30, ఆగస్టు 2012, గురువారం

సార్ధకత

దేహమను క్షేత్రంలో -
భగవత్స్వరూప స్మరణ లేక ఆత్మభావనయు; 
ప్రేమ అను జలాభిషేకమును; 
శాంతము, దయ, సత్యం, వైరాగ్యం, తపస్సు అనెడు పుష్పములను; 
సర్వేశ్వరధ్యానానందం లేక భక్తితో మునిగిన హృదయామృతమగు నైవేద్యమును 
ఉన్నప్పుడే మానవజన్మ సార్ధకత! 
లేనిచో మానవజన్మ వ్యర్ధం.
 
- మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వాములవారు               

25, ఆగస్టు 2012, శనివారం

అమ్మా! గుర్తుకొచ్చిందీ......

సమయం : ఉదయం 6 గంటలు 
మా అమ్మాయి (అనూష) నుండి ఫోన్ -
శుభోదయమమ్మా! 
శుభోదయం నాన్నా! 
కొన్ని మాటలననంతరం, 'అమ్మా! నీకేదో చెప్పాలని ఫోన్ చేశానమ్మ. కానీ, గుర్తు రావడం లేదు, గుర్తు వచ్చినప్పుడు చేస్తానమ్మా అంటూ ఫోన్ కట్ చేసింది.

సమయం: ఉదయం సుమారుగా 9 గంటలు 
మరల మా అమ్మాయి నుండే ఫోన్ -
చెప్పరా నాన్నా...
అమ్మా! గుర్తుకొచ్చిందీ......
సరే, చెప్పమ్మా...
ఓ కదమ్మా...
కధా? వంట చేస్తున్నాను, పనయ్యాక ఫోన్ చేస్తాను, అప్పుడు చెప్పు...
లేదమ్మా, ఇది జరిగిన కధ, వంట తర్వాత చేయవచ్చు, ముందు వినమ్మా...
తన గొంతులో ఉత్సాహం గమనించి, పని ఆపి, సరే చెప్పు అనక తప్పలేదు నాకు.
అమ్మా! పూర్వం శ్రీ మధ్వాచార్యులవారి కాలంలో జరిగిన సంఘటనటమ్మా... 
ఓర్నీ! అప్పటి సంఘటనా నీవు చెప్పాలనుకుంటున్నదీ?
అబ్బా! మద్యలో మాట్లాడకుండా విను. 

ఆ వాస్తవకధ తన మాటలోనే -
మధ్వాచార్యులవారి కాలంలో 'కనకదాసు' అనే పేరుగల మహాభక్తుడు ఉండేవాడట. ఇతను శూద్రుడు. ఈ కనకదాసు భగవంతున్ని కీర్తిస్తూ అనేక కీర్తనలు పాడుతూ ఉండేవాడు. ఇతనంటే మధ్వాచార్యులవారికి చాలా ఇష్టమట. అందుకే మొదట ఈ కనకదాసుకే తీర్ధప్రసాదాలు ఇచ్చి, తర్వాత తక్కిన బ్రాహ్మనాదులకు ఇచ్చేవారట. ఆ కాలమునందు మధ్వాచార్యులవారి సన్నిధానమునందు శాస్త్రాలను చదివినవారు, వేదములను చదివినవారు, యజ్ఞయాగాదులు, హోమాలు చేయువారు ఉండేవారట. ఈ పండితులయందరికి తమకంటే ముందు తీర్ధప్రసాదాలు కనకదాసుకు మధ్వాచార్యులవారు ఇవ్వడం నచ్చలేదు. వీరికి ఈ పని కోపం కల్గించేది. ఓరోజు, వీరందరూ మధ్వాచార్యులవారిని అడిగారు -
'ఓ మహాత్మా! మీకు తెలియని ధర్మం ఏది గలదు? తాము వర్ణాశ్రమములను ఉద్ధరించుటకు అవతరించినవారు. మీకు తెలియదా, మాలో కొందరు వేదపండితులు, కొందరు ట్చాస్త్రములలో ప్రావీణ్యులు, మరికొందరు అనేక యజ్ఞములు చేసినవారు, మహా నైష్టిక బ్రాహ్మణులు. ఇట్టివారిని కాదని, కనదాసు భక్తుడైనను శూద్రవంశ సంజాతుడగు అతనికి ముందుగా తీర్ధప్రసాదాలు ఇచ్చి, తర్వాత మాకు ఇవ్వడంలో సందేహం కల్గుతుంది, తాము సర్వజ్ఞులు, ఇది సరికాదు కదా' అని అడిగారటమ్మా. అందుకు ఆ గురువుగారు 'కనకాదాసు పరమభక్తుడు, ఎప్పుడు తీర్ధప్రసాదములు దొరుకునా, ప్రసాదము తీసుకొని ఎప్పుడు కీర్తనలు పాడుకుందునా, అని ఆత్రంగా నిరీక్షించువాడు. అందుకే ముందుగా అతనికి ఇస్తున్నాను, సరే, ఈ విషయమై రేపటిదినం మాట్లాడుకుందాం, అని అందరికీ ఒక్కొక్క అరటిపండునిచ్చి ఇది రెండవవాడు చూడని స్థలములో భుజించి, ఆ సంగతి రేపు మరల చెప్పండి' అని ఆజ్ఞాపించిరట. ఆ అరటిపండుని ఒకరు తమ గదిలో, ఇంకొకరు చెట్టు చాటున, మరియొకరు గట్టు చాటున, మరియొకరు నిర్జన ప్రదేశమున, వేరొకరు కంబళితో మూసుకొని తిన్నారటమ్మా. కనకదాసు మాత్రం ఆ దినమంతా అనేక నిర్జన ప్రదేశములు, కొండలు, గుహలలో తిరిగి తిరిగి, ఎచట చూసినను భగవంతుడు లేని స్థలం కన్పించక చరాచర సృష్టిలోనూ, అణువణువులోను, పరమాణువులతో సహ కన్నురెప్పలార్పక శ్రీమన్నారాయణుడు చూచుచున్నట్లు కన్పించడంతో ఆ పండుని తినక, ఆ రోజంతా ఉపవాసముండి మరుసటిరోజు పూజసమయమున ఆ పండుని చేతపట్టుకొని మధ్వాచార్యులవారి దగ్గరికి వెళ్ళెనట. మధ్వాచార్యులవారు ముందుగా పండితులందరినీ 'ఎవ్వరును చూడని స్థలములో పండుని భుజించారా?' అని అడగగా - ఎవ్వరూ చూడనిచోటే భుజించామని, ఎక్కడెక్కడ భుజించారో చెప్పారు ఆ పండితులు. తర్వాత కనకదాసుని అడిగారు, 'ఏమి కనకదాసు! మన ఆచార్యులవారందరూ ఎవరు చూడని స్థలములలో పండ్లు భుజించినారట, నీవేల తినలే'దని అడుగగా -
"మహాత్మా! ఏకాంత ప్రదేశమున, కొండలలో, గుహలలో పగలంతయు, రాత్రి యందు తిరిగితిని. ఎచ్చోట చూసినను భగవంతుడు లేని స్థలం కనిపించలేదు. అణువులో అణుస్వరూపముగాను, విభువులో విభుస్వరూపముగాను పరిపూర్ణుడై నిండియుండుటచే నాకు వేరుస్థలం కనిపించలేదు" అని కనకదాసు చెప్పింది విని, మధ్వాచార్యులవారు, ఆచార్యులారా! 'అణోరణీయాన్మహతో మహీయాన్' అను శ్రుతియు, 'సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖమ్' అని గీతయు మీరు అనేకమార్లు చదివినారు కదా! మీలో ఈ భావం కల్గిందా? ఇతను శూద్రజాతిలో పుట్టినను అపరోక్షజ్ఞానం కలవాడు. ఇతడు గుణముచే బ్రాహ్మణుడు. అందుకే ఇతనికి ముందుగా తీర్ధప్రసాదములు ఇచ్చుచుంటిని, అని చెప్పగా అందరూ వారి వారి అవివేకమునకు సిగ్గుపడ్డారటమ్మ...
అమ్మా! గుర్తుకొచ్చిందీ......అని అంటూనే చెప్పాలనుకున్నది చెప్పేసి, హమ్మయ్య! ఇక వంట చేసుకో, నాకూ పనుందని తను ఫోన్ పెట్టేసినను మదిలో ఆ కధే కదలాడుతుంది. 


నిజమే -
భగవంతుడు లేని చోటు ఎక్కడ?
సకల సృష్టి, సమస్త చరాచరం అంతయూ ఆ సర్వాంతర్యామియే.
సర్వులయందు, సమస్తము నందు సర్వవ్యాపకుడు.
అంతయూ భగవత్ స్వరూపమే......
ఇక భగవంతుడు లేనిది ఎక్కడ????? 

కలడంబోధి, కలండుగాలి, కలడాకాశంబునన్
కుంభినింకలడగ్నిన్ దిశలం పగళ్ళనిశలన్ ఖద్యోతచంద్రాత్మలన్ 
కలడోంకారమునన్ త్రిమూర్తులత్రిలింగవ్యక్తులందంతటన్ 
కలడీశుండు కలండూ తండ్రీ వెదుకంగానేల ఈయాయెడన్ 
              
నిజమే -
జన్మతః కులం ఏదైతేనేం? 
శూద్రోపి శీలసంపన్నో గుణవాన్ బ్రాహ్మణో భవేత్ (శూద్రజాతి యందు జన్మించినవారైనను, సద్గుణ సంపన్నులై ఉన్నచో వారు బ్రాహ్మణులే)
దీనినే శివుడు పార్వతీదేవికి ఇలా తెలిపెను -
సత్కర్మాభి: శుచిర్దేవి! శుద్ధాత్మా విజితేంద్రియః 
శూద్రోపి ద్విజవత్సేవ్య ఇతి బ్రహ్మానుశాసనమ్ //
ఓ పార్వతీదేవీ! శుద్ధములగు సాత్త్విక కర్మలతో గూడినవాడై, పరిశుద్ధాత్ముడై, జితేంద్రియుడైనవాడు శూద్రకులములో జన్మించినను బ్రాహ్మణునివలె సేవింపదగినవాడు.
బ్రాహ్మణత్వమునకు బ్రహ్మజ్ఞానమే గుర్తు అని మన శాస్త్రాలు, ఉపనిషత్తులు తెలియజెప్తున్నాయి.
న చర్మాణో న రక్తస్య మాంసస్య చ న చాస్థినః 
న జాతి రాత్మనో జాతి ర్వ్యవహార ప్రకల్పితా// (తేజోబిందూపనిషత్)
సర్వభూతస్థమగు ఆత్మకు జాతిభేదము లేదు. మరి చర్మమునకును, రక్తమునకును, మాంసమునకును, అస్థికిని లేదు. జాతి సాధారణ వ్యవహార కల్పితమే.
జన్మనా జాయతే జంతు: సంస్కారా ద్ద్విజ ఉచ్చ్యతే 
వేదపారాయణా ద్విప్రో బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః //
జన్మముచే  అందరును జంతుసమానులే. సంస్కారముచే ద్విజుడౌను, వేదపారాయణం వలన విప్రత్వము కలుగును. బ్రహ్మజ్ఞానము కలిగినప్పుడు బ్రాహ్మణుడు అగును.
సుఖం దేహస్య శూద్రాణాం ధనం శ్రేష్టం విశాం భవేత్ 
యశో నిత్యం క్షత్రియాణాం విప్రాణాం జ్ఞానమేవ హి //
దేహసౌఖ్యమును మాత్రమే చూసే స్వభావంగల స్థితి శూద్రత్వ మగును. ధనమే గొప్పదని తలంపు గలవాడు వైశ్యత్వస్థితిలో ఉండువాడు. ధనముగాని, ప్రాణంగాని పోయినను, లక్ష్యం చేయక యశస్సును నిలబెట్టువాడు క్షత్రియత్వమునకు వచ్చును. దేహమునుగాని, ధనమునుగాని, కీర్తినిగాని, లక్ష్యమందుంచక బ్రహ్మసాక్షాత్కార జ్ఞానం కొఱకు యత్నంచేయు జీవుడు బ్రాహ్మణత్వస్థితికి వచ్చినవాడు.
ఇక జన్మతః కులం ఏదైతేనేం?????
న జాతి: కారణం తాత! గుణాః కల్యాణకారణమ్ 
వృత్తిస్థ మాపి చండాలం తం దేవా బ్రాహ్మణం విదు:  

22, ఆగస్టు 2012, బుధవారం

భక్తుడు - బద్ధుడు

పరమహంస :-
                    అనగా హంసకు పరమై ఉండువారని అర్ధం. 
                    హంస అనగా జీవుడు, పరమమనగా పరబ్రహ్మం (పరమాత్మ). జీవునికి పరమగు శివత్వమును పొందినవారు పరమహంస.
                    హంస అనగా ఓ పక్షి పేరు. ఇది క్షీరనీరములు (పాలు,నీరు) కలిసియుండిన నీరమును (నీటిని) వదిలి క్షీరమును మాత్రమే పానముచేయును. అలాగునే ప్రకృతి, పురుషులు కలిసియుండు ఈ సృష్టి నుండి లేక ఈ దేహమునుండి ఆత్మానాత్మ విచారణచే ప్రకృతిని త్యజించి పురుషున్ని, అనగా ఆత్మను గ్రహించినవారిని పరమహంస అందురు.

అటువంటి పరమహంస అయిన శ్రీరామకృష్ణులవారిని ఓ వ్యక్తి ఇలా ప్రశ్నించాడు -
'ఈశ్వరుడు అన్నిటిలోనూ సమానముగా ఉండగా ఒకరు యోగ్యుడగుటకు, మరియొకరు యోగ్యుడు కాకపోవుటకు కారణమేమీ?'
అప్పుడు శ్రీరామకృష్ణపరమహంస వారు ఇలా బదులిచ్చారు -
"ఈశ్వరుడు అందరిలోనూ సమముగానే ఉన్నాడుగాని, ఈశ్వరునియందు అందరును సమానముగా ఉండుటలేదు. అందుచేతనే ఒకరు భక్తుడుగాను, మరియొకరు బద్ధుడుగాను ఉండుట జరుగుచున్నది.


19, ఆగస్టు 2012, ఆదివారం

ధ్యానం - నీ లోనికి నీ పయనం


ధ్యానం - 
నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించివున్న పరమాత్మను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మదర్శనం పొందడం. 
ధ్యానం -
మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మనలోనికి మనం చేసే ప్రయాణం.
ధ్యానం -
ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నంలో ఓ మార్గం.
ధ్యానం -
వంచించే ఇంద్రియాలు ద్వారా పరమాత్మను గ్రహించగలమన్న అజ్ఞానమును వీడి, బాహ్యవిషయములనెరిగే మనస్సుని, ఎగిసిపడే అహంకారాన్ని అంతమొందించి హృదయంలోని అవ్యక్తమైన కాంతినీ, స్వస్వరూపస్థితిని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ.
ధ్యానం -
మనస్సు యొక్క నిశ్చలత్వం.
ధ్యానం -
మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్ళే మార్గం.
ధ్యానం -
ఇతరభావాలను విడిచి ఒకే ఒక భావంపై ఏకాగ్రతను కల్గించడం.
ధ్యానం -
అంతరంగ చైతన్యముకు చేరువకావడం.
ధ్యానం -
హృదయాంతర్గత ఆత్మచైతన్యంలో జీవించడం.

ఎందఱో ధ్యానసిద్ధిని పొందినవారు ధ్యానత్వంలో ఉన్న మహిమత్వాన్ని ఇలా ఎన్నోరాకాలుగా నిర్వచించినను ఇది ఎవరికి వారే తెలుసుకోవాల్సిన సత్యం. ఎవరికి వారే తప్పనిసరిగా చేయాల్సిన అంతర్ముఖప్రయాణం. ఎవరికివారే పొందాల్సిన స్థితి. ఎవరికి వారే పొందాల్సిన అనిర్వచనీయమైన చైతన్యానుభూతి.
                                       
ప్రాపంచిక జీవనం, పారమార్ధిక జీవనం సమతుల్యముగా ఉన్నప్పుడే మానవుడిది పరిపూర్ణజీవితమౌతుంది. ప్రాపంచిక, పారమార్ధిక జీవనగమనములో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత తప్పనిసరి. ఈ రెండూ ధ్యానం వలనే సాధ్యం.
పరిపూర్ణజీవనానికి ధ్యానమే మార్గమని శ్రీకృష్ణ పరమాత్మ, పతంజలి, బుద్ధుడు, గురునానక్, మహావీరుడు మొదలు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, నేటి సద్గురువులు వరకు; అలానే ఎందఱో ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానం మైండ్ ని శుద్ధిచేసే ఓ ప్రక్రియ. ఎన్నెన్నో సంఘటనలతో, ఒడిదుడుకులతో, మార్పులూచేర్పులతో, సుఖదుఃఖాలతో కూడుకున్నదే జీవితం. వీటన్నిటినీ యధాతధంగా స్వీకరించేశక్తి  ధ్యానంవలన అలవడుతుంది. ధ్యానంవలన సాక్షిభావం, తద్వారా భావసమతుల్యత అలవడుతుంది. గతాన్ని నెమరువేసుకోకుండా, భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకుండా, దేన్నీ ఆశించకుండా ఏ క్షణంకా క్షణం  జాగురుకతతో, ఎరుకతో సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుంది. అంతే కాదు, సంస్కారశుద్ధి, విషయవాసనలనుండి విముక్తి ధ్యానసాధన ద్వారానే సాధ్యమౌతుంది. పరమాత్మ ఎరుకలోనికి రావాలంటే హృదయం నిర్మలం కావాలి. హృదయం నిర్మలం కావాలంటే మానసిక అలజడులు, ఆలోచనలు, విషయవాసనలుండకూడదు. ఇవేవీ ఉండకూడదంటే ధ్యానం ఒక్కటే ఉపాధి.
ధ్యానం చేస్తున్నప్పుడు  ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని అదిలించి నెట్టివేయలేము. అవి మరల మరల వస్తూనే వుంటాయి. అందుకే పుట్టుకొస్తున్న ప్రతీ ఒక్క ఆలోచనను సాక్షిభావంతో చూడడం, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా, కొనసాగించకుండా అలా గమనిస్తూ వుంటే కొంతకాలంకు ఆ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఇదేరీతిలో ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు - కృష్ణుడు, బుద్ధుడు, సూర్యుడు, దేవతలు, ప్రకృతి దృశ్యాలు దర్శిస్తూ తాము ధ్యానస్థితిలో ముందుకు పోతున్నామని, మంచి మంచి అనుభవాలు కల్గుతున్నాయని, ఉన్నతమైన ధ్యానస్థితిలో ఉన్నామని అనుకుంటారు. కానీ అది సరికాదు. నిజమైన ధ్యానంలో మనస్సు మహానిశ్చలంగా ఉండిపోతుంది. అలా నిశ్చలమైన మనస్సులో ఎటువంటి చిత్రణలు ఉండవు. ఇవన్నీ ఒకవిధంగా స్వాప్నిక దృశ్యాలే అని గ్రహించాలి. ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి. ఇది పరిపూర్ణ ధ్యానం కాదని గ్రహించాలి.  ధ్యానమంటే కొన్నిమాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయంలో కళ్ళుమూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు. ఏ పని చేస్తున్నను ధ్యానం జరుగుతూ ఉండాలి. అంటే చేస్తున్న ప్రతీపనియందు సాక్షిభావంతో ఉండి పనిచేయగలిగినప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యానయుక్తమైన పరిపూర్ణజీవితం అవుతుంది.
ధ్యాన సాధన చేస్తున్నమొదట్లో ధ్యానస్థితిలో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబనగా తీసుకున్న ధ్యానవస్తువు (నామం, రూపం, దీపం, శ్వాస మొదలగునవి) ఉంటాయి. ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యానవస్తువు ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యేసరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు. సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి. ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో అంటే పరమచైతన్యంలో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస....అన్నీ అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి. ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి. ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం. ఇదే ఆత్మనిష్ట.

ఆత్మనిష్ట కలుగుటకు ధ్యానమే సాధనమని, ఆ సాధన ఎలా చేయాలో కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయము నందు తెలియజేసెను. 

మహర్షులనుండి ఇంద్రాది దేవతలవరకు; మహాయోగులనుండి ముముక్షువులవరకు; సద్గురువులనుండి సత్ సాధకులవరకు.........
ప్రతివొక్కరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది తరించినవారే. 

ఆత్మధ్యానం యొక్క మహిమత్వమును శుక మహర్షి ఇలా తెలియజేసెను -
ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః 
ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణస్సదా
సమస్తమైన వేదశాస్త్రములును మరల మరల పరిశోధింప ఒకటే గోచరిస్తుంది. అది, సర్వదా నారాయణ స్వరూపమైన ఆత్మను ధ్యానించుటయే గొప్పది.
ధ్యానయోగం యొక్క మహిమత్వాన్ని ఎన్నో శాస్త్రాలు ద్రువీకరిస్తున్నాయి -
బ్రహ్మహత్యసహస్రాణి భ్రూణహత్య శతాని చ
ఏతాని ధ్యానయోగశ్చ దహత్యగ్ని రివేంధనమ్ 
బ్రహ్మహత్యలును, నూరు గర్భిణీ హననములైన పాపాలన్నియున్ను ఒక ధ్యానయోగంచే, కట్టెలన్ని అగ్నిచే భస్మమగునట్లు భస్మమగుచున్నవి.
ముహుర్తమపి యో గచ్చే న్నాసాగ్రే మనసా సహ 
సర్వం తరతి పాప్మానం తస్య జన్మశతార్జితమ్ 
భ్రూమధ్యమందు ప్రణవమంత్రములతో మనస్సును ఐక్య పరచి ఒక ముహుర్తమాత్రం ఎవరు ధ్యానింతురో, వారియొక్క శత జన్మార్జితమైన పాపాలన్నియు నశించి నిర్మలు లగుదురు.
నిమిషం నిమిషార్ధం వా ప్రాణినో ధ్యాత్మచింతకాః
క్రతుకోటిసహస్రాణాం ధ్యానమేకం విశిష్యతే (ఉత్తరగీత)
నిముషముగానీ, అర్ధనిముషముగానీ ఆత్మధ్యానం చేసిన యెడల మానవులకు కోటి ఆశ్వమేధాది యాగములకంటే ఎక్కువ ఫలితముంటుంది.

                                     నాస్తి ధ్యానసమం తీర్ధం నాస్తి ధ్యానసమం తపః
                                     నాస్తి ధ్యానసమో యజ్ఞస్తస్మాద్ధ్యానం సమాచరేత్ 

                                                                




13, ఆగస్టు 2012, సోమవారం

సప్తగిరివాసుడు "వేంకటేశ్వరుడు"ని సందేశము

దివ్యమంగళకరం శ్రీవేంకటేశ్వరుని రూపం - ఆత్మజ్ఞానప్రబోధకరం.
ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే  వేంకటేశ్వరుని తేజోమూర్తి కడు రమ్యం.
హస్తముల ద్వారా ఇస్తున్న సందేశం :-
'సంసార సాగర సముత్తరణైక సేతో' అన్నట్లుగా -
కుడిహస్తముతో తన పాదములను చూపుతూ, వీటిని శరణువేడితే చాలు, మీ సంసార సాగరాన్ని మోకాళ్ళ లోతుమాత్రమే చేసి సులభముగా దాటిస్తాననే అభయహస్త సందేశం ఇస్తుండగా, ఎడమచేతితో నాభి క్రిందస్థానం చూపిస్తూ, ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మ యందు లయంచెయ్యమన్న సందేశముంది. 
కుడి హస్తంతో, నా పాదాలను శరణువేడితే ఎడమచేతితో నిను నా అక్కున చేర్చుకుంటానన్న సూచన ఉందని కూడా కొందరు పెద్దల విశ్లేషణ.
శంఖు నామ చక్రములు ద్వారా ఇస్తున్న సందేశం :-
శంఖం ద్వారా ఉద్భవించునది శబ్దం. శంఖారావం ద్వారా జనించే ధ్వనిలో రజో తమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమే కాక, విశ్వచైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది. 
కుడి ప్రక్కగల నామమును సూర్యనాడిగా, ఎడమ ప్రక్కగల నామమును చంద్రనాడిగా, మధ్యనగల నామమును బ్రహ్మనాడిగా చెప్తుంటారు.
చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమనే సందేశముంది. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వారార్పితంతో కర్మలు చేయాలన్న సూచనకి గుర్తు చక్రం.
జ్ఞానమును పొందమని జ్ఞానచిహ్నముగా శంఖమును, మోక్షచిహ్నముగా నామమును, కర్మనాశనశక్తి చిహ్నముగా చక్రమును ధరించి, కర్తృత్వభావం లేకుండా జ్ఞామును పొంది, తద్వారా కుండలినీ జాగృతమొనర్చి మోక్షమును పొందవలేనన్న సందేశం ఈ శంఖు నామ చక్రములలో ఉంది.
ప్రతిరోజూ జరిగే వేంకటేశ్వరుని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది.
వేంకటేశ్వరుని కళ్యాణములో అంతరార్ధం :-
వేంకటేశ్వరుడు ఉన్నది ఏడుకొండలమీద. ఏడుకొండలు మానవశరీరంలో ఏడు చక్రాలు. సహస్రారం మీద ఉండే ఈశ్వరుడే వేంకటేశ్వరుడు. 
ఇక పద్మావతి అమ్మవారు. ముందుగా ఈ తల్లీ జననం గమనిస్తే -
నారాయణపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న ఆకాశరాజు, ఓసారి యజ్ఞమును ఆచరింపదలచి ఆరణీనదీ తీరంలో బంగారునాగాలితో కర్షణం చేస్తూ, నవధాన్యములు చల్లుచుండగా పద్మశయ్యపై పరుండి బంగారుబొమ్మ వలె ఉన్నబాలిక కనబడగానే, అశరీరవాణి ఈ బిడ్డ నీదే, పెంచుకో అని పలికెను. పద్మావతి అన్న పేరు పద్మమునందు జన్మించినందున వచ్చింది. 
అంతరంగమనే హృదయతీరంలో బంగారునాగలి అనే శుద్ధ సంకల్ఫంతో ప్రాణాయామం ద్వారా సాధన చేస్తూ, నవవిధ భక్తిమార్గములను అనుచరించగా మూలాధారపద్మమునందు ఉన్న పద్మావతి సాక్షాత్కరిస్తుంది. అంటే -
మానవశరీరంలో జగన్మాత కుండలినీరూపంలో మూలాధారంలో మూడున్నర చుట్టాలు చుట్టుకుని ఉంటుంది. ఈ మూలాధార పద్మమునుండి ఉద్భవించిన కుండలినీశక్తియే పద్మావతీదేవి. ఈ పారమార్ధిక అంతరార్ధతత్త్వమును అందరూ గ్రహించలేరు కాబట్టి  సర్వశక్తిమయి జగన్మాత అందరూ ఆరాధించడానికి అనువుగా దాల్చిన భౌతికరూపం పద్మావతి. ఇది సూచించడానికే ఇక్కడ కూడా అమ్మ ఏడుకొండలకు మూలంలో వెలిసింది.  ప్రాణాయామం అనే సాధన ద్వారా మూలాధారపద్మచక్రమందున్న పద్మావతి అంటే కుండలినీశక్తి జాగృతమై భక్తిమార్గంలో ఊర్ధ్వముఖంగా పయనిస్తూ, ఆ మార్గంలో ఉన్న మిగిలిన చక్రాలను (అన్ని చక్రాలు పద్మావతి స్థానములైన పద్మాలే) అధిరోహిస్తూ, సహస్రారం మీదున్న పరమాత్మ వెంకటేశ్వరునిని యందు లయించడమే కళ్యాణం. 
ప్రతినిత్యం తన కళ్యాణం ద్వారా ఇస్తున్న ఆత్మజ్ఞాన సందేశమిదే. 





9, ఆగస్టు 2012, గురువారం

"కృష్ణ సందేశం"


కృష్ణా!
కృష్ణా!
కృష్ణ అన్న శబ్ధం దివ్యమైనది. 
ఇంతటి దివ్యనామాన్ని పెట్టింది యాదవుల గురువు 'గార్గ మహర్షి'.

శ్రీకృష్ణుడు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంస్థాపనకై అవతరించిన భగవంతుడు. శ్రీకృష్ణ జననమే ఓ అద్భుతం. జననమునుండియే నేను మానవుణ్ణి కాను, భగవంతుడిని అనే భావం ప్రతీ పలుకులో, ప్రతీ పనిలో ప్రస్ఫుటం చేస్తుంటాడు. తను రాకముందే తన మాయను ఈ లోకానికి రప్పించడం, పుట్టినపిమ్మటే అందరినీ మైకంలో పడేసి కారాగారంనుండి బయటపడడం, రెండు పాయలుగా యమునానది చీలి వసుదేవునికి దారి ఇవ్వడం, తనకు ఆడపిల్ల పుట్టినవిషయం గానీ, బిడ్డను తీసుకుపోయి మగపిల్లవాడుని తన ప్రక్కన పెట్టిన విషయంగానీ యశోదమ్మకు తెలియకపోవడం ...... అన్నీ పరమాద్భుతఘటనలే. అలానే బాల్యంనందే పూతనను సంహరించడం, మద్దిచెట్లు రూపంలో ఉన్న నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచన చేయడం, కాళియమర్ధనం, వస్త్రాపహరణం......ఇత్యాది పరమాద్భుత ఘటనలన్నీ భగవంతుని బాల్యలీలలు. పరమాత్ముని లీలలన్నీ పారమార్ధిక సందేశాలే.

ఓం దేవకీ గర్భసంజాతాయ నమః 
ఓం యశోదేక్షణ లాలితాయ నమః 
కృష్ణుడు ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డ. దేవాదిదేవుని కన్నది దేవకీమాతయితే, దేవాదిదేవుని దివ్యలీలలను కాంచినది యశోదమాత. యశోదమాత కాంచిన దివ్యదర్శనములలో ఒకటి -
ఓ దినం ఎప్పటిలాగే కృష్ణుడు, బలరామ గోపబాలకులతో కలిసి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తిన్నట్లు గోపబాలకుల ద్వారా తెలుసుకున్న యశోదమ్మ కృష్ణుని పిలిచి మందలించగా -
అమ్మా! మన్ను దినంగా నేశిశువునో? యా కొంటినో? వెఱ్ఱినో?
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్, నన్నీవు గొట్టంగా వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్యగం
ధమ్మాఘ్రాణముసేసి నా వచనముల్ దప్పైన దండింపవే
అని నోరు తెరిచి చూపగా చిన్నికృష్ణుని నోటిలో చరాచర సృష్టినే కాంచిన ధన్యమాత యశోద.

కృష్ణనామ మహత్యం :-
సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం. 
కృష్ణ దివ్యనామం చాలు - కష్టాలన్నీపోవడానికి.
మానవులు తెలిసి కొంత, తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాగంటే - కృష్ణనామంతో!
నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం మే పరంతప /
ప్రాయశ్చిత్త మశేషాణాం పాపానాం మోచకం పరమ్ //

కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః 
జలం హిత్వా యధా పద్మం నరకాదుద్ధరామ్యహమ్ // 
కృష్ణ కృష్ణా అని నిత్యం జపిస్తే చాలు, నీటిలో ఉన్నను తడి బురదా అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించినవారు నరకలోకబాధలు లేకుండా ఉద్ధరింపబడతారు.  

కృష్ణ కృష్ణ కృష్ణేతి స్వపన్ జాగ్రత్ వ్రజం స్తధా /
యో జల్పతి కలౌ నిత్యం కృష్ణరూపీ భవేద్ధి సః //
కృష్ణ నామాన్ని స్వప్న జాగ్రదవస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు.

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే 
ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం 
నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే 
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే అను ముప్పదిరెండు అక్షరములను కలిగిన షోడశనామమంత్రమే కలియుగ దుష్టప్రభావములనుండి రక్షించును. వేదములన్నింటిని వెదికినను ఈ మహామంత్రమును మించినది మరొకటి లేదు. 

కృష్ణ విగ్రహము ఇస్తున్న సందేశం :-
దేవతా విగ్రహాలు పరిశీలించినట్లయితే అందులో సహజయోగాతత్వము అర్ధమౌతుంది. కృష్ణుని విగ్రహం పరిశీలిస్తే -
౧. కృష్ణుడు నిల్చున్నతీరు గమనిస్తే, ఒక కాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీఅననట్లు ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - అన్నింటా ఉంటూ అంటీముట్టనట్లు ఉండమని. తామరాకుపై నీటిబిందువులాగా దేనికీ అంటకుండా సమతుల్యతాభావంతో జీవించమన్నదే కృష్ణబోధ. 
౨. కృష్ణుని చేతిలో మురళి వెదురుతో చేయబడింది. లోపలంతా ఖాళీ (శూన్యం). ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. అంతరంగములోపల అహం లేకుండా భావాతీతస్థితిలో ఉండమని సూచిస్తుంది. అలానే మురళిలోని ఏడురంద్రాలు మనలోని ఏడు చక్రాలకు సూచన. కృష్ణుడు అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడు. ఏ అహంలేని స్వచ్ఛమైన అంతరంగం మురళి (వేణువు). ఆ వేణువులో తిరిగాడే గాలి ప్రాణవాయువు.
కృష్ణుడు ఎక్కువగా మురళివాయిస్తూ, నాట్యం చేస్తూ, ఆటలాడుతూ జీవితాన్ని అలవోకగా ఆహ్లాదంగా గడుపుతున్నట్లు కన్పించడంలో మానవులు కూడా ఎప్పుడూ పరమానందంలోనే ఉండాలన్న సూచన ఉంది. కృష్ణుడు అంటేనే అపరిమితమైన ఆనందం. అత్యున్నత ఆనందం. ప్రాణాయామం అనే సాధనద్వారా మూలాధారం నుంచి సహస్రారం వరకు శ్వాస (వాయువు) క్రిందకు పైకీ సాగిస్తే తదేకదృష్టి కల్గి మనస్సు ప్రాణంలో, ప్రాణం ఆత్మలో, ఆత్మ పరమాత్మలో లయమైనటువంటి సమాధిస్థితి కల్గుతుంది. ఈ స్థితే సహజయోగ పరమానందకరస్థితి. ఈ స్థితిలో మానవులుండాలన్నదే కృష్ణసందేశం. 
౩. కృష్ణుడి వర్ణం నీలం. అంతులేకుండా అంతటా వ్యాపించిన ఆకాశం ప్రకృతిలో భాగం. శూన్యమైన ఆకాశం నీలివర్ణం. కృష్ణుడుని నీలంరంగులో చూపించడానికి కారణం నిరంతరం ప్రకృతిలోనే ఉన్నాడని, అనంతమై ఉన్నాడని  అర్ధం. ఎప్పుడూ ప్రకృతిలోనే ఉండాలన్న విషయాన్ని నీలంరంగు సూచిస్తుంది. ప్రకృతిలో ఉండడంవలన భూతదయ, సంయమనం, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
౪. దేవాదిదేవుడు, చతుర్దశ భువన భాండాగారుడు, చరాచర సృష్టికి అధిపతి అయినను నెమలిఫించంనే ధరించడంలో సందేశమేమిటంటే ఏ స్థితియందున్న ఏదీ మోయకూడదని, ఆడంబ అహంకారములు లేకుండా నిర్మలంగా నిరాడంబరంగా జీవించాలని.
౫. గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారన్న సందేశముంది.
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః / 
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్ // 
యుద్ధభూమిలో ఉపనిషత్తులనే గోవులనుండి, అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకొని గీత అనే అమృతాన్ని పితికి అందర్నీ ముక్తులను చేసే కృష్ణభగవానుడికి నమస్కరించడం తప్ప ఏమివ్వగలం? అది చాలు అంటాడు బీష్మపితామహుడు -
ఏకోపి కృష్ణస్య కృత ప్రణమో
దశాశ్వమేదావభ్రుదే: నతుల్యః
దశాశ్వమేధీ పునరితి జన్మ 
కృష్ణప్రణామీ న పునర్భవాయ
శ్రీకృష్ణునికి చేసిన ఒక నమస్కారం పది అశ్వమేధాలకు సమానం. పదిసార్లు అశ్వమేధం చేసినవారికైన పునర్జన్మ ఉన్నది. కానీ, కృష్ణునికి ప్రణామం చేసినవానికి మరల జన్మ ఉండదని బీష్ముడు చెప్తాడు.
శత్రుచ్చేదైకమన్త్రం సకలముపనిషద్వాక్యసమ్పూజ్యమన్త్రం  
సంసారోచ్చేదమన్త్రం సముచితతమసః సంఘనిర్యాణమన్త్రమ్ 
సర్వైశ్వర్యైకమన్త్రం వ్యసనభుజగసన్దష్టసన్త్రాణమన్త్రం 
జిహ్వే శ్రీకృష్ణమన్త్రం జప జప సతతం జన్మసాఫల్యమన్త్రం (ముకుందమాలా)
సర్వ శత్రువులను నశింపజేయునది, ఉపనిషద్వాక్యములచే పూజింపబడునది, సంసారమునుండి విడిపించునది, అజ్ఞానాంధకారమును తొలగించునది, సమస్త ఐశ్వర్యములను చేకూర్చునది, ప్రాపంచిక దుఃఖమనెడి విషసర్పకాటుకు గురియైనవారిని రక్షించునది, ఈ జగత్తులో జన్మసాఫల్యమును చేకూర్చునది కృష్ణ మంత్రమే. కాబట్టి 
"ఓ జిహ్వా! దయచేసి శ్రీకృష్ణ మంత్రమునే సతతం జపించుము". 
 



 

3, ఆగస్టు 2012, శుక్రవారం

ఏమని బదులివ్వను?

నా స్నేహితుల్లో ఒకామె కృష్ణభక్తురాలు. ఆధ్యాత్మిక చింతన తనలో ఎక్కువ. తనుంటున్న వీధిలో ఒకరింటిలో ప్రతిగురువారం మధ్యానం రెండు నుండి ఐదు వరకు జరిగే 'సత్సంగం'కి తప్పనిసరిగా వెళ్ళడం, అక్కడ తెలుసుకున్న విషయాలను పదే పదే మననం చేసుకుంటూ ఒకవిధమైన పారవశ్యంతో పదిమందికి ఆ విషయాలను చెప్పడం తనకి అలవాటు. అలానే గురువారంనాటి సత్సంగవిషయాలను శుక్రవారం ఉదయం స్వయంగా వచ్చిగానీ, ఫోన్ ద్వారాగాని నాకు చెప్పడంకూడా తన క్రమం తప్పని అలవాటు.
ఈరోజు ఉదయం ఫోన్ వచ్చిందిగానీ, చేసింది వాళ్ళబ్బాయి. ఆంటీ! అమ్మకి విపరీతంగా కడుపులో నొప్పివస్తే రాత్రే హాస్పిటల్ లో అడ్మిట్ చేశాం. ఇప్పుడు హాస్పిటల్ లోనే ఉన్నాం అని చెప్పిన కాసేపటిలో తన దగ్గరికి వెళ్ళిన నన్ను చూస్తూనే అంతటి నీరసంలో కూడా నిన్నటి సత్సంగపు మాటలు - ...........'ఈ సృష్టంతా సర్వేశ్వరుని స్వప్నసదృశ్యం. సర్వాంతర్యామి స్వప్నమిది. మనమంతా ఆ జగన్నాటకంలో పాత్రలం' అని చెప్తుండగా ఒకింత కోపంతో 'అయితే రాత్రినుండి నీవు పడుతున్న ఈ నొప్పి కూడ స్వప్నమేనా?' అని కాస్త వెటకారంగా వాళ్ళబ్బాయి ప్రశ్నించగా -
"అవునురా, ఇదీ స్వప్నమే. కాకపొతే బాధకరస్వప్నం, ప్రారబ్ధస్వప్నం" అని బదులిచ్చి 'అంతేనా భారతీ, నీవు చెప్పు' అని నన్ను ప్రశ్నించిన తనకి ఏమని బదులివ్వను?
భగవంతుని పట్ల, భగవత్ విషయాలు పట్ల తనకి గల భక్తివిశ్వాసములకు ఏమని బదులివ్వగలను?