దలు, ముత్తైదువలు  శుభాన్ని కాంక్షిస్తూ మంచిహృదయంతో దానిని తాకుతారు. అటుపై వరుడు వధువు మెడలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలనడుమ పెద్దల ఆశీర్వాదముల సాక్షిగా ఈ మంత్రాన్ని చెప్తూ -
"మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా / కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతమ్ //  
భావం:- నా సుఖజీవనానికి హేతువులైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవూ నూరేళ్ళు వర్ధిల్లు. అని మూడు ముళ్ళు వేస్తాడు.
తలంబ్రాలు:- వధూవరులు ఒకరితలపై మరొకరు పసుపుతో తడిపిన అక్షితలను దోసిళ్ళతో పోసుకోవడంను తలంబ్రాలు అంటారు. ఇక్కడ చెప్పే మంత్రాలలో కూడా ఓ పరమార్ధముంది. వరుడు వధువు దోసిట్లో ఎండుకొబ్బరిచిప్పతో అక్షతలను పోసి నేతితో ప్రోక్షిస్తాడు. తర్వాత పురోహితుడు వరుని దోసిట్లో అదే మాదిరిగా అక్షితలను పోసి నేతితో ప్రోక్షించి వధువుదోసిలిపై వరునిదోసిలి పెట్టి ఈ మంత్రాలను చదువుతాడు -
కపిలాగ్o  స్మారయన్తు, బహుదేయం చాస్తు, పుణ్యం వర్ధతామ్, శాన్తిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు, కర్మసమృద్ధిరస్తు, దంపత్యో: సగ్రహే సనక్షత్రే సహా సోమేన క్రియేతాం, శాంతి రస్తు.
భావం:- కర్రి ఆవులను స్మరించండి, అనేక దానాలను చేయండి, పుణ్యం వృద్ధిపొందాలి, శాంతి పుష్టి తుష్టి వృద్ధి కలగాలి, విఘ్నాలు తొలగిపోవాలి, ఆయుస్సు ఆరోగ్యం కలగాలి, క్షేమం మంగళం కలగాలి, సత్కర్మలు వృద్ధి పొందాలి, గ్రహాలవలన నక్షత్రాలు వలన సోమునివలన దాంపత్యం సరిగా జరగాలి. శాంతి కలగాలి. 
ఆపై వరుడు 'ప్రజామే కామ స్సమృధ్యతామ్' (నేను కోరే సంతానం సమృద్ధిగా ఉండాలి) అని అంటూ   వధువుతలపై తలంబ్రాలు పోస్తాడు. అటుపై వధువు 'పశవో మే కామ స్సమృధ్యతామ్' (వారి పోషణకై నేను కోరిన పశు సమృద్ధి ఉండాలి) అని అంటూ వరునితలపై తలంబ్రాలు పోస్తుంది. 'యజ్ఞో మే కామ స్సమృధ్యతామ్' ( నేను కోరిన త్యాగం సమృద్ధిగా ఉండాలి) అని మరల వరుడు తలంబ్రాలు  వేస్తాడు. ఇలా వధూవరులు బాసలు చేసుకుంటూ ఆనందంతో ముచ్చటగా మూడుసార్లు పోసుకున్నతర్వాత ఇద్దరు కలిసి 
'శ్రియో మే కామ స్సమృధ్యతామ్' (మాకు కావాల్సిన సిరిసంపదలు సమృద్ధిగా ఉండాలి) 'యశో మే కామ స్సమృధ్యతామ్' (మేము కోరిన కీర్తిప్రతిష్టలు సమృద్ధిగా ఉండాలి) అని అంటూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు. 
బ్రహ్మముడి:- వధువు చీరఅంచును వరుని ఉత్తరీయంఅంచును కలిపి ముడివేయడంను బ్రహ్మముడి అంటారు. పురోహితుడు ఇద్దరి కొంగులు ముడివేస్తూ ఈ మంత్రాన్ని చెప్తాడు -
'ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి: / ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్ //
భావం:- దాంపత్యసామ్రాజ్యాన్నిఅనుభవించే మీకు, రాజైన వరుణుడు, దేవుడు బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చలత్వాన్ని కలగజేయాలి. 
పాణిగ్రహణం:- వివాహమందు ఇదీ ఓ ప్రధానఘట్టమే. వధూవరులు పరస్పరం ఒకరిచేతిని ఒకరు పట్టుకుంటారు. 'నా పెద్దల లాగానే నేను కూడా మంచి సంతానం కోసం నిన్ను పాణిగ్రహణం చేస్తున్నాను. భగుడు, అర్యముడు సవిత అనే దేవతలు నా గృహస్థాశ్రమం కోసం నిన్ను గృహిణిగా చేస్తున్నారు అని అంటూ వధువుకు తన కుడిచేతిని అందిస్తాడు. వధువు వరునిచేతిని పట్టుకోవడంలో కూడా ఓ విశేషత ఉందని పెద్దలు చెప్తుంటారు. మొదట మగపిల్లవాడు కావాలంటే వరుడి బొటనవేలు మాత్రమే వధువు పట్టుకోవాలి. చిటికినవేలు పట్టుకుంటే ప్రధమ సంతానం ఆడపిల్ల అవుతుందని అంటారు. అందుకే ఆడమగ సంతానం అభిలాషిస్తూ అన్నివేళ్ళు కలిపి పట్టుకోమని అంటుంటారు.
సప్తపది:- పాణిగ్రహణం చేసిన తర్వాత వరుడు వధువుతో కల్సి తూర్పుకుగాని, ఉత్తరందిశగా గాని ఏడడుగులు వేయడాన్నే సప్తపది అంటారు. దీనివలన ఇద్దరిమద్య స్నేహబంధం ఏర్పడుతుంది. ఇక్కడ వరుని వెంట వధువు వేస్తున్న ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క ప్రయోజనం వుందని వరుడు వధువుకి ఇలా వివరిస్తాడు - నీవు నా వెంట నడు. విష్ణుమూర్తి, నీవు నాతో వేసిన మొదటి అడుగు వలన అన్నాన్ని, రెండవఅడుగువలన బలాన్ని, మూడవఅడుగువలన మంచికార్యాలను, నాల్గోఅడుగువలన సౌఖ్యాన్ని, ఐదోఅడుగువలన పశుసమృద్ధిని, ఆరోఅడుగువలన రుతుసంపదలను, ఏడోఅడుగువలన ఏడుగురు హోతలను నీకు అనుగ్రహించుగాక! 
ఏడడుగులు వేసిన తర్వాత వరుడు వధువుతో మరల ఇలా అంటాడు...
సఖా సప్తపదా భవ. సఖాయౌ సప్తపదా బభూవ. సఖ్యంతే గమేయం. సఖ్యాంతే మా యోషం. సఖ్యాన్మే మా యోష్టాః సమయావ. సంకల్పావహై. సంప్రియౌ రోచిష్నూ సుమనస్యమానౌ ఇష మూర్జ మభి సంవసానౌ సం నౌ మనాంసి సంవ్రతా సముచిత్తాన్యకరమ్.
భావం:- నాతో ఏడడుగులు నడిచి నాకు మంచి స్నేహితురాలివి కావాలి. మనమిద్దరం కలిసి ఏడడుగులు నడిస్తే స్నేహితులమౌతాం. అప్పుడు నేను నీ స్నేహాన్ని ప్రేమను పొందుతాను. నీ స్నేహన్నుంచి ఎన్నటికి వియోగం పొందను. నా స్నేహంనుంచి నీవెన్నడూ వియోగం పొందకు. పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, నిండు మనస్సుతో ఆహారాన్ని, బలాన్ని పొందుతూ కలిసి వుందాం. కలిసి ఆలోచించుకుందాం. మన మనస్సులు కలిసేలా నడుచుకుందాం. అలాగే అన్ని నియమాల్లోను కలిసి ఉంటూ నడుచుకుందాం.
అరుంధతీ నక్షత్రం:- వివాహం జరిగిన తర్వాత వధూవరులకు ధ్రువనక్షత్రమును, తర్వాత అరుంధతీ నక్షత్రమును పురోహితుడు చూపించి నమస్కారం చేయమని చెప్తాడు. ఎందుకంటే వారు ధ్రువనక్షత్రంలాగా నిశ్చలమైన మనస్థత్వాలతో స్థిరంగా వుండాలని, వధువు అరుంధతిలా మహా పతివ్రత కావాలనే ఉద్దేశ్యం ఇందులో వుంది.
వధూవరులబాసలు:- మొత్తం వివాహ ఘట్టంలో వధూవరులమద్య హైందవ జీవనానికి ప్రయోజనం కలిగించే బాసలు ఎన్నో వుంటాయి. అందులో కొన్ని ...
వరుడు ఇలా కోరుకుంటాడు - 
లోకోపకార స్వభావంగల అగ్నిదేవుడు ఈ వధువుకు వివాహం అయిన తర్వాత పుట్టింట మీద మమకారం తగ్గించి అత్తింటి మీద అభిమానం కలదానిగా చేయాలి. బ్రహ్మదేవుడు మా ఇద్దరికీ సకలసంపదలను ఇచ్చి దీర్ఘాయుష్యాన్ని అనుగ్రహించాలి. సుమంగళిగా, సౌభాగ్యవతిగా, దీర్ఘాయుష్యంతో ఉండే ఈ వధువును ఇంకా ఇంకా సుమంగళి, సౌభాగ్యవతి, దీర్ఘాష్మంతురాలు కావాలని పెద్దలైన మీరందరూ ఆశ్వీరదించి మీ మీ ఇండ్లకు వెళ్ళండి అని కోరుతాడు.
వధువు ఇలా కోరుకుంటుంది - 
నిన్ను నా అభిప్రాయంలను ఎరిగినవాణ్నిగాను, మంచి సంస్కారంతో పుట్టినవాడిగాను, మంచినియమాలతో నిజాయితితో పెంచుకున్న తేజస్సుగలవానిగా నేను గ్రహించాను. సంతానాభిలాషగల నీవు నాతో సంతానాన్ని కని, ధర్మంగా సిరిసంపదలను సంపాదించి సుఖంగా జీవితాన్ని గడపాలి అని కోరుకుంటుంది.
అటుపై వధూవరులిద్దరు ఇలా కోరుకుంటారు - 
సమంజంతు విశ్వే దేవా స్సమాపో హృదయాని నౌ / సం మాతరిశ్వా సం ధాతా సముదేష్ట్రీ దిదేష్టు నౌ //
భావం:- విశ్వదేవులు, పవిత్రజలాలు, వాయువు, బ్రహ్మ మన మనస్సులను ఎన్నటికీ స్నేహంతో కలిసిపోయేటట్లు చేయాలి. వాగాధిదేవత సరస్వతి మనమెప్పుడు ప్రేమతో అభిమానంతో అనుకూలంగా మాట్లాడుకొనేటట్లు అనుగ్రహించాలి అని కోరుకోగా ...
పెద్దలు ఇలా ఆశ్వీరదిస్తారు -
అభివర్ధతాం పయసాభిరాష్ట్రేణ వర్ధతామ్ / రయ్యా సహస్రపోషసే మౌస్తా మనపేక్షితౌ //
భావం:- ఈ వధువు పాడిపంటలతోను, ఇండ్లతోను, భూములతోను, సంపదతోనూ, సకలసౌఖ్యలతో తులతూగుతూ మాకందరికీ అభివృద్ధిని కలిగించాలి. ఈ దంపతులు సకల సంపదలతో, సర్వ సమృద్ధి లతో దేనికీ ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి.
పుత్రిణేమా కుమారిణా విశ్వమాయుర్వ్యశ్నుతమ్ / ఉభా హిరణ్యపేశసా వీతిహోత్రా కృతద్వసూ //
భావం:- పదహారువన్నెల బంగారంలాగా పచ్చగా ప్రకాశిస్తున్న ఈ కొత్తదంపతులు కొడుకులు, కూతుళ్ళతో ఈ సమాజంలో మంచిపనులు చేస్తూ, సిరిసంపదలనుభవిస్తూ దీర్ఘాయుష్యాన్ని పొందాలి.
వధూవరులకు కొన్ని సూచనలు -
పెళ్లన్నది నూరేళ్ళ పంట అని, ఏడేడు జన్మలబందమని పెద్దలంటారు. ఇటువంటి బందాన్ని ఆనందంగా అన్యోన్యతగా ఉండాలనుకుంటే దంపతులమద్య చక్కటి అవగాహన, పరస్పర నమ్మకం, సానుకూలదృక్పదం తప్పనిసరిగా ఉండాలి. 
అనుకోనిసందర్భాలయందు ఏ పరిస్థితులకారణంగానైనా ఇద్దరిమద్య కోపతాపాలు, పట్టింపులు చోటుచేసుకున్నప్పుడు మనది జీవితకాల శాశ్వతబందమన్న సత్యాన్ని మరువక కాస్త సర్దుకుపోవడం ఇద్దరికీ తప్పనిసరి.
జీవితరధానికి ఇద్దరు రెండుచక్రాలు. కనుక దంపతులు వారివారి సమస్యలను, మాటపట్టింపులను అనురాగంతో అవగాహనతో వారే పరిష్కరించుకోవడం ఉత్తమం.
భిన్నకుటుంబంలో పుట్టి విభిన్న వాతావరణంలో పెరిగిన వధువు, వరుడు వివాహం ద్వారా దగ్గరౌతారు. తమని ఒకటిచేసిన వివాహబంద విలువను గ్రహించి వారివారి భావనలను అలవాట్లును అర్ధవంతంగా ఆరోగ్యవంతంగా ఒకటిగా చేసుకొని నడుచుకోవాలి.
భర్తకు సంబందించిన అన్ని బాధ్యతలందు భార్య పాలుపంచుకోవాలి. భర్తను అనుసరిస్తూ, అతనిని అర్ధంచేసుకుంటూ మనస్సులో మనసై, తనువులో తనువై ఆనందంగా ప్రవర్తించాలి. మృదుమధురంగా మనుగడ సాగిస్తూ మగని మన్నన పొందగలగాలి. కుటుంబగౌరవప్రతిష్టలు ఇల్లాలిపైనే ఆధారపడివుంటుంది కాబట్టి భర్త కుటుంబంను భార్యగా, కోడలుగా, వదినగా, తల్లిగా చక్కగా నేర్పుగా ఇంటిలో పెద్దల సలహాలతో నిర్వహించగలగాలి. అత్తవారింట్లో అత్తమామయ్యలను, ఆడబిడ్డలను, తోడికోడళ్ళను, బావామరుదులను, ప్రేమగా చక్కగా చూసుకుంటూ ఇంటికి దీపంలా వెలుగొందాలి.
కుటుంబఅభివృద్ధిని, అందరిహితంను కోరే భర్త ఎప్పుడూ తన భార్యను తనతో సమానంగానే భావించాలి. అందరినీ వదిలి తనచేయి పట్టుకొని ఎంతో నమ్మకంతో సహధర్మచారిణిగా తన ఇంటికి వచ్చిందన్న భావనతో భార్యను ప్రేమగా అర్ధంచేసుకుంటూ ఆమెను చక్కగా చూసుకోవాల్సిన భాద్యత భర్తదే. 
శ్రీరస్తు                                                                శుభమస్తు                                                                                  


                                                    

1, డిసెంబర్ 2011, గురువారం

వేదమాత - గాయత్రి (ద్వితీయ భాగం)


"ఓం భూర్భువ స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
గాయత్రి ఉపనిషద్ 
వేదాలనుండి 'బ్రాహ్మణ' గ్రంధాలు ఆవిర్భవించాయి. ప్రతి వేదానికి అనేక బ్రాహ్మణ గ్రంధాలున్నాయి. అయితే నేడు అందుబాటులో వున్నవి కొన్ని మాత్రమే. ఋగ్వేదానికి రెండు, యజుర్వేదానికి మూడు, సామవేదానికి పదకొండు, అధర్వణ వేదానికి ఒక బ్రాహ్మణం అందుబాటులో వున్నాయి. అధర్వణ వేదానికి "గోపధ"బ్రాహ్మణం వుంది. ఈ గోపధబ్రాహ్మణం లోని 31 నుండి 38 వరకు ఉన్న ఎనిమిది ఖండాలను 'గాయత్రీ ఉపనిషద్' అంటారు. ఇందులో మైత్రేయ, మౌద్గల్యుల పరస్పర ఉపాఖ్యానంద్వారా గాయత్రీ మహాత్య రహస్యాలు తెలియజేయబడ్డాయి.
మైత్రేయుడు మొదట అహంభావంతో ప్రవర్తించి, ఆపై తన తప్పుని గ్రహించి అహమునువీడి ఎంతో మహత్యం ఆపాదించబడిన గాయత్రీమాత ప్రత్యేకతను తెలుసుకోవడానికి మౌద్గల్య ఋషికి సేవకుడిగా చేరి ఇలా ప్రశ్నించాడు -
కింస్విదాహుర్భో: సవితుర్వరేణ్యం భర్గో దేవస్య కవయః కిమాహు / ధియో విచక్ష యది తాః ప్రవేత్ధన్య ప్రచోదయ వితాయాభిరేతి //
౧. సవితా వరేణ్యం అని దేనిని అంటారు?
౨. ఆ దేవుని భర్గ ఏమిటి?
౩. 'ధీ' సూచించే, అందరికీ ప్రేరణనిస్తూ సవిత సంచరించే ఆ తత్వాలును తెలపమని ప్రశ్నించగా ---
మౌద్గల్యఋషి ఇలా చెప్తున్నారు -
వేదాశ్చందాంసి సవితుర్వరేణ్యం భర్గో దేవస్య కవయ్యోకన్నమాహు: / కర్మాణి ధియస్తదుతే ప్రబ్రవీమి ప్రచోదయన్సవితాయామిరేతి //
౧. వేదాలు మరియు ఛందస్సులు సవితా వరేణ్యంలు.
౨. పండితులు అన్నాన్నే దేవుని భర్గ అంటారు.
౩. కర్మయే 'ధీ' తత్వం. దీని ద్వారా అందరికీ ప్రేరణనిస్తూ సవిత సంచరిస్తూ ఉంటుంది.
వివరణ:-
౧. వేదాలు మరియు ఛందస్సులు సవితా వరేణ్యంలు : వేదమంటే జ్ఞానం. తత్వజ్ఞానం ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారా పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది. అయితే ఆ జ్ఞానం కేవలం వాచకమాత్రంగా, పుస్తకపఠనంవలన, విన్నమాత్రమున రాదు. తత్వజ్ఞానం అనుభవపూర్వకముగా అలవడుతుంది. దేనినైన సహేతుకమైన తర్క ప్రామాణికతలతో పరిశీలించి సత్యాన్ని గ్రహించాలి. పూర్ణ భక్తి తత్పరతలతో ఏది కళ్యాణ కారకమో, ఏది ముక్తినిస్తుందో గ్రహించాలి. అలా గ్రహించిన విషయములందు పరిపూర్ణ ప్రగాఢ విశ్వాసమును కలిగియుండాలి. సత్యం, పరోపకారం, సంయమనం, నిజాయితీ మొదలగు సత్వగుణములను అలవర్చుకొని, అదే శ్రద్ధతో ఆ జ్ఞానమును (గ్రహించిన విషయములను) జీవితములో వ్యావహారికంగా ఆచరించాలి. వేదాలు మరియు ఛందస్సుల కలయికతో సవితను అందుకోవడం జరుగుతుంది. జ్ఞానం మరియు అనుభవంతో పరమాత్మను పొందడం జరుగుతుంది.
౨. దేవుని భర్గ అన్నం : దేవుని భర్గ (బలం) అన్నం. శ్రేష్ఠుల బలం సాధన. శ్రేష్టత్వంను శక్తివంతముగా చేయాలంటే అన్నం, సాధనాలు అవసరం. అన్నం, సాధనా సామగ్రి అంతయు లక్ష్మీశక్తి. అందుకే ధనమును, సాధనా సామగ్రులను భోగాలకు, లోభాలకు, కూడబెట్టడానికి, స్వార్ధానికి  అహంకారదర్పానికి వినియోగించక దైవత్వ కార్యక్రమములకు, మానవీయ సేవాకార్యక్రమములకు ఉపయోగించాలి.
౩. కర్మయే ధీ తత్వం : కర్మల ద్వారానే పరమాత్మ అందరిని వికశింపజేస్తాడు. పరమాత్ముడు అందరిని ఉన్నతిపధంవైపే ప్రేరేపిస్తాడు. ఈ ప్రేరణ యొక్క రూపం ధీ. ధీ అనగా కర్మచేసే ప్రేరణని ప్రోత్సాహాన్ని ఇచ్చే బుద్ధి.
మరల మైత్రేయుడు ఇలా ప్రశ్నించాడు - 
తముప సంగృహ్య పప్రచ్చాధీహి భో:, క- సవితా, కా సావిత్రీ 
సవితా అంటే ఏమిటి? సావిత్రి అంటే ఏమిటి?
ఈ ప్రశ్నలకు మౌద్గల్య ఋషి ఇలా బదులిచ్చెను -
                                                              ప్రతి మంత్రానికి ఒక దేవత ఉంటుంది. గాయత్రి యొక్క దేవత సవిత. గాయత్రికే మరో పేరు సావిత్రి. (గాయత్రి, సావిత్రి, సరస్వతి అని వేదమాత గాయత్రికి పేర్లు కలవు. ఇంద్రియములపై ఆధిపత్యం వహించునది కావున గాయత్రి అనియు, సత్యమును పోషించునది కావున సావిత్రి అనియు, వాగ్దేవత స్వరూపిణి కావడంచే సరస్వతి అనియు అందురు)  ప్రణవం, వ్యాహృతి, సావిత్రి ఈ మూడింటి కలయికే గాయత్రి మంత్రం. సవిత, సావిత్రి ఈ రెండింటికీ అవిచ్చన్న సంబంధం ఉంది.  తేజస్వి పరమాత్మ సవిత, ఆయన శక్తి సావిత్రి. ఈ రెండు కలిసి ఓ జంట. ఒకటి కేంద్రమైతే రెండవది దాని శక్తి. ఆ శక్తే గాయత్రి. 
మనస్సు సవిత, వాక్కు సావిత్రి. అగ్ని సవిత, పృథ్వి సావిత్రి. వాయువు సవిత, అంతరిక్షం సావిత్రి. ఆదిత్యుడు సవిత, ద్యౌ సావిత్రి. చంద్రుడు సవిత, నక్షత్రాలు సావిత్రి. పగలు సవితా, రాత్రి సావిత్రి. ఉష్ణం సవిత, శీతలం సావిత్రి. మేఘాలు సవిత, వర్షం సావిత్రి. విద్యుత్తు సవిత, దాని మెరుపు సావిత్రి. ప్రాణం సవిత, అన్నం సావిత్రి. వేదాలు సవిత, ఛందస్సు సావిత్రి. యజ్ఞం సవిత, దక్షిణ సావిత్రి.  
దేని యొక్క విస్తారం ఒంటరిగా జరగదు. అలానే పరమాత్ముడు వ్యక్తమవ్వాలంటే అతని శక్తి ద్వారానే అది సంభవం.
శక్తి - శక్తిమంతుడు అంటే సవిత - సావిత్రి కలయికలా ప్రతీ సాధకుడు తనలో శక్తులను బహుళముగా సంఘటితం చేసుకొని ప్రయత్నించినప్పుడే పరమాత్మను పొందగలడు అని మౌద్గాల్యుడు వివరించగా సవిత, సావిత్రుల రహస్యాన్ని మైత్రేయుడు తెలుసుకున్నాడు. మంత్రరాజమైన గాయత్రీ మంత్రం మోక్షప్రదాయిని అని తెలుసుకుంటాడు. సత్య జ్ఞాన వాస్తవిక రూపాన్ని, గాయత్రి తత్వమును తెలుసుకొని పరిపూర్ణుడు అయ్యాడు. 
మనస్సు అంతర్ముఖమైతేగానీ మోక్షం యందు మనస్సు నిలవదు. (ఇంద్రియములద్వారా బయటికి పరిగెత్తే మనస్సును లోపలకు త్రిప్పుటను అంతర్ముఖత్వం అంటారు). మనస్సు అంతర్ముఖం కావాలంటే మంత్రానుష్టానం, మంత్రజపం, నామజపం, ధ్యానం మొదలగు సాధనములు తప్పనిసరి. గాయత్రిమంత్రం ద్వారా అంతర్ముఖం చెందడం సులభమని అనుభవజ్ఞుల అభిమతం. 

18, నవంబర్ 2011, శుక్రవారం

వేదమాత - గాయత్రి

త్రికాలజ్ఞులై నిష్కాములైన భౌతికసుఖములనుకోరని ఋషీశ్వరులు యోగదృష్టితో లోకకళ్యాణమునకు ఉత్కృష్టమైన మంత్రములు ప్రసాదించిరి. 
మకారం మననం ప్రాహు స్తకారస్త్రాణ ఉచ్యతే/మనన త్రాణసంయుక్తో మంత్ర ఇత్యభి ధీయతే // 
'మ' మననం చేయువానికి 'త్ర' రక్షించును. అనగా మననం చేయువానిని రక్షించునది మంత్రమనబడును.
మంత్రములలో శైవ మంత్రములు ఒక కోటి, సౌరములు రెండు కోట్లు, గణేశ మంత్రములు ఏబది లక్షలు, వైష్ణములు ఏబది లక్షలు, శక్తి మంత్రములు మూడు కోట్లు గలవు. ఈ సప్తకోటి మహామంత్రములలో ఆది మంత్రం "గాయత్రి".
యోగులకంటే మంత్రజపం చేయువారు మిగుల ఉత్తములని భారతమున చెప్పబడెను. యజ్ఞములన్నింటిలో జపయజ్నం శ్రేష్టమైనది. యజ్ఞానం జపయజ్ఞోస్మి (భగవద్గీత) . 'సర్వమంత్రేషు గాయత్రీ వరిష్టా ప్రోచ్యతే బుధై:' సర్వమంత్రములలో గాయత్రిమంత్రం మిక్కిలి శ్రేష్టమైనది.
 'గయాన్  త్రాయతేసా గాయత్రీ 'అనగా ఏది గయ - ప్రాణమును రక్షిస్తుందో - అది గాయత్రి (ఐతరేయ బ్రాహ్మణం). ప్రాణములను ఉద్ధరించే  సామర్ద్యము కారణముగా ఆదిశక్తి గాయత్రి అనుబడినది. 'గాయత్రీ వేద మాతా చ' గాయత్రి వేదములయొక్క తల్లి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తియు గాయత్రీ శక్తిజనితములు. శంకరాచార్య భాష్యములో గాయత్రీశక్తిని స్పష్టం చేస్తూ ఇలా చెప్పబడినది - 'గీయతే తత్వమనాయ గాయత్రీతి ' అనగా ఏ వివేకబుద్ధి ఋతంభరా ప్రజ్ఞ ద్వారా వాస్తవికత యొక్కజ్ఞానము లభింపజేస్తుందో అది గాయత్రి. 
గాయత్రీ తు స్వయం పూర్ణో యోగ ఇత్యుచ్చతే బుధై: / కించిత్తత్వం హి యోగస్య బహిరస్మాన్న విద్యతే //
భావం : గాయత్రి స్వయముగా పూర్ణయోగం అని పండితులు తెలియజేశారు. యోగం యొక్క ఏ తత్వాలు దీనికి బాహ్యముగా లేవు. యోగమనగా కలయిక. ఆత్మను పరమాత్మలో కలిపేదే యోగం. ఐతే యోగసాధన మార్గాలు అనేకం. ఒకొకరి సాధన ఓకోలా వుంటుంది. సాధకుని స్థితిబట్టి, అవగాహనబట్టి, అనుకూలతబట్టి, శక్తిబట్టి, యోగ్యతబట్టి తమకు నచ్చిన సాధనమార్గాన్ని అనుసరిస్తారు. ఏ సాధనైన దాని పరమార్ధం పరమాత్మలో సంలీనమే. ఈ సాధనామార్గాలలో గాయత్రీ సాధన ఒకమార్గం.
గాయత్రీమాతకు ఐదు ముఖములుండును. అందు మొదటిది ముత్యపురంగు, రెండవది పగడపురంగు, మూడవది బంగారపు వన్నెయు, నాల్గవది ఇంద్రనీలపువర్ణమును, ఐదవది వజ్రపువర్ణమును కలిగియుండును. ఈమె త్రినేత్రదారిణి. నవరత్నకిరీటమును ధరించి ప్రకాశమానమై యుండును. దశబాహువులు కలిగి అందు వరదాభయముద్రలను, అంకుశం, కొరడా, కపాలం, శంఖ చక్ర గదా పద్మద్వయమును ధరించి ఎల్లప్పుడూ భక్తులను రక్షించుచుండును. 
                      * ఆదిశక్తి - వేదమాత - దేవమాత - విశ్వమాత *
గాయత్రి పరమాత్మ యొక్క ఇచ్చ్చాశక్తి. దాని కారణముగా సృష్టి మొత్తం నడుచుచున్నది. చిన్న పరమాణువు మొదలుకొని పూర్తి విశ్వబ్రహ్మాండం వరకు ఆమె యొక్క శక్తిప్రభావం వలననే చరిస్తున్నాయి. పరమాత్మ స్వయముగా మౌలికరూపంలో నిరాకారుడు, అన్నిటినీ తటస్థ భావముతో చూస్తూ శాంతియుత అవస్థలో ఉంటారు.సృష్టి ప్రారంభంలో ఆయనకు ఒకటి నుండి అనేకము అయే కోరిక కలిగినప్పుడు, ఆయన ఈకోరిక శక్తిగా తయారైనది.ఈ శక్తి సహాయంతోనే మొత్తం సృష్టి తయారై నిలబడినది. సృష్టిని తయారుచేసే ప్రారంభికశక్తి అయిన కారణముగా గాయత్రీనీ "ఆదిశక్తి " అనిఅన్నారు. బ్రహ్మకు సృష్టినిర్మాణ, విస్తరణల కొరకు అవసరమైన జ్ఞానము, క్రియాకౌశలము ఆదిశక్తి గాయత్రి యొక్క తపోసాధన ద్వారానే లభించినది. ఇదే జ్ఞాన -విజ్ఞానము, వేదము అనబడినది. ఈ రూపంలో ఆదిశక్తి పేరు "వేదమాత" అయినది. వేదముల సారము గాయత్రీ మంత్రములో బీజ రూపంలో నిండి ఉన్నది. సృష్టి యొక్క వ్యవస్థను రక్షించే, నడిపించే విభిన్న దైవశక్తులు ఆదిశక్తి యొక్క ధారలే. ఆదిశక్తి నిర్మాణం, పర్యవేక్షణ, పరివర్తనము మొదలైన క్రియలకు అనుగుణముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వంటి దైవశక్తులరూపంలో విడివిడిగా ప్రకటితమౌతుంది. ఇదేవిధముగా ఇతర దైవశక్తులు దీనియొక్క వివిధ ధారలు ఈశక్తి నుంచే పోషణ పొందుతాయి . ఈ రూపములో శక్తిని  " దేవమాత " అనే పేరుతో పిలుస్తారు. విశ్వఉత్పతి మొత్తం ఆదిశక్తి గర్బములో జరిగినది . కనుక "విశ్వమాత" అనే పేరుతో కూడా పిలుస్తారు. 
                                      గాయత్రీ పరాశక్తి. మహాకాశ, చిత్తాకాశ, చిదాకాశ స్వరూపమే గాయత్రీస్వరూపం. గాయత్రిమంత్రం సర్వతత్త్వసంపూర్ణం. పరబ్రహ్మ మౌలికం. గాయత్రీ పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరత్వమే భగత్వం. భగం కలిగినవాడే భగవంతుడు. భగమనగా బలం, తేజం, శక్తి, ఆరోగ్యం, ఐశ్వర్యములని అర్ధం. ఈ దైవీశక్తులే గాయత్రీశక్తులు. శక్తిమంతుడే పరమేశ్వరుడు, శక్తి ఉత్పాదనమే గాయత్రీయోగం.
                                     గాయత్రి మూడు గుణములతో కూడిన శక్తి . హ్రీం - సద్బుద్ధి, శ్రీం - సమృద్ధి, క్లీం - శక్తి ప్రధానములు. దీనికి మూడు విశేష ధారలు కలవు. వీటిని గంగ, యమునా, సరస్వతిల త్రివేణీ సంగమం అని కుడా అనవచ్చును. దైవశక్తులతో జోడించినపుడు వీటిని సరస్వతి ,లక్ష్మి ,కాళి మరియు బ్రహ్మ ,విష్ణు, మహేశ్వర రూపంలో తెలుసుకొనగలము. గాయత్రి సాధనతో సాధకుని మనస్సు, బుద్ధి మరియు భావనలు ఈ త్రివేణిలో స్నానం చేసే అవకాశం లభించినపుడు, స్థితి కాయకల్పం వలె తయారవుతుంది. సద్గుణములు వృద్ధి, అంతర్గత శాంతి , సంతోషంతో పాటు సార్వజనిక సమృద్ధి సఫలతలను ఇచ్చేది గాయత్రి. 
                                     ప్రాపంచిక కష్టాల నదిని దాటుటకు ధైర్యము, సాహసము, ప్రతిభ, ప్రయత్నం అనే నాలుగు కోణములుగల నావ అవసరము. గాయత్రీ సాధన ఈ నాలుగు ప్రత్యేకతలను మనిషిలో బాగా పెంపొందిస్తుంది.
                                     జీవాత్మ ,పరమాత్మ మధ్య సూక్ష్మ ప్రకృతి యొక్క మాయా పరద ఉన్నది . ఈ పరదాను దాటుటకు ప్రకృతిసాదనములతోనే ప్రయత్నించాలి. చింతన - మననం, ధ్యానం - ప్రార్ధన, వ్రతము - అనుష్టానము, సాధన వంటి అన్ని ఆద్యాత్మిక ఉపచారములు ఇందు నిమితమై ఉన్నాయి. వీటన్నిటిని వదిలి పరమాత్మను పొందుట ఏ విధముగాను వీలుకాదు. సత్యగుణం, చిత్ శక్తి ద్వారా మాత్రమే జీవాత్మ ,పరమాత్మల యొక్క కలయిక జరుగగలుగుతుంది. ఈ ఆత్మ పరమాత్మల కలయికను జరుపగలిగే శక్తియే గాయత్రి.
                                    గాయత్రి బ్రహ్మప్రతిపాదకమగు మంత్రము. కుండలినీ శక్తి 24 తత్వంలతో జగత్తును సృజించును కావున గాయత్రి  24 అక్షరములు కలిగి యున్నదని శంకరులు ప్రపంచసారమున వ్రాసిరి. 
ఈ శరీరం పంచభూతాత్మకం. ఇందలి జీవాత్మ చిదానందస్వరూపముగా పంచప్రాణస్వరూపముగా విహరించుచున్నది. తన్మాత్ర స్వభావంవలన ప్రలోభితమైన గుణసంపత్తును దైవీసంపత్తుగా మలచుకొని ఆధ్యాత్మికధారణ చేయవలెను. యోగసిద్ధివలన ఇది సాధ్యం. యోగసిద్ధి మంత్రసిద్ధివలన వచ్చును. 
                                * గాయత్రీ మంత్రం *
గాయత్రీమంత్రములో తొమ్మిది నామములు కలవు. ౧. ఓం ౨. భూ ౩. భువః ౪.సువః ౫.తత్ ౬. సవితు: ౭. వరేణ్యం ౮. భర్గః ౯.దేవస్య ఈ తొమ్మిదినామములద్వార భగవంతుడు కీర్తింపబడుతున్నాడు. ధీమహీ అంటే ఉపాసన అని అర్ధం. ధియోయోనః ప్రచోదయాత్ అంటే భగవంతున్ని ప్రార్ధించుట.
ఈ మంత్రమును ఐదుచోట్ల ఆపి జపించవలెను. ౧. ఓం ౨. భూర్భువ స్సువః ౩. తత్స వితుర్వరేణ్యం ౪. భర్గోదేవస్య ధీమహీ ౫. ధియోయోనః ప్రచోదయాత్.
"ఓం భూర్భువ స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
అర్ధం : 'ఓం' కారంను ప్రణవమని అందురు. ప్రణవమునుండియే సమస్త శబ్దములు, మంత్రములు ఏర్పడుటచేత ఓంకారం సర్వమంత్రములకు హేతువు. ఓంకారముచే వ్యాహృతులు, వ్యాహృతులచే వేదములు ఆవిర్భవించినవి. (ఓంకారం వివరణ ఈ బ్లాగ్ మొదటి పోస్ట్ యందు కలదు)   ఓం = ప్రణవాత్మకమైన పరమాత్మ(పరమేశ్వరుడు), భూ = ప్రాణము నకు ప్రాణము(సత్ స్వరూపుడు), భువః = సర్వదుఃఖములను పోగొట్టి(చిత్ స్వరూపుడు), సువః = సమస్తసుఖములను యిచ్చునట్టి(ఆనందస్వరూపుడు)పరమాత్మ, నః = మా యొక్క, ధియ = బుద్ధులను, ప్రచోదయాత్ = ప్రేరణ చేయునో,  తత్ = ఆ, సవితు: = సర్వజగత్తులను సృష్టిచేయు, దేవస్య = దివ్యమహిమగల ఆ పరమాత్మయొక్క, వరేణ్యం =మిక్కిలి శ్రేష్టమై కోరదగిన, భర్గః = సర్వదుఃఖనాశకరమగు శుద్ధస్వరూపమును, ధీమహి = ధారణచేయుదునుగాక.                               
                              * గాయత్రీ గుణముల విశిష్టత *
ఈ మంత్రము యొక్క ఇరువదినాలుగు అక్షరములు ఇరువదినాలుగు గుణములను కలిగియున్నది.
'త' - అజ్ఞానాంధకారమును పోగొట్టును, 'త్స' - ఉపపాతకములను పోగొట్టును, 'వి' - మహాపాతకములను, 'తు' - దుష్టగ్రహ దోషములను,   'ర్వ' - భ్రూణహత్యాదోషములను, 'రే' - అగమ్యాగమనదోషములను, 'ణి' - అభక్ష్యాభక్షణ దోషములను, 
'యం' - బ్రహ్మహత్యాపాతకములను, 'భ' పురుషహత్యాపాతకములను, 'ర్గో' గోహత్యదోషములను, 'దే' స్త్రీహత్యాదోషములను, 
'వ' - గురుహత్యాదోషములను, 'స్య' - మానసికపాపములను, 'ధీ' - పితృ మాతృవధ పాపములను, 'మ' - పూర్వజన్మార్జిత పాపములను, 'హి' - అశేష పాపసమూహములను, 'ధీ' - ప్రాణివధపాపములను, 'యో' - ప్రతిగ్రహపాపములను, 'యో' - సర్వపాపములను పోగొట్టగా,
'నః' - ఈశ్వరప్రాప్తియు, 'ప్ర' - విష్ణులోకప్రాప్తియు, 'చో' - రుద్రపదప్రాప్తియు, 'ద' - బ్రహ్మపదప్రాప్తియు, 'యాత్' - త్రిమూర్తుల ప్రసాదసిద్ధిని కలగజేయును.
భూ:, భువః, సువః, అనే మూడు వ్యాహృతులు బ్రహ్మతత్వ స్వరూపలక్షణమైన సత్, చిత్, ఆనందాలు. భూ: అంటే సత్తు, భువః అంటే చిత్తు, సువః అంటే ఆనందము. ఈ మూడు కలిసిందే ఓం. ఇదే పరబ్రహ్మ. తత్ సవితు: అదే సవిత. సూయతే అనే నేతిసవితా - ఈ జగత్తు సృష్టి స్థితి లయలకు కారణమైంది సవిత (గాయత్రి). 
                     * గాయత్రీ మంత్రోచ్చారణ ప్రభావం * 
ఈ మంత్రోచ్చారణ సమయమందు శరీరములోని సర్వ నాడీస్థానములలో స్పందనాశక్తి చేకూరును. షట్ చక్రములలో స్పందన ఏర్పడి తద్వారా చక్రములు జాగృతమౌను. ఈ బీజాక్షర స్పందనాశక్తివలన శరీరావయములలో ఉన్న గ్రంధులలో శక్తులను మేల్కొలిపి మహత్వపూర్ణమగు సఫలతను, సంపన్నతను, సిద్ధులను చేకూర్చును. గాయత్రి మంత్రంలోని బీజాక్షరములు శరీరములోని ఈ దిగువ వివరించినస్థానములయందు స్పందనను చేకూర్చి పూర్ణయోగత్వమును సిద్ధింపజేస్తుంది.
సూర్యున్ని ఆరాధించిన ఆరోగ్యం, కుశలం, పుత్రులు పుణ్యం; మహాదేవున్ని ఆరాధించుట వలన యోగం, జ్ఞానం, కీర్తి; విష్ణువును ఆరాధించిన ధర్మార్ధ కామమోక్షములు; దుర్గోపాసనచే సర్వ మోక్షాది సకలకోరికలు; గణేశున్ని ఉపాసించిన కర్మసిద్ధి, విఘ్ననివారణ ప్రాప్తించును. అయితే గాయత్రీ మంత్రానుష్టానమువలన పంచాయతన దేవతలు చేకూర్చు సర్వఫలములు సమిష్టిగా చేకూరును. ఈ మంత్రం పఠనం చేయువారికి చతుర్విధపురుషార్ధములు, ధర్మార్ధకామమోక్షములను ప్రాప్తించును. సమస్తకోరికలను తీర్చు కామ్యఫలప్రదాత్రి 'గాయత్రీ'. గాయత్రి కామధేనువు. ఆత్మశక్తిని, మానసికశక్తిని, సంసారికశక్తిని లభింపజేయును. ప్రణవం (ఓం), భూ:, భువః, సువః, గాయత్రిమంత్రం అనునవి పంచమహాయజ్ఞములు (దేవయజ్ఞం, ఋషియజ్ఞం లేక బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞములు). ప్రణవ వ్యాహృతిత్రయ గాయత్రీమంత్రమును నిత్యమును జపించినయెడల పంచపాపములనుండి పావనమై పంచయజ్ఞముల ఫలితంను పొందుదురు.

9, నవంబర్ 2011, బుధవారం

మోక్షపధం - రామ దర్శనం

ఆధ్యాత్మిక సాధకుల దృష్టిలో రామాయణ అంతరార్ధమిది. మన ఇంట బయట జరుగుతున్నదే రామాయణం. ఎలాగంటే -
అయోధ్య నగరం :
ఏ విధమైన సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు ఏవీ లేనటువంటి; సామాన్య జనునిచే జయింప వీలులేనటువంటి నగరం అయోధ్య. అనగా ఏ వాసనలు అంటని ఆనంద హృదయమే అయోధ్య.
ఆ అయోధ్య అధిపతి దశరధుడు. దశరధుడు అంటే దశేంద్రియములను (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) జయించినవాడు. ఆ దశరధమహారాజుకు సత్వ, రజో, తమో గుణములనే కౌసల్య, సుమిత్ర, కైకయి అనే ముగ్గురు భార్యలు. రాముడు (ధర్మం) భరతుడు (శ్రద్ధ) లక్ష్మణుడు (భక్తి) శత్రుఘ్నుడు(శక్తి) అనే నలుగురు పుత్రులు.
భగవత్ తత్వాన్ని మానవాళికి అందించడానికి మాధవుడే మానవరూపములో వచ్చిన ధర్మావతారమూర్తి శ్రీరామచంద్రమూర్తి అందరిలో వున్నా ఆత్మారాముడు. 
ఆత్మారాముడైన శ్రీరాముడు వ్యక్తమై అర్ధంకావాలంటే దానికి సంకల్పమనెడి మనస్సు అవసరం. ఆ మనస్సే సీత.
సీతారాములకు వివాహం జరిగింది. అటుపై కొంతకాలమునకు కైకయి కారణముగా శ్రీరాముడు అయోధ్యను విడిచి సీతతో కల్సి, లక్ష్మణుడు వెంటరాగా అరణ్యములకు వెడలెను. అనగా ఆనందముగా అయోధ్యలో వున్న ఆత్మరాముడు మనస్సనెడి సీతతో కూడి సుఖదుఃఖాలుతో కూడిన జీవితమనే అరణ్యములో ప్రవేశించాడు. వీడి వుండలేని భక్తి (లక్ష్మణుడు) ఆత్మను (రామున్ని) అనుసరించింది.
సీత రామున్నే చూస్తూ, రామున్నే తలస్తూ, రామున్నే జపిస్తూ, రామున్నే ధ్యానిస్తూ - అంతా రాముడే అన్న భావనతో వున్నంతకాలం రామునితోనే కూడి ఆనందముగా ఉంది. అయోధ్య, అరణ్యము రెండునూ ఆమెకు ఒకేలా ఆనందమును ఇచ్చాయి. అంటే మనస్సు(సీత) ఆత్మతో(రామునితో) కూడి అంతర్ముఖురాలై వున్నంతకాలం అయోధ్యలోనూ, అరణ్యములోను ఆనందస్థితిలోనే వుంది.
ఒకరోజు సీత బంగారులేడిని చూసింది. ఆ లేడి కావాలని రామున్ని కోరింది. బంగారులేడి ఏమిటీ? ఇది రాక్షసమాయల వుందని రాముడు వారించినను వినక ఆ లేడిపై ఆశపడి తీసుకురమ్మని రామున్ని పంపింది. అనగా అంతవరకు అంతర్ముఖమై ఆత్మారామున్ని కూడి ఆనందముగా వున్న మనస్సుదృష్టి బహిర్ముఖమై బంగారులేడి రూపములో వున్న మాయలో పడి, ముందు ఆత్మని వదిలేసింది. రాముడు వెళ్ళాకా తన దగ్గరే వున్న లక్ష్మణుడుని కూడా వెళ్ళమని దుర్భాషలాడి పంపేసింది. బహిర్ముఖమైన మనస్సు మంచిని, విచక్షణను మరిచి ప్రవర్తిస్తుందని అనడానికి ఈ ఘటనో దర్పణం. లక్ష్మణుడు వెళ్తూ గీసిన లక్ష్మణరేఖనూ దాటేసింది. దశకంఠుడు చేతికి చిక్కింది. పరమ దుఃఖితురాలైంది. లంకకు చేరింది. అంటే ఆత్మనెడి రామున్ని మొదట వదులుకున్న మనస్సు తర్వాత భక్తిత్వమనే లక్ష్మణుని విడిచిపెట్టింది. దశకంఠుడుకి బందీ అయి తీవ్ర బాధకు లోనైంది. కోరికలకు, రాగద్వేషాలకు, కోపతాపాలకు మనస్సులో స్థానం ఏర్పడితే బాధలు తప్పవు.
లంకా పట్టణం :
సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు... ఇత్యాదులకు నిలయం లంకాపట్టణం. అన్ని వాసనలను అంటిపెట్టుకున్న పట్టణం లంకా. దీనికి తొమ్మిది ద్వారములు. ఈ లంకాపట్టణం మానవ శరీరం. మానవ శరీరమునకు కూడా నవద్వారలున్నాయి. లంకకు రాజు  దశకంఠుడు.  దశకంఠుడు అంటే దశేంద్రియములకు (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) లోబడినవాడు. లంక చుట్టూ సాగరము అనగా మానవుని చుట్టూ వున్న ఈ  మాయాసంసారసాగరమే. 
లంకలో వున్న సీత తన దుఃఖమునకు కారణం గ్రహించి, ఏకవస్త్రముతో వుంటూ రామునికై తపిస్తూ, రామున్నే ధ్యానిస్తూ, రాముడు వచ్చి తనని రక్షిస్తాడనే నమ్మకముతో వుంటుంది. అనగా తను బహిర్ముఖమై మాయలేడిపై ఆశపడి ఆత్మానందమును కోల్పోయి, దైవానుగ్రహం లక్ష్మణుని రూపేణ వున్న, దానిని వదులుకున్నందుకే తనకింత దుర్గతి పట్టిందని, తన దుఃఖమునకు కారణం తనేనని గ్రహించి తిరిగి రామున్ని చేరాలని ఏకధ్యాసతో అంతర్ముఖురాలైంది. 
ఇక ఇక్కడ రాముడు సీతకై విలపిస్తూ (రాముడు భగవంతుడు అయినప్పటికీ పూర్తిగా మానవుడిగానే జీవించాడు), సీతను అన్వేషించడం ప్రారంభించాడు. అంటే భక్తుడు దారితప్పి తిరిగి తనకై పరితపిస్తుంటే భగవంతుడు కూడా అంతలానే ఆ భక్తునికై పరితపిస్తాడని ఇక్కడ అర్ధమోతుంది.
ఆంజనేయుడు :
ఆంజనేయుడు పవనతనయుడు. అంటే ఉచ్చ్వాస నిశ్శ్వాస స్వరూపమైన ప్రాణాయామ స్వరూపుడు. 
మనస్సువేగం వాయువేగమునకు సమానం (మనోజవం మారుతతుల్య వేగం). అలా పరుగులు తీసే మనస్సుని నియంత్రించగలగడం శ్వాసతోనే సాధ్యం. ప్రాణాయామమే మనోనియంత్రనకు ఔషదం. ఈ ప్రాణాయామం ఎలా సాధ్యమౌతుందంటే ఇంద్రియములను జయించినప్పుడు (జితేంద్రియం) చక్కగా సాధ్యమౌతుంది. ఈ ఇంద్రియములను ఎలా జయించగలమంటే బుద్ధితో (బుద్ధిమతాం) జయించాలి. అప్పుడే ప్రాణాయామం చక్కగా జరుగుతుంది. ఈ ప్రాణాయామం స్వరూపుడు ఆంజనేయుడు. అంటే మూలాధారచక్రం మొదలుకొని సహస్రారం వరకు వ్యాపించగలిగినవాడు ఆంజనేయుడు. కుండలినీజాగృతి చేసి ఆత్మను పరమాత్మ దరికి చేర్చగల శక్తిమంతుడు ఆంజనేయుడు. భక్తునికి భగవంతునికి మద్య వారధి నిర్మాణకర్త ఆంజనేయుడే.
ఇక కధ లోనికి వస్తే -
సముద్రమును దాటి లంకలో ప్రవేశించాడు ఆంజనేయుడు. అనగా సంసారసాగరమనే మాయను దాటి లంక అనెడి శరీరం లోనికి ప్రవేశించాడు. సీతను దర్శించి రాముని అంగుళీయకం ఇచ్చి, త్వరలోనే రాముడు వచ్చి నిను రక్షిస్తాడని చెప్పి ఆనందపరుస్తాడు. అంటే  ప్రాణాయామం శుద్దమనస్సును చూసి పరమాత్మ అనుగ్రహం నీకు కల్గుతుందన్న అభయమిచ్చి పరమాత్మదర్శన యోగ్యత నీకు త్వరలోనే కల్గుతుందని చెప్పి ఆనందపరుస్తాడు. అనగా ప్రాణాయామం వలన సాధకుని మనస్సుకు తెలుస్తుంది ఆత్మసాక్షాత్కారం కలగబోతుందన్న అనుభూతి కల్గి ఆనందస్థితిలో వుంటుంది. ఆంజనేయుడు కొంతవరకు లంకాదహనం చేశాడు. అనగా లోపలున్న దుర్గుణాలు, వాసనలను కొంతవరకు దహనం చేశాడు. అయినా 'నేను' అనే అహంకారంతో రావణుడు హుంకరిస్తూనే వున్నాడు. అప్పుడు ఆంజనేయుడు మరింతగా తన తోకని పెంచి చుట్టలుచుట్టిన తోకనే ఆసనముగా చేసుకొని రావణుని ఎదుట కూర్చొని రామసందేశం వినిపించాడు. అనగా ప్రాణాయామ స్వరూపుడు అయిన ఆంజనేయుడు మరింతగా తన శక్తిని జాగృతి చేసి సహస్రారంవరకు ఎదిగి అక్కడ కూర్చొని లౌకికమైన కోరికలు, స్వార్ధం, అహంకారం విడిచి స్వస్థానంనకు మనస్సుని పంపేస్తావా, మరణిస్తావా అని సందేశం వినిపించాడు. 
ఇటుపై కధ అందరికీ తెల్సిందే. 
భగవత్ తత్వం అర్ధంకాక రావణుడు పతనమౌతాడు.
అగ్నిప్రవేశం చేసిన సీత రామున్ని చేరింది. అనగా సంపూర్ణముగా వాసనలన్నీ హరించబడి శుద్ధమనస్సు ఆత్మారామున్ని చేరింది.
తిరిగి అయోధ్యకి రావడం, పట్టాభిషేకం జరగడం అంటే అంతర్యామి అయిన రామునితో శుద్ధమనస్సనెడి సీత అయోధ్య అనెడి హృదయంలో కలిసివుండడమే పట్టాభిషేకం. 
కొంతకాలమనంతరం సీతను అడవిలో విడిచిపెట్టేయడంలో ఆంతర్యం ఏమిటంటే -
శుద్ధమనస్సు అలానే హృదయంలోనే ఆత్మారామున్ని చూసుకుంటూ వుండిపోతే శుద్ధమనస్సు స్థాయిలోనే వుంటుంది. భగవంతుడు శుద్దమనస్సులను ఉద్ధరించి తనస్థాయిలో (చైతన్యంలో) పూర్తిగా లయం చేయాలని భావిస్తాడు కాబట్టి, ఎక్కడనుండి వచ్చిందో అక్కడ లయమౌతానే చైతన్యంలో కలుస్తుంది కాబట్టి సీత అనెడి శుద్ధమనస్సును విడిచిపెట్టడం జరిగింది. అప్పుడుకూడా సీత అంతర్ముఖురాలై దైవధ్యానంలో వుండి కొంతకాలం తర్వాత ఎక్కడ నుండి వచ్చిందో అక్కడే లయమైంది. పుడమి నుండి వచ్చి పుడమిలోనే లయమై చైతన్యస్వరూపిని అయింది.
                                       మనోజవం మారుతతుల్యవేగమ్ 
                                       జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
                                       వాతాత్మజం వానరయూధ ముఖ్యమ్
                                       శ్రీరామ దూతం శరణం ప్రపద్యే// 
మనస్సమాన గతిలో వాయుసదృశ్య వేగంతో పరమజితేంద్రియుడై  శ్రీమంతుల్లో(బుద్ధిలో) శ్రేష్టుడైన పవన నందనుడు వానరాగ్రగణ్యుడు అయిన శ్రీరామ దూతను శరణువేడుతున్నాను. 
                              శ్రీ రామ చంద్ర చరణౌ మనసా స్మరామి 
                              శ్రీ రామ చంద్ర చరణౌ వచసా గృణామి
                              శ్రీ రామ చంద్ర చరణౌ శిరసా నమామి 
                              శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే//
శ్రీరామచంద్రుని చరణములను నేను మనసా స్మరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను వాక్కు ద్వారా కీర్తించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమష్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను నేను శరణువేడుచున్నాను.