13, ఏప్రిల్ 2013, శనివారం

నా రామయ్య జననం ... కళ్యాణం!

                                  శ్రీరామ జయరామ జయజయ రామ 
రామజననం

మధుమాసే సితే పక్షే నవమ్యాం కర్కటే శుభే /
పునర్వస్వ్రక్షసహితే  క్షసహితే ఉచ్ఛస్థే గ్రహపంచకే //

చైత్రమాసం శుక్లపక్షమున నవమినాడు, శుభకరమగు కర్కాటక లగ్నమందు, పునర్వసు నక్షత్రమున ఐదుగ్రహములు ఉచ్ఛస్థానములో యుండగా, సూర్యుడు మేషరాశి యందుండగా మధ్యానకాలమందు సనాతనుడగు పరమాత్మ కౌసల్యకు ఆవిర్భవించెను.


యస్మిన్ రమంతే మునయో విద్యయా జ్ఞానవిప్లవే /
తం గురు: ప్రాహ రామేతి రమణాద్రామ ఇత్యపి //
                                                                                   
జ్ఞానం ద్వారా అజ్ఞానం నశించిపోయిన తరువాత, మునులు ఎవరియందు రమింతురో, ఎవరు తన సౌందర్యంచే భక్తజనుల చిత్తములను ఆనందింపచేయునో అతనికి "రాముడ"ని గురువు వశిష్టుడు పేరు పెట్టెను.

భరణాద్భరతో నామ లక్ష్మణం లక్షణాన్వితమ్ /

శత్రుఘ్నం శత్రుహన్తారమేవం గురురభాషత //


జగత్తును భరించినవాడు కావున రెండవ పుత్రునకు (కైకయి కి పుట్టినవానికి) "భరతుడ"ని, (ఇక సుమిత్రకు పుట్టిన ఇద్దరికి) సమస్త శుభలక్షణ సంపన్నుడు కావున మూడవ వానికి "లక్ష్మణుడ"ని, శత్రుహంత యగుటచే నాల్గవ వానికి "శత్రుఘ్ననుడ"ని వశిష్టులవారు పేర్లు పెట్టిరి. 




 రామకళ్యాణం
తమ రాజ్యమునకు వచ్చిన విశ్వామిత్రుడును, రామలక్ష్మణులును జనకుడు సాదరముగా స్వాగతించగా -
జనక మహారాజా! నీ వద్దనున్న శివధనస్సును చూడాలని రామలక్ష్మణులు అభిలాషించుచున్నారు. ఓసారి ఆ ధనస్సును వారికి చూపమని విశ్వామిత్రుడు అనగా -
అంతట జనక మహారాజు, జనక వంశీయులకు దేవతలు ప్రసాదించిన శివధనస్సును ఎవరు ఎక్కిపెడితే వారికే సీతనిచ్చి వివాహం చేయాలన్న తన సంకల్పమును విశ్వామిత్రునికి తెలిపి,  ధనస్సును తీసుకురమ్మని ఆజ్ఞాపించగా -
జనకుని ఆదేశంతో బలిష్టులైన ఐదువేలమంది పురుషులు ధనుస్సు ఉంచిన పెట్టెను లాక్కొని రాగా -
గురువాజ్ఞ తీసుకొని, అందరూ ఉత్కంఠతో చూస్తుండగా, ధనస్సును శ్రీరాముడు ఎక్కుపెట్టగా, విరిగిపోయిన ధనస్సును సర్వులూ ఆశ్చర్యానందాలతో వీక్షించగా -



 
తన ప్రతిజ్ఞ మేరకు తన ప్రాణతుల్యమైన పుత్రికను రామునికి ఇచ్చి వివాహం చేస్తానని జనకుడు అనగా-
విశ్వామిత్రుని సూచన మేరకు జరిగిన విషయలాను వివరిస్తూ ఆహ్వానపత్రికను దూత ద్వారా అయోధ్యరాజు దశరధునికి పంపగా -
అంతట దశరధుడు ఎంతో సంతోషంతో వసిష్ఠ వామదేవాదులతో, మంత్రులతో, చతురంగబలసైన్యంతో విదేహరాజ్యమును చేరగా -
దశరధుని కులగురువు వశిష్టుడు దశరధుని వంశవృక్షమును జనకునికి తెలపగా, జనకుడు తన వంశవృక్షమును దశరధునికి వివరించగా -
అనంతరం సీతారాముల కళ్యాణమునకు అంతా సన్నద్ధమవ్వగా -
అంగరంగవైభవముగా సీతారాముల వివాహం జరిగినది.




సీతారాముల వివాహం జరిగినరోజు సౌమ్యనామ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, కర్కాటక లగ్నం అని పౌరాణిక కధనం. అయితే భగవంతుడు ఏ అవతారం ఏరోజున దాల్చితే, ఆ రోజునే ఆయన కళ్యాణం జరిపించాలన్న ఆగమశాస్త్రవచనం ప్రకారం; శ్రీరామనవమి నాడే రాముని జన్మదిన వేడుకలతోపాటు సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా, భక్తి పారవశ్యాలతో జరుపుకుంటున్నాం.

ఈ నెల 19 న "శ్రీరామ నవమి". 

 

7, ఏప్రిల్ 2013, ఆదివారం

'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత!

"అచంద్రార్కం యావత్ చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్ఠతి మేదిని" అని వాల్మికి మహర్షి అన్నట్లు సూర్యచంద్రులు వున్నంతకాలం రామాయణం మానవాళిని తరింపజేస్తుంది.

రామాయణం అనే మహాకావ్యాన్ని ఎవరు ఎన్నివిధాల చెప్పినా, ఎవరు ఎన్నిసార్లు రామకధను కొనియాడినా, ఎవరు ఎన్నిసార్లు రామనామ మహత్యమును కీర్తించిన, ఎవరు ఎన్నిసార్లు రామతత్వాన్ని ప్రవచించిన, ఎవరు ఎన్నివిధాల మధించి అమృతరసాన్ని గ్రోలిన, ఎవరు ఎంతగా రామామృతాన్ని ఆస్వాదించిన, ఎవరు దీని సారాన్ని గ్రహించి శ్లాఘించిన .....  తనివి తీరని తపన రామభక్తులది.

రామాయణంలో బయటకు కనిపించనటువంటి ఆధ్యాత్మికమైన నిగూఢసత్యాలు అనేకం వున్నాయి. అందులో ఒకటి - జనకుడు సీతారాములకళ్యాణఘట్టమందు కన్యాదానం చేస్తూ చెప్పిన ధర్మాచరణ ఉపదేశం.
ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీ తవ |

ప్రతీచ్ఛ చ ఏనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయే వానుగతా సదా ||

ఈ శ్లోకం, జనకుడు రాముని చేతిలో మంత్రజలం విడుస్తూ చెప్పింది.
పై శ్లోకమునకు అర్ధం -
'ఇయం సీతా' ఇదిగో సీత. నా పుత్రిక. ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె నీ ధర్మపత్ని. ఈమె పతివ్రతయై, ఎల్లవేళలా సహధర్మచారిణిలా నిన్ను అనుసరిస్తుంది.

అయితే; ఈ శ్లోకం గురించి కొందరు చలోక్తులతో వివరిస్తూ చెప్పినవి ... అక్కడక్కడ, అప్పుడప్పుడూ విన్నవీ, చదివినవీ ... నాకు అర్ధమయినంతవరకు ఈ టపాలో పెడుతున్నాను.

రామా! ఈమె ఎవరో కాదు, 'ఇయం సీతా' ఈమె సీత, నీ భార్యయే, నీవు ఏ ధర్మస్థాపన నిమిత్తం మానవజన్మ తీసుకున్నావో, ఆ ధర్మస్థాపనలో నీకు సహకరించడానికే ఈమె అవతరించినది. ఈమెను నీవిప్పుడు స్వీకరిస్తేనే తప్ప, లోకానికి మంచి జరగదు.  కావున నీవిప్పుడు ఈమెను నీ ధర్మపత్నిగా స్వీకరించు, నీ ధర్మాచరణలో నీ నీడవలె అనువర్తిస్తుంది.

ఎటు చూసిన దివ్యప్రకాశంతో శోబిల్లుచున్న సీతే కనబడడంతో విభ్రాంతికి లోనయి అటుఇటు చూస్తున్న రాముని అవస్థను గమనించిన జనకుడు, రామా!  నీవే 'పుంసాం మోహనరూపాయ' అని, నీవే సుందరుడివి అని అనుకుంటున్నావేమో... 'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత. నా కుమార్తె. ఈమె పాణిని గ్రహించి, ధర్మపత్నిని చేసుకో. ధర్మాచరణలో నిను అనువర్తిస్తుంది.

రామచంద్రా! 'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత. మీరు లక్ష్మీనారాయణులు. లోక కళ్యాణార్ధమై ఈ మానవజన్మ మీరు ఎత్తడానికి ఇలా విడివడినారు. ఈమె చేతిని అందుకొని, ఈమెని నీ ధర్మపత్నిని చేసుకొని, ఇక ధర్మస్థాపన చేయు రామా. నీవు ఏ కారణంచే ఈ రూపంలో అవతరించావో ఆ పని పూర్తిచేయు. నీవు చేసే ఆ ధర్మస్థాపనలో నీ నీడవలె నిను అనుకరించి, సహకరిస్తుంది.

సీత సిగ్గుతో తనచేతిని పట్టుకోమని తనకు తానుగా చెయ్యి చాపలేక సిగ్గుపడడం, అలానే రామచంద్రమూర్తి కూడా, తనకు తానుగా చెయ్యి చాచి సీత చేతిని పట్టుకోవడానికి, పెండ్లికాకముందే ఇంత తొందరా? ఎంత రసికుడయ్యా రామచంద్రుడు అని ఎదురుగా కూర్చొని కల్యాణం తిలకిస్తున్నవారు భావింతురని బిడియపడడం గమనించిన జనకుడు, తానే సీత చేతిని రాముని వైపుకు త్రోస్తూ, 'ఇయం సీతా' ఈమె సీత, నా కుమార్తె, ఈమె చేతిని గ్రహించి నీ ధర్మపత్నిని చేసుకో, నిను నీడలా అనుకరిస్తుంది.

రామయ్యా! ఎదురుగా ఉన్న సీత నీకు కానరాలేదని కాదయ్యా... 'ఇయం సీతా' ఈమె సీత అని చెప్తున్నది; నీవు శివధనస్సును ఎక్కిపెట్టినప్పుడే అర్ధమైంది - నీవు విష్ణువే అని! నీ ధర్మపత్నియైన లక్ష్మీదేవియే ఈ సీత అని నీవు గ్రహించాలనే 'ఇయం సీతా' అని చెప్తున్నానయ్యా. ఈమె చేతిని అందుకొని నీ ధర్మపత్నిని చేసుకో, నిన్ను నీడలా అనుగమిస్తుంది.

'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత. సీతా ... ఇదేం పేరు అని యెంచకు. ఈమె నాగటిచాలుకి తగిలి, తనకు తానుగా పైకి లేచిన బాలిక. ఈమె అయోనిజ. ఈమె సీత అని, నాకు కూతురు అవుతుందని అశరీరవాణి చెప్పింది.  ఏ ఫలాపేక్ష లేక, కర్షకునికి భూమాత ఎట్లు ఫలములను కలిగించునో, అట్లే; నా సీత కూడా ఏ ఫలాపేక్ష ఆశించక, నీ ధర్మస్థాపనలో నీకు సహకరిస్తుంది. తల్లి భూదేవి వలెనె సహనంతో నీకు సహకరిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీవీమెను నీ ధర్మపత్నిగా గ్రహించు.

'ఇయం సీతా' ఈమె సీత, నా కుమార్తె. నీకు సహధర్మచారిణి. నీతో కలసి ధర్మమూ ఆచరిస్తుంది. నీవు చేసే ధర్మస్థాపనలో నీకు తోడై యుండి, నీ ధర్మకార్యం సఫలమగునట్లు చూస్తుంది. నీవు ఎట్లు నీ తండ్రి వాక్యం శిరసావహించి పాలించుచున్నావో, ఈమెయూ నీ వాక్యం పాలించి, నీవు నిర్వహించు ధర్మకార్యములన్నింటిలో నీకు తోడై యుండును.

'ఇయం సీతా' ఈమె సీత. పరమాత్మవైన నీకు సహధర్మచారిణి. నీ సహధర్మచారిత్వమీమెకు సహజసిద్ధం. ధర్మఉద్ధరణకై నీవు చేయు కార్యములయందు సహధర్మచారిణియై నీకు సహకరించడానికి 'సీత'లా అవతరించిన ఈమె పరమాత్మానుగ్రహంతో నా కుమార్తె. నీ ధర్మచారణలో తోడై వుండే ఈమెను నీవు స్వీకరించి, ధర్మస్థాపన చేయు.

మన హిందూ వివాహపద్ధతిలో వధూవరులిద్దరూ గృహస్థాశ్రమంలో ఆచరించవలసిన ధర్మములలో ధర్మానికే ప్రముఖత్వం ఉంది. వివాహమనేది ప్రధానంగా ధర్మాచరణకొరకై నియమింపబడినది. అర్ధకామాలకంటే ధర్మమే ప్రధానమైనది కావున భార్యను ధర్మపత్ని అంటారు.
వివాహఘట్టమందు -
'నాయనా! ఈమె నా కుమార్తె. ఈమెను నీ భార్యగా స్వీకరించు. నీవు చేసే సకల ధర్మాచరణలయందు సహధర్మచారిణిలా నిన్ను అనువర్తిస్తుంది. ఇక నా కుమార్తె చేతిని అందుకుని, ప్రేమగా చూసుకో' అని వరునికీ,
అలానే వధువునకు - 'తల్లీ! నీవు నీ భర్తని ఛాయలా వెంబడించు. నీ భర్తకు నీడలా వెన్నంటే ఉండు, అతని పనుల యందు సహకరించు' .....
అన్న సందేశం జనకునిది. జనకుడు అంటే తండ్రి అని అర్ధం. జనకుడు సీతకు మాత్రమే తండ్రిగా కాదు, సర్వులకు తండ్రే, ముఖ్యంగా వధువులందరకు ఆయన తండ్రే. ఆయన కన్యాదానం చేస్తూ చెప్పిన పై శ్లోకంలో సందేశం అందరు వధూవరులకు ఆచరణీయం.